దాస‌రి చెప్పింది.. జ‌గ‌న్ చేస్తుంటే, ఇన్ని మంట‌లా!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి ఏ స‌మ‌స్య విష‌యంలో అయినా ప‌రిష్కారానికి త‌న ఇంటిని కేరాఫ్ అడ్ర‌స్ గా మ‌లుచుకున్న సినిమా వ్య‌క్తి దాస‌రి నారాయ‌ణ రావు. దాస‌రి మ‌ర‌ణం త‌ర్వాత ఇండ‌స్ట్రీ పెద్ద…

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి ఏ స‌మ‌స్య విష‌యంలో అయినా ప‌రిష్కారానికి త‌న ఇంటిని కేరాఫ్ అడ్ర‌స్ గా మ‌లుచుకున్న సినిమా వ్య‌క్తి దాస‌రి నారాయ‌ణ రావు. దాస‌రి మ‌ర‌ణం త‌ర్వాత ఇండ‌స్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది అని వ్యాఖ్యానించ‌ని న‌టుడు కానీ, ద‌ర్శ‌కుడు కానీ లేరు. దాస‌రి ఏ స‌మ‌స్య‌ను అయినా ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నించే వార‌ని, రాజ‌కీయాల్లో తిరిగిన వాడే అయినా.. ముఖ్య‌మంత్రిగా ఎవ‌రున్నా సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను వారి దృష్టికి తీసుకెళ్ల‌డంలో చొర‌వ చూపేవార‌ని, దాస‌రి త‌ర్వాత మ‌రొక‌రు ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డం కాదు క‌దా, అలాంటి శ‌క్తి కూడా ఎవ‌రికీ లేద‌ని అనేక మంది సినిమా వాళ్లే వ్యాఖ్యానించారు. 

కులాల వారీగా స్ప‌ష్ట‌మైన విభ‌జ‌న ఉన్న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో అన్ని కులాల న‌టీన‌టుల‌కూ, ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు పెద్ద‌మ‌నిషిగా దాస‌రి చ‌లామ‌ణి అయ్యారు. మ‌రి త‌న మ‌ర‌ణానికి కొన్ని రోజుల ముందు దాస‌రి నారాయ‌ణ రావు ఇదే సినిమా టికెట్ల అంశం గురించి టీవీ9 కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. స్పందించారు. 

ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం సినిమా టికెట్ల విష‌యంలో ఏ నియంత్ర‌ణ అయితే చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోందో ఇదే ప‌ని చేయ‌మ‌ని దాస‌రి ఆనాడు వాపోయారు! రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఏం చేస్తున్నాయి? అని దాస‌రి నాడు ప్ర‌శ్నించారు. సినిమా టికెట్ రేట్ల‌పై నియంత్ర‌ణ లేక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వాల‌కు వంద‌ల కోట్ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లుతోంద‌ని కూడా దాస‌రి అన్నారు. అంతే కాదు.. తాము సినిమాల‌కు పెడుతున్న బ‌డ్జెట్ కూ, టికెట్ రేటును భారీగా పెడితే త‌ప్ప వ‌ర్క‌వుట్ కాదంటున్న నిర్మాత‌ల‌పై కూడా దాస‌రి అప్పుడే విరుచుకుప‌డ్డారు. 

ఆ ఇంట‌ర్వ్యూలో టికెట్లు, హీరోల రెమ్యూనిరేష‌న్ ల గురించి దాస‌రి చేసిన ఘాటైన వ్యాఖ్య‌లు ఇప్పుడు వీడియో రూపంలో వైర‌ల్ అవ‌తున్నాయి. దాస‌రి ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే.. ''ప‌ది రూపాయ‌లు అని టికెట్ నిర్దేశించిన త‌ర్వాత ప‌ది రూపాయ‌ల‌కే టికెట్ ను అమ్మాలి. కానీ ఫ్లాట్ రేటు అని చెప్పి..రెండు వంద‌ల రూపాయ‌లు అని చెప్పి టికెట్ల‌ను అమ్మేసి, అవే మా క‌లెక్ష‌న్లు అని చెబుతూ ఉంటే. బెనిఫిట్ షోలు అని చెప్పి, ప‌దివేల‌కూ ప‌దిహేను వేల‌కూ టికెట్లు అమ్ముకుంటూ ఉంటే…ఐదు వంద‌లు కెపాసిటీ ఉన్న థియేట‌ర్లో వెయ్యి మందిని కూర్చోబెట్టి సినిమాలు చూపిస్తూ ఉంటే.. ఇది చ‌ట్ట‌బ‌ద్ధ‌మా? ఇలాంటి విష‌యంలో ప్ర‌భుత్వం ఎందుకు క‌ళ్లు మూసుకుంటుంది?

