బెయిల్ తేలాకే ఉమ్మడి కార్యాచరణ?

ఉమ్మడి కార్యాచరణ దిశగా ఉద్యమిస్తామని తెలుగుదేశం మిత్రపక్షం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించి మూడు రోజులు దాటేస్తోంది. తెలుగుదేశం పార్టీ బంధాన్ని తెగ్గొట్టే ప్రయత్నం వద్దని, ఆ పార్టీ నాయకులను ఏమీ అనొద్దని,…

ఉమ్మడి కార్యాచరణ దిశగా ఉద్యమిస్తామని తెలుగుదేశం మిత్రపక్షం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించి మూడు రోజులు దాటేస్తోంది. తెలుగుదేశం పార్టీ బంధాన్ని తెగ్గొట్టే ప్రయత్నం వద్దని, ఆ పార్టీ నాయకులను ఏమీ అనొద్దని, వాళ్లు అన్నా కూడా సంయమనం పాటించమని, ఇంకా చాలా చాలా ముచ్చట్లు చెప్పి, తన పార్టీ కార్యకర్తలను తగ్గి వుండమనేలా ప్రసంగించి కూడా రెండు రోజులు దాటి పోయింది.

చంద్రబాబు అరెస్ట్ మీద ఆగస్టు సంక్షోభం, సారా ఉద్యమం తరహాలో నడిపిస్తున్న నిరసన ఉద్యమాలు కూడా ఓ కొలిక్కి వచ్చేసాయి. ఈ రోజు వినాయకచవితి. ఈ పది రోజులు ఊళ్లలో చవితి హడావుడిలు. అందువల్ల అసలే అంతంత మాత్రంగా, అనాసక్తిగా నిరసన తెలియచేస్తున్న తెలుగుదేశం శ్రేణులు ఇక పెద్దగా ఈ విషయంలో ఇన్ వాల్వ్ కావడం కష్టం. పైగా ఇక్కడ ఇంకో సమస్య వుంది. నాలుగేళ్లుగా నిద్రపోయిన తెలుగుదేశం మాజీలు అంతా వళ్లు విరుచుకుని మళ్లీ తామే అభ్యర్థులము అన్నట్లు హడావుడి మొదలు పెట్టారు. అందువల్ల వారి అనుచరగణం తప్ప వేరే ఆశావహుల అనుచరులు సైలంట్ గా వున్నారు.

ఇలాంటి నేపథ్యంలో బాబుగారి కోసం రొడ్డెక్కి హడావుడి చేసి, అవసరం అయితే తన్నులు తినడానికి సిద్దపడే ‘ఫ్రెష్’ కార్యకర్తలు కావాలి. అలాంటి వారంతా జనసేనలోనే వున్నారు. అందుకే అర్జంట్‌గా పవన్ ను పట్టుకువచ్చి, చేతికి మైక్ ఇచ్చి, తాము బుద్దిగా చేతులు కట్టుకుని, అతగాడి ఇగోను సంతృప్తి పరిచి, పొత్తు ప్రకటన చేయించారు. 

ఇప్పుడు అఫీషియల్‌గా జనసేన జనాలు బాబుగారి కోసం రోడ్డు ఎక్కేయచ్చు. జనసేన జనాల మధ్యలో రెండు మూడు తెలుగుదేశం జనాలు కూడా పెట్టేస్తే ఫ్రీగా మైలేజ్ కొట్టేయచ్చు తెలుగుదేశం పార్టీ కూడా.

సరే, ఇదంతా జరగాలి అంటే ముందు ఉమ్మడి కార్యాచరణ్ ఫిక్స్ కావాలి. లోకేష్ బాబు ఢిల్లీలో వున్నారు. పవన్ బాబు మంగళగిరిలో వున్నారో, హైదరాబాద్ వచ్చేసారో మరి. ఈ ఇద్దరూ కూర్చోవాలి. డిస్కస్ చేయాలి. అదీ కాక ఆదేశాలు, ప్లాన్ ఆఫ్ యాక్షన్, స్క్రీన్ ప్లే, డైరక్షన్ ఇవ్వాల్సిన వారు ఇవ్వాలి. దాని కన్నా ముందు బాబుగారికి బెయిల్ రావాలి. బెయిల్ వస్తే అది వేరుగా వుంటుంది.

నేరుగా చంద్రబాబునే జనాల్లోకి తీసుకుపోతారు. తన ఆవేదన, జైలు అనుభవాలు జనాలతో పంచుకుని, సింపతీ తెచ్చుకోవచ్చు. ఒకవేళ బెయిల్ ఆలస్యమైతే అప్పుడు ఉండొచ్చు ఉమ్మడి కార్యాచరణ.