ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యర్థులపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా పంచ్ విసిరారు. సందర్భోచితంగా ఆయన ప్రత్యర్థులను వ్యంగ్యంతో దెప్పి పొడిచారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే మూడు సార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. రాజకీయ కక్షతోనే కవితను ఇరికించాలని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రయత్నిస్తోందని తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశంలో మోదీ పాలనలో ఆదాయం, వ్యయం ఎవరెవరికి చెందుతున్నాయో మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అదేంటో చూద్దాం.
“ఆదాయం: అదానీకి! వ్యయం: జనానికి, బ్యాంకులకు!, అవమానం: నెహ్రూకి! రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!, బస్, బభ్రాజీమానం భజగోవిందం!, దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!” అని కేటీఆర్ బీజేపీ నేతల పేర్లు ప్రస్తావించకుండానే, మోదీ పాలనలో ఏం జరుగుతున్నదో చెప్పారు.
ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మోదీ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదని తెలిసినా బీఆర్ఎస్ నేతలెవరూ వెనక్కి తగ్గడం లేదు. పైగా మోదీ, అమిత్‌షా ద్వయంతో తాడోపేడో తేల్చుకునేందుకే కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ మరింత హీటెక్కే పరిస్థితి కనిపిస్తోంది.