ఎన్నో సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వం ఈ బుకింగ్ ను ఏర్పాటు చేస్తే అదెందుకు అమ‌ల్లోకి రావ‌డం లేదు? ఇ బుకింగ్ ను అమ‌లు చేస్తే ప‌ది రూపాయ‌ల టికెట్ ప‌ది రూపాయ‌ల‌కే తెగుతుంది. ఎందుకు రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఈ ప‌ని చేయ‌డం లేదు? ఈ ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలూ వంద కోట్ల రూపాయ‌ల పై నే రెవెన్యూని లాస్ చేసుకుంటూ ఉన్నాయి. ప్ర‌భుత్వానికి న‌ష్టం క‌లుగుతున్న అంశం డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు చేరుతోంది. వారి నుంచి హీరోల‌కు అందుతూ ఉంది.

హీరోల‌కు భారీ పారితోషికాలు ఇస్తామంటూ నిర్మాత‌లు ఎందుకు వెళ్తున్నారు? రూపాయి విలువ‌న్న దానికి ప‌ది రూపాయ‌లు ఇస్తామంటూ ఎందుకు వెళ్తున్నారు?  నాగేశ్వ‌ర రావు గారూ, రామారావుగారూ, కృష్ణ‌గారూ, కృష్ణంరాజుగారూ, చిరంజీవిగారూ.. వీరంద‌రితోనూ సినిమాలు చేసిన‌ప్పుడు నిర్మాత‌లు ఇలాగే చేశారా? అలాంట‌ప్పుడు లాభాలు రాలేదా. గ‌త ఐదారేళ్లుగా ఇలా ఎందుకు చేస్తున్నారు.

ముందు రెండు ప్ర‌భుత్వాలూ క‌ళ్లు తెర‌వాలి. దోపిడీ జ‌రుగుతోంది. ఆ దోపిడీని ఆపాలి. సినిమా విడుద‌లైతే ప‌ది రూపాయ‌ల టికెట్ ను రెండు వంద‌ల‌కు అమ్ముతుంటే, యాభై రూపాయ‌ల టికెట్ ను రెండు వేల రూపాయ‌ల‌కు అమ్ముతుంటే, ప్ర‌భుత్వం ఏం చేస్తోంది? ఎమ్మార్వోలు ఏం చేస్తున్నారు?  మీడియా ఏం చేస్తోంది?'' అంటూ దాస‌రి నాడు ఆవేద‌న‌తో ప్ర‌శ్నించారు.

మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇవే అంశాల‌ను ప్ర‌స్తావిస్తోంది. టికెట్ రేటును నిర్ధారిస్తోంది. దీనిపై చాలా మంది మంట‌లు రేపుతూ ఉన్నారు. హీరోల పారితోషకాల అంశం గురించి కూడా దాస‌రే వ్యాఖ్యానించారు క‌దా! హీరోల వెంట ఎందుకు నిర్మాత‌లు అలా ప‌డుతున్నారంటూ మండిప‌డ్డారు క‌దా! స‌మ‌స్య మీ వ‌ద్ద‌నే ఉంది  అని తేల్చారు క‌దా. టికెట్ల రేట్ల విష‌యంలో సినిమా వాళ్ల తీరు చ‌ట్ట‌బ‌ద్ధం కాద‌ని కూడా సినిమా ఇండ‌స్ట్రీ పాలిట పెద్ద మ‌నిషే చెప్పారు క‌దా. 

ప‌ది రూపాయ‌ల టికెట్ ను ప‌ది రూపాయ‌ల‌కే అమ్మాల‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు క‌దా. బెనిఫిట్ షోల పేరుతో జ‌రిగేది అక్ర‌మ వ‌సూళ్లే అని దాస‌రి నారాయ‌ణ రావే అన్నారు క‌దా! మ‌రి దాస‌రిపై అపార గౌర‌వ‌మ‌ర్యాద‌లు చాటుకుంటూ, ఆయ‌న ఇండ‌స్ట్రీకి మార్గ‌ద‌ర్శి అని ఇండ‌స్ట్రీనే ఒప్పుకుంటుంది. అలాంట‌ప్పుడు దాస‌రి నాడు ప్ర‌స్తావించిన అంశాల‌నే నేడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంటే ఇప్పుడు సినిమా బ్యాచ్ స్పందించడాన్ని ఏమ‌న‌లాబ్బా? దాస‌రి నాలుగేళ్ల కింద‌ట అలా స్పందించారు. 

ఇప్పుడు ప్ర‌భుత్వ జీవో లో కూడా టికెట్ ను ఫ్లాట్ గా చూసుకుంటే..వంద రూపాయ‌ల వ‌ర‌కూ ఉంది! ఇలా చూసినా.. దాస‌రి చెప్పిన దాని క‌న్నా ప్ర‌భుత్వం ఉదారంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది! అయినా ఇంత బాధ‌? కక్ష సాధింపు అంటూ గంగ‌వెర్రులెత్త‌డ‌మా!