ఇటీవల సీనియర్ నటుడు నరేశ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తరచూ ఆయన వైవాహిక జీవితంలో చోటు చేసుకుంటున్న అలజడులు, అలాగే నటి పవిత్రతో పెళ్లి విషయాలు మీడియాలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేష్ మరో పెళ్లి ఎలా చేసుకుంటారని రమ్య రఘుపతి నిలదీస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే సందర్భంలో రమ్యపై నరేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బు కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, అలాగే హత్య చేయడానికి కుట్ర పన్నుతోందని కూడా ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పవిత్రతో ఏడడుగులు నడిచినట్టు ఇటీవల ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి మరోసారి చర్చనీయాంశమయ్యారు. నరేశ్ అంటే పదేపదే పెళ్లిళ్లు చేసుకునే నటుడిగా గుర్తింపు పొందారంటే అతిశయోక్తి కాదు.
ఇదే విషయాన్ని సీనియర్ కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ అంటే ఎలా వుంటుంది? సరదాగానే ఆయన అన్నారు. అయితే విషయం మాత్రం సీరియస్. అది కూడా నరేశ్ ఎదుటే తన మనసులో అభిప్రాయాన్ని రాజేంద్రప్రసాద్ వెల్లడించడం గమనార్హం. ఇందుకు నరేశ్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం.
'అన్నీ మంచి శకునములే' చిత్రం యూనిట్ మొదటి సారిగా మీడియా ముందుఒచ్చింది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది పండగ వాతావరణం తలపించేలా నటీనటులు ధోతీలు, చీరలు కట్టుకొని వచ్చారు. ఈ సినిమాలో సీనియర్ నటులు నరేష్, రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. నరేశ్ ధోతీ, లాల్చి, కండువాతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రెస్‌మీట్‌లో రాజేంద్రప్రసాద్ ఒక ప్రశ్నకు సమాధానంగా నరేశ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
'వాడు కత్తి. వాడి రేంజ్ కత్తి మేము కాదు. నేను ఒర. మేమిద్దరం బ్రదర్స్. చూసారా వీడు ఎప్పుడూ పెళ్లి కొడుకులా వుంటాడు' అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. తన మాటలపై రియాక్షన్ ఏంటో నరేశ్‌ను రాజేంద్రప్రసాద్ అడగడం గమనార్హం.
'నేను నిత్యపెళ్లికొడుకులా వుంటాను' అని ఏ మాత్రం మొహమాటం లేకుండా నరేశ్ చెప్పడం విశేషం. ఆ వెంటనే రాజేంద్రప్రసాద్ రియాక్ట్ అవుతూ… 'నిత్య పెళ్లికొడుకువి నువ్వు' అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇటీవల పవిత్రతో నరేశ్‌కు నాలుగో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అందుకే రాజేంద్రప్రసాద్ కూడా తాను బ్రదర్‌గా భావించే నరేశ్ పెళ్లిళ్ల గురించి జనం అనుకుంటున్న మాటనే మీడియా ముఖంగా అనేశారు. రాజేంద్రప్రసాద్ అన్న మాటలు వైరల్ అయ్యాయి.