బొంకరా బొంకరా పోలిగా అంటే.. ‘టంగుటూరు మిరియాలు తాటికాయంత ఉన్నాయని’ అన్నాడట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు నక్కా ఆనందబాబు తీరు అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తమ పార్టీ అగ్రనేతలను కాపాడుకోవడానికి తలా తోకా లేకుండా మాట్లాడుతున్న నక్కా ఆనందబాబు.. జగన్ మాటలు ఈడీ దర్యాప్తును ప్రభావితం చేస్తాయని అంటున్నారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థలో జరిగిన 371 కోట్ల కుంభకోణం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి వణుకు మొదలైంది. ఈ కుంభకోణంలో సీఐడీ, ఈడీ రెండు సంస్థలూ సమాంతరంగా దర్యాప్తు జరుపుతుండడంతో.. ఎవరి పాత్ర ఎంత ఉన్నదో అనే సంగతి త్వరలోనే నిగ్గుతేలుతుంది. నిజానికి ఈడీ దర్యాప్తు మొదలైన తర్వాత రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. చంద్రబాబునాయుడు పాత్ర కూడా వెలుగులోకి వస్తోంది. ముఖ్యమంత్రి కూడా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందనే సంగతి చెప్పారు.
అయితే.. సీఎం ఆ మాట చెప్పడాన్ని తెలుగుదేశం పార్టీ సిగ్గు విడిచి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేది చిత్రమైన సంగతి. ముఖ్యమంత్రి అలా మాట్లాడడం అనేది ఈడీ దర్యాప్తును ప్రభావితం చేస్తుంది కదా.. అని తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు.
అసలు ఈ తరహా మాటలకు తలాతోకా ఉన్నదో లేదో తెలియదు. ఎందుకంటే.. కేంద్రప్రభుత్వ పరిధిలో ఉండే ఈడీ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి ఉండే సంస్థ. పేరుకు కేంద్ర సంస్థ అని చెప్పుకోవాల్సిందే తప్ప.. కేంద్రంలోని పెద్దలకు అణిగిమణిగి ఉంటుందని అనుకోవడం కూడా భ్రమ. అలాంటి ఈడీ.. జగన్ మాటలను బట్టి ప్రభావితం అవుతుందని వారు మాట్లాడడం చాలా హేయంగా ఉంది.
అంతో ఇంతో జగన్ సర్కారు మీద బురద చల్లదలచుకుంటే.. సీఐడీ దర్యాప్తును సీఎం ప్రభావితం చేస్తున్నారు అని అనవచ్చు. ఎందుకంటే.. సీఐడీ రాష్ట్ర పరిధిలోని సంస్థ కాబట్టి! అయితే తెలుగుదేశం నాయకులు సీఐడీ దర్యాప్తు మీద సాగించే అలాంటి ఆరోపణలకు విలువలేకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఈడీకి కూడా జగన్ తో ముడిపెడుతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబబంధించి తండ్రీ కొడుకుల్లో ఎవరో ఒకరు అరెస్టు కావడం అయితే గ్యారంటీ అని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. ఫోర్జరీ సంతకాల సహా అనేక ఆరోపణలు ఈ కేసులో ఎదుర్కొంటున్న చినబాబు లోకేష్ అరెస్టు అవుతారా? లేదా.. సమస్త కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా చంద్రబాబునాయుడే జైలుకు వెళతారా అనేది వేచిచూడాలి.