ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శత్రు వైఖరితో సాగుతున్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప, శత్రువులు ఉండరనేది ఏపీలో చెల్లుబాటు కాని మాట అయ్యింది. అధికారంలో ఉన్న వాళ్లు ప్రజాసేవ కంటే, ప్రతీకారంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
ఏపీ అభివృద్ధికి పాటు పడాల్సిన పాలకులు, ఆ విషయంపై తక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. అధికారంలోకి వస్తే ఫలానా మంచి పనులు చేస్తామని చెప్పడం కంటే, ప్రత్యర్థులను టార్గెట్ చేస్తామని బహిరంగంగానే ప్రకటించడం ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ కాలుష్యానికి నిదర్శనం.
ఇప్పటికే నారా లోకేశ్ పాదయాత్రలో రెడ్ డైరీ రాస్తున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే అధికారులతో పాటు ప్రత్యర్థుల భరతం పడతామని చంద్రబాబు, లోకేశ్ బహిరంగంగా వార్నింగ్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేశ్ తమ టార్గెట్ ఎంత మందో తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 150 మంది వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తామని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
దీంతో టీడీపీ అంతు చూసే వైసీపీ నేతల లెక్క తేలినట్టైంది. ఇప్పుడు వైసీపీ ఆ పని చేస్తుందనే కదా టీడీపీ విమర్శిస్తోంది. మరి తామొచ్చినా ప్రతీకార, విద్వేష పాలనే కొనసాగిస్తామంటే ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలనే ప్రశ్నకు లోకేశ్ సమాధానం చెప్పాల్సి వుంటుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తమను వేధించిందనే అక్కసుతో వైసీపీ ప్రతీకార రాజకీయాలకు తెరలేపిందనే విమర్శలను ఎదుర్కొంటోంది.
ఇలా పాలకులు మారినా, వేధింపు రాజకీయాలు మాత్రం కొనసాగిస్తామని నేతలు చెప్పడం గమనార్హం. ఇలాగైతే ఏపీ భవిష్యత్ త్వరగా అంధకారంలోకి వెళ్లడం ఖాయం అని పౌర సమాజం వాపోతోంది.