జగన్‌ ఈ అరాచకవాదులను ఏమీ అనడా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో కొందరు నాయకులు చాలా అసంబద్ధంగా, అరాచకంగా, వారు నిర్వహిస్తున్న పదవులకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో పదవులు నిర్వహిస్తున్నవారికి ప్రతిపక్షాలపై విరుచుకుపడి అధినేతను సంతోషపెడదామనే ధ్యాస తప్ప…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో కొందరు నాయకులు చాలా అసంబద్ధంగా, అరాచకంగా, వారు నిర్వహిస్తున్న పదవులకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో పదవులు నిర్వహిస్తున్నవారికి ప్రతిపక్షాలపై విరుచుకుపడి అధినేతను సంతోషపెడదామనే ధ్యాస తప్ప జగన్‌కు చెడ్డ పేరు తెస్తున్నామనే ఆలోచన లేదు. ఈ నాయకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్న, నోటికొచ్చిన బూతులు మాట్లాడతున్న తీరు చూసి జగన్‌ ఏమనుకుంటున్నారు? ప్రతిపక్షాలను ఆమాత్రం తిడితేనే మంచిదని అనుకుంటున్నారా? పదవుల ఔన్నత్యాన్ని, గౌరవ మర్యాదలను మంటగలుపుతున్నారని అనుకోవడంలేదా? 

ఎమ్మెల్యేలు మాట్లాడటం వేరు, గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడటం వేరు. వైకాపా నాయకులు ప్రతిపక్షాలను విమర్శిస్తే ఇదంతా రాజకీయాల్లో మామూలే అనుకోవచ్చు. కాని తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను, ఓటర్లను కూడా అవమానిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో యజమానులు ప్రజలేగాని నాయకులు కాదనే సంగతి గుర్తు పెట్టుకోవాలి. అవమానాల పాలవుతున్న ప్రజలు ఇప్పటికిప్పుడు ప్రజలను ఏమీ చేయలేరు. కాని అన్నీ గుర్తు పెట్టుకొని ఎన్నికల్లో తడాఖా చూపిస్తారు. జగన్‌ మూడు రాజధానులు అంటూ ప్రకటించగానే వైకాపా నాయకులు, మంత్రులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవావారు సైతం వీరంగం వేస్తున్నారు. 

ఇలా చేయడం మంచి పద్ధతి కాదని జగన్‌ వీరికి ఎన్నడూ చెప్పలేదా? తాజాగా..శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానెల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌, సినీ నటుడు పృథ్వీ బండారం బయటపడింది. అతని రాసలీలలు, సంస్థలోని ఒక ఉద్యోగినితో 'రొమాంటిక్‌ సంభాషణ' బహిర్గతమయ్యాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఆడియో టైపు అన్ని తెలుగు ఛానెళ్లలో ప్రసారమైంది. పృథ్వీ హాస్య నటుడిగా సినిమాల్లో కొనసాగుతూ ఎవరితోనైనా రొమాన్స్‌ నడిపినా, శృంగార సంభాషణలు మాట్లాడినా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. జనంలో చర్చనీయాంశం అయ్యేదిగాని ప్రభుత్వం పరువు పోయే పరిస్థితి ఉండదు. 

కాని ఇప్పుడు పృథ్వీ పవిత్రమైన టీటీడీ భక్తి  ఛానెల్‌కు అధిపతి. ఈ పదవి స్వీకరించగానే తాను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడినని చెప్పుకొని, స్వామివారికి సేవ చేసుకునే అవకాశం రావడం తన అదృష్టమన్నాడు. కాని ఆయన టేపు విన్న తరువాత ఆయన వెంకటేశ్వరస్వామికి సేవ చేయడానికి రాలేదని, అవకాశవాదంతో వచ్చాడని అర్థమైంది. ఎస్వీబీసీ ఛానెల్‌కు నిజమైన భక్తుడిని, గౌరవప్రదమైన వ్యక్తిని ఛైర్మన్‌గా చేయాలిగాని బూతులు, రాజకీయాలు మాట్లాడేవారిని ఛైర్మన్‌గా చేయడం జగన్‌ తప్పు. పృథ్వీ పదవి చేపట్టినుంచి ఛానెల్‌ కార్యక్రమాల గురించి మాట్లాడకుండా, రాజకీయాలే మాట్లాడుతున్నాడు. 