బాబు పరువు మంటగలవడానికి మరో అవకాశం..!

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ రాజకీయంగా చంద్రబాబుకి ఊరటనిచ్చే అంశం ఒక్కటీ లేదు. స్థానిక ఎన్నికలు, మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలు.. అన్నిట్లో ఘోర పరాభవాలే ఎదురవుతున్నాయి. కుప్పం మున్సిపాల్టీ ఓటమితో ఈ…

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ రాజకీయంగా చంద్రబాబుకి ఊరటనిచ్చే అంశం ఒక్కటీ లేదు. స్థానిక ఎన్నికలు, మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలు.. అన్నిట్లో ఘోర పరాభవాలే ఎదురవుతున్నాయి. కుప్పం మున్సిపాల్టీ ఓటమితో ఈ పరాభవభారం పతాక స్థాయికి చేరింది. అయినా బాబుకి మరో అవకాశం వచ్చింది. 

ఏపీలో మిగిలిపోయిన 22 మున్సిపాల్టీలకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఇప్పటినుంచే బాబు కసరత్తులు ప్రారంభించారు. ముందుగానే రంకెలేస్తూ, సవాళ్లు విసురుతూ, పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు. ఆ మున్సిపాల్టీల్లో కూడా పూర్తిగా ఓడిపోతే.. బాబు పరువు పూర్తిగా మంటకలిసినట్టవుతుంది.

రెండేళ్లుగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు బాబు. ఎక్కడ ఏ ఏడుపు మొదలు పెట్టినా.. ప్రజా వేదిక కూల్చారంటూ స్టార్ట్ చేస్తారు. ఏ ప్రెస్ మీట్ పెట్టినా అదే ఊకదంపుడు ప్రసంగం. కానీ ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత ఇదీ అంటూ ఎక్కడా నిరూపించలేకపోయారు. 

ప్రతిపక్షంలో ఉండి.. రోజు రోజుకీ ఇంత బలహీన పడిన నేత బహుశా చంద్రబాబు ఒక్కరేనేమో. మరోవైపు నవరత్నాలను ఒక్కొక్కటిగా పట్టాలెక్కించి జగన్ బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పదే పదే సవాళ్లు విసిరి తన పరువు పోగొట్టుకుంటున్నారు.

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు పరువు పూర్తిగా మంటగలిసింది. అప్పటి ఎన్నికల కమిషనర్ ని గుప్పెట్లో పెట్టుకుని నాటకాలాడినా కూడా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా స్థానిక ఎన్నికలతో ఏదో చేసేద్దాం, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిరూపిద్దామనుకున్న బాబు.. చివరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పించుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో మున్సిపాల్టీలో జెండా ఎగరేయలేనంత దీన స్థితికి దిగజారిపోయారు.

తిరుపతి, బద్వేల్.. ఇలా ఏ బైపోల్ చూసుకున్నా జగన్ గ్రాఫ్ పెరిగిందే కానీ తగ్గలేదు. కానీ ఉనికి కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా చంద్రబాబు పదే పదే ప్రభుత్వంపై ఎగిరెగిరి పడుతున్నారు. తాజాగా 22 మున్సిపాల్టీలకు జరగాల్సిన ఎన్నికలపై బాబు దృష్టి పెట్టారు. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని, మున్సిపాల్టీల్లో అత్యథికశాతం గెలవాలంటూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

అయితే ఈ ఎన్నికల్లో గెలుస్తామనే ఉత్సాహం కానీ, గెలుపుపై ధీమా కానీ టీడీపీ నాయకుల్లో లేవు. బాబు ఆదేశాలకు ఊ కొట్టడం, ఊరికొచ్చిన తర్వాత డీలా పడటం వారికి అలవాటుగా మారింది. ఈ 22 మున్సిపాల్టీలను కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే బాబు ఓటమి పరిపూర్ణం అవుతుంది.

అమరావతికి రెఫరెండం పెట్టండి, వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయండి, కనీసం ఆ రెండు జిల్లాల్లో అయినా ఎన్నికలు పెట్టండి అంటూ గతంలో హడావిడి చేసిన బాబు.. అంది వచ్చిన ఏ ఎన్నికను కూడా సక్రమంగా ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న మున్సిపాల్టీల్లో కూడా పరాభవం ఎదురైతే.. ఎన్నికలకు టైమ్ తరుముకొస్తున్న వేళ బాబు మరింత డీలా పడటం ఖాయం.