టీఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఊసే లేని టీడీపీ…!

తెలంగాణలో టీడీపీ కథ క్రమంగా ముగిసిపోతూ ఉంది. ఒకలాగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో టీడీపీ కథ కంచికి వెళ్లిపోయినట్లే. కాలక్రమంలో పూర్తిగా కనబడకుండాపోయే ప్రమాదముంది. గుప్పెడుమంది నాయకులు మినహా ఆ పార్టీలో ఎవరూ లేరు.…

తెలంగాణలో టీడీపీ కథ క్రమంగా ముగిసిపోతూ ఉంది. ఒకలాగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో టీడీపీ కథ కంచికి వెళ్లిపోయినట్లే. కాలక్రమంలో పూర్తిగా కనబడకుండాపోయే ప్రమాదముంది. గుప్పెడుమంది నాయకులు మినహా ఆ పార్టీలో ఎవరూ లేరు. ఉన్నవారు అలా ఉండటం తప్ప కొత్తగా ఆ పార్టీలోకి వచ్చేవారెవరూ లేరు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల హడావుడి నడుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. సహజంగానే మొదటి స్థానంలో టీఆర్‌ఎస్‌ ఉంది. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి పోటీ ఎక్కువగా ఉంది. దీంతో సహజంగానే తిరుగుబాటుదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారిని బుజ్జగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనుకోండి. సరే…ఇదంతా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. 

టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెసు పార్టీలకు అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉంది. చాలా చోట్ల ఈ పార్టీలకు అభ్యర్థులు దొరక్కపోవడంతో పార్టీలు డీలా పడుతున్నాయి. అభ్యర్థులు దొరకని చోట్ల స్వతంత్రులకు ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తాయి. రాష్ట్రంలో అంతో ఇంతో బలమున్న కాంగ్రెసు, బీజేపీలకే అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంటే ఇక టీడీపీ పరిస్థితి చెప్పేదేముంది? మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి  మీడియాలో వస్తున్న వార్తల్లో టీడీపీ ఊసే లేదు. ఆ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. టీడీపీ తరపున పోటీ చేస్తామనేవారు చాలా చాలా తక్కువ. కొంతకాలం కిందట హైదరాబాదుకు వచ్చిన అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాల్సిందేనన్నారు. పార్టీకి బలమున్న చోట్ల అభ్యర్థులను నిలబెట్టాలన్నారు. కాని ఎక్కడ బలముందని నిలబెడతారు? 

ఈ ఎన్నికల్లో పొత్తులు కూడా సాధ్యం కాలేదు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేస్తున్న పార్టీలు టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెసు మాత్రమే. టీడీపీ పరిస్థితే అధ్వానంగా ఉండగా ఇక కమ్యూనిస్టు పార్టీలు, టీజేఎస్‌ సంగతి చెప్పేదేముంది? ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు కల్పించుకునే అవకాశమే లేదు. అమరావతిలో ఆయన పోరాటానికి నాయకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. తెలంగాణలో టీడీపీ అనే రాజకీయ పార్టీ ఉందని ప్రజలకు తెలియచెప్పడం కోసం పోటీ చేయడం తప్ప మరే ఆశలూ లేవు. చంద్రబాబు అప్పుడప్పుడు హైదరాబాదుకు పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఉంటారు. 

పార్టీని ఎలా నడిపించాలో సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఆ సమయంలోనే పార్టీకి పునర్వైభవం తేవాలని చెబుతుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ మళ్లీ కనబడాలని అంటుంటారు. కాని ఆయన కలలు నెరవేరేలా కనబడటంలేదు. పార్టీకి మళ్లీ వైభవం తేవడానికి శ్రమించే నాయకులు లేరు. జనం టీడీపీని ఆదరించే పరిస్థితి లేదు. ఒకప్పుడు టీడీపీ హైదరాబాదులోని ఆంధ్రా సెటిలర్ల మీద ఆశలు పెట్టుకునేది. రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014 ఎన్నికల్లో సెటిలర్ల మీద పెట్టుకున్న ఆశలు నెరవేరాయి. కాని క్రమంగా సెటిలర్లు టీఆర్‌ఎస్‌ వైపు మళ్లిపోయారు. 

విభజన తరువాత జరిగిన అనేక ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. హైదరాబాదులో ఆంధ్రా మూలాలున్న కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు క్రమంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరే గెలిచారు. వారిలో ఒక ఎమ్మెల్యే టీడీపీకి దూరమయ్యాడు. వచ్చే ఎన్నికలనాటికి పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందేమో. ఏది ఏమైనా తెలంగాణలో టీడీపీ అట్టడుగున పడి కనిపించని చరిత్రేనని చెప్పుకోవచ్చు.