చంద్రబాబునాయుడి అరెస్ట్‌తో టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నారా, నందమూరి కుటుంబాల్లో టీడీపీపై ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఇందుకు వారాంతపు పలుకుల జర్నలిస్ట్ కమ్ ఎండీ ఆజ్యం పోస్తున్నారనే చర్చకు తెరపైకి వచ్చింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. బాబు బెయిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు మూడు నెలలు బెయిల్ రాదని ఒక వర్గం వాదిస్తుంటే, రెండు మూడు రోజుల్లో ఆయన బయటికి వస్తారని మరో వర్గం వాదిస్తోంది. ఇదిలా వుండగా తాజాగా నారా లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని లోకేశ్ భార్య బ్రాహ్మణి అనడంతో ఆ ప్రచారానికి మరింత బలం కలిగించింది.
ఇవాళ చంద్రబాబు కరపత్రికలో లోకేశ్ అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలపై ఆసక్తికర కథనం వచ్చింది. ఒకవేళ లోకేశ్‌ను అరెస్ట్ చేస్తే, బ్రాహ్మణిని రంగంలోకి దింపాలని టీడీపీ ఆలోచిస్తోందని ఆ కథనం సారాంశం. అంతే కదా, టీడీపీకి మరో ప్రత్యామ్నాయం ఏముందని ఎవరికైనా అనిపించొచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ వుంది. నారా, నందమూరి కుటుంబాల మధ్య సదరు మీడియాధిపతి ఆధిపత్య జగడం పెడుతున్నారని నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తన బావ చంద్రబాబునాయుడు జైల్లో వుండడంతో టీడీపీ పగ్గాలను చేపట్టాలని నందమూరి బాలకృష్ణ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. బాబు అరెస్ట్ అనంతరం, టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సీట్లో బాలకృష్ణ ఆసీనులయ్యారు. అంతేకాదు, ఎవరూ భయపడొద్దని, తాను వస్తున్నానని, ప్రత్యర్థుల అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. బాబు తర్వాత పార్టీని నడిపేది తానే అని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో చంద్రబాబు అనుచరుల్లో ఆందోళన మొదలైంది.
బాలయ్య మాటల్ని కనీసం ఆ పత్రిక ప్రచురించలేదంటూ చంద్రబాబు ఏ స్థాయిలో మేనేజ్ చేశారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇవాళ అకస్మాత్తుగా బ్రాహ్మణిని తెరపైకి తేవడం వెనుక నందమూరి నాయకత్వాన్ని చంపే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీపై చివరికి ఆయన వారసుడైన బాలకృష్ణ నాయకత్వాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చిందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
టీడీపీపై బాలయ్య పెత్తనాన్ని నిలువరించేందుకు చివరికి ఆయనపై కూతురైన బ్రాహ్మణి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనే అనుమా నాలు నందమూరి అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ హిందూపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తూ రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్నారని, అంతేకాకుండా పార్టీని నడిపించాలన్న ఉత్సాహంలో ఉన్నారని ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు.
లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేస్తే…తండ్రీతనయులిద్దరూ జైల్లో వుంటే, బాలయ్య కంటే టీడీపీకి మంచి వారసుడు ఎవరుంటారనే ప్రశ్న నందమూరి అభిమానుల నుంచి వస్తోంది. ఎందుకని బాలయ్య నాయకత్వాన్ని అడ్డుకునేందుకు ఆయన కుమార్తె అయిన బ్రాహ్మణిని తెరపైకి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదనే చర్చ జరుగుతోంది. తాజాగా బ్రాహ్మణి పైరును తెరపైకి తేవడం ద్వారా నందమూరి వంశాన్ని పూర్తిగా నాశనం చేసే కుట్ర ఏదో అంతర్లీనంగా బలంగా జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది.