రామ్ చరణ్ ఆల్రెడీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో తారక్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సుధీర్ బాబు లాంటి హీరోలు బాలీవుడ్ లో గెస్ట్ రోల్స్ చేశారు. ఇక ప్రభాస్ అయితే బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా మారిపోయాడు. మరి అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు?
పుష్ప సినిమా నార్త్ లో హిట్టవ్వడంతో ఇప్పుడీ చర్చ ఎక్కువైంది. తమ హీరో స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేయాలంటూ అల్లు అర్జున్ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తోంది. ఇదే ప్రశ్న బన్నీకి కూడా ఎదురైంది.
“మంచి స్క్రిప్ట్ దొరికి, అందులో నా పాత్ర ఎక్సయిటింగ్ గా ఉంటే ప్యూర్ బాలీవుడ్ సినిమా చేయాలని ఉంది. గతంలో అలాంటి ఆఫర్ వచ్చింది. కానీ వర్కవుట్ కాలేదు. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ జరుగుతుందేమో చూడాలి. ఓ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకొని, మరో ఇండస్ట్రీలో ప్రయత్నించడానికి చాలా ధైర్యం కావాలి. రిస్క్ చేయాల్సిందే. నేను రెడీ.”
అయితే తన బాలీవుడ్ డెబ్యూకు కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు బన్నీ. ప్రస్తుతం బాలీవుడ్ లో నడుస్తున్న ఇద్దరు హీరోల ట్రెండ్ ను తను ఫాలో అవ్వనంటున్నాడు. దయచేసి మేకర్స్ ఎవ్వరూ తనను సెకెండ్ హీరో రోల్స్ కోసం సంప్రదించొద్దని క్లియర్ గా చెబుతున్నాడు.
“ప్రస్తుతం బాలీవుడ్ లో నడుస్తున్న పద్ధతికి నేను విరుద్ధం. ఇద్దరు హీరోలుండే హిందీ సినిమాలో నేను సెకెండ్ హీరోగా చేయను. మన సినిమాల్లో మనం హీరోగా ఉన్నప్పుడు, మన దగ్గరకొచ్చే మేకర్స్ కూడా హీరో పాత్రలతోనే రావాలి. అది కాకుండా రెండో హీరో పాత్ర చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. అంతేకాదు, ఎదుటి వ్యక్తి కూడా మనల్ని సెకెండ్ హీరోగా చేయమని అడగలేడు. అది కరెక్ట్ కాదని అతడికి కూడా తెలుసు. భాష ఏదైనా మెయిన్ హీరోగా చేయాల్సిందే.”
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఉత్తరాదిన మంచి కలెక్షన్లు రాబట్టింది. త్వరలోనే పుష్ప-2 స్టార్ట్ చేయబోతున్నాడు ఈ హీరో.