తెలంగాణను కేటీఆర్ తన రాజ్యం అనుకుంటున్నారా?

తెలంగాణ అనేది ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక రాష్ట్రమా? లేదా అది తన సొంత జాగీరు, సొంత రాజ్యం అని కల్వకుంట్ల తారక రామారావు అనుకుంటున్నారా.. అనేది అర్థం కావడం లేదు.  Advertisement ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో…

తెలంగాణ అనేది ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక రాష్ట్రమా? లేదా అది తన సొంత జాగీరు, సొంత రాజ్యం అని కల్వకుంట్ల తారక రామారావు అనుకుంటున్నారా.. అనేది అర్థం కావడం లేదు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 241 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ.. అరెస్టు అయి ప్రస్తుతం రిమాండ్ జీవితం గడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం నాయకులు అవకాశం ఉన్న ప్రతి చోట నిరసన తెలియజేస్తున్నారు. అలాగే వైసిపి నాయకులు కూడా కౌంటర్ నిరసనలు చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆందోళనలు కొన్ని జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ ఆందోళనల గురించి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లోని పంచాయితీని అక్కడే తేల్చుకోవాలని ఆ విషయంపై తెలంగాణలో ఆందోళనలు చేయడానికి వీలులేదని హుకుం జారీ చేశారు.

భారతదేశం మొత్తం ఒకటే యూనిట్ గా ఉన్నప్పుడు.. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా.. అది దేశంలోని అందరు మనుషులకు వర్తించే వ్యవహారం అని అందరూ అనుకుంటున్నప్పుడు.. ఏపీలో జరిగే వ్యవహారాల గురించి తెలంగాణలో ఆందోళనలు చేయడానికి వీల్లేదని మంత్రి కేటీఆర్ ఎలా అనగలరో అర్థం కాని సంగతి.

మణిపూర్‌లో అల్లర్లు జరిగితే, అరాచకం జరిగితే వాటికి సంబంధించిన నిరసనలు దేశమంతటా వెల్లువెత్తుతాయి. ఇక్కడ చంద్రబాబునాయుడు సచ్ఛీలుడా, ఆయనకోసం దీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నదా? అనేది ప్రస్తావన కాదు. ‘ఏపీలో  పంచాయతీ ఏపీలోనే తేల్చుకోవాలి.. ఇక్కడ రోడ్డెక్కుతామంటే కుదరదు’ అనే మాటల గురించి.

నిజానికి అటు తెలుగుదేశం గానీ, వైఎస్సార్ కాంగ్రెస్ గానీ.. ఇరువురూ జాతీయ పార్టీలుగానే చెలామణీ అవుతున్నారు. తెలంగాణలో వారి పార్టీల అస్తిత్వాన్ని చులకన చేసేలాగా.. ఇక్కడ ఆందోళనలు వద్దని ఆయన ఎలా అనగలరు? చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో తమ పార్టీ తటస్థంగా ఉంటుందని, తమ పార్టీ నాయకులు ఎవరైనా చేసే వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం అని అనడం వరకు ఆయన ఇష్టం. 

నిజం చెప్పాలంటే.. తటస్థం అనే పదమే రాజకీయాల్లో ఒక మాయ. నిర్దిష్టమైన ఆలోచనను తీసుకోలేని వాడు నాయకుడు ఎలా అవుతాడు? చంద్రబాబు అవినీతి చేసి ఉంటే ఆయన శిక్ష అనుభవించాల్సిందే కదా.. అనే మాట చెప్పడానికి కూడా కేటీఆర్ కు భయమెందుకు? తెలంగాణలో ఉండే ఆంధ్ర కమ్మవారి ఓట్లు తమ పార్టీకి రాకుండా పోతాయని ఆయన భయపడుతున్నారా? అనే వాదన వినిపిస్తోంది. ఈ తరహా మాటలు విజ్ఞుడైన నాయకుడికి తగవని పలువురు అంటున్నారు.