మనం తాగేది మంచినీరా కాదా..? మంచినీరే అని మీరనుకున్నా అది కేవలం అపోహే. ప్రపంచంలో 200 కోట్ల మంది ప్రజలు మురికినీరునే మంచినీరు అనుకుని తాగేస్తున్నారు. మంచినీరుగా వారికి చేరుతున్నది ముుమ్మాటికీ మురికినీరేనంటోంది ఐక్యరాజ్య సమితి.
ఐక్యరాజ్య సమితి వాటర్ కాన్ఫరెన్స్-2023 న్యూయార్క్ లో మొదలైంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన నివేదిక వాస్తవాలను కళ్లకు కట్టింది. తజికిస్తాన్, నెదర్లాండ్స్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో యూఎన్ వాటర్ కాన్ఫరెన్స్ మొదలైంది. 12 దేశాల అధినేతలు, వివిధ దేశాలకు చెందిన 100 మంది మంత్రులు.. మొత్తం 6500మంది ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.
ప్రపంచ జనాభాలో 10శాతం మంది తీవ్రమైన నీటి కొరతతో అల్లాడిపోతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. రోజువారీ అవసరాలను పక్కనపెడితే కనీసం తాగేందుకు కూడా వారికి గుక్కెడు నీరు దొరకడంలేదు. జనాభా పెరుగుదలతో పాటు, నీటి వనరుల తరుగుదల దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతకంటె పెద్ద కారణం నీటి వనరుల దుర్వినియోగం. ధనిక వర్గం సురక్షిత నీటి కోసం డబ్బుల్ని మంచినీళ్లలా ఖర్చు పెడుతుంది. వారికి నీటి విలువ తెలియకపోవడంతో దుర్వినియోగం పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
నిలకడలేని నీటి వినియోగం, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్.. వీటన్నిటి వల్ల నీటి కష్టాలు మానవుడిని చుట్టుముడుతున్నాయి. ప్రపంచం ఇప్పటికే ప్రమాదకర మార్గంలో పయనిస్తోందని, ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ప్రపంచ నీటి సంక్షోభం-ప్రభావం పేరుతో రిచర్డ్ కానర్ తయారు చేసిన నివేదికకు గుటెరస్ ముందుమాట రాశారు.
డ్రైనేజీ నీరు కలవడం వల్లే మంచినీరు ప్రధానంగా కలుషితంగా మారుతోంది. ఇది ప్రభుత్వాల మంచినీటి సరఫరాను వెక్కిరిస్తోంది. అధిక సంఖ్యలో ఔషధాల వినియోగం, రసాయనాలు, పురుగుమందుల వాడకం, మైక్రోప్లాస్టిక్ లు, నానో మెటీరియల్స్ నుండి వచ్చే కాలుష్యం దీనికి అదనం.
2030 నాటికి అందరికీ సురక్షితమైన తాగునీరు అందాలంటే, ఇప్పుడు ప్రభుత్వాలు మంచి నీటి కోసం వెచ్చిస్తున్న పెట్టుబడులను మూడు రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ధనవంతులు ఎక్కడున్నా వారికి మంచినీరు అందుబాటులోకి వస్తోంది, ఇబ్బందులన్నీ పేదలకే అని ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ స్పష్టంగా చెబుతోంది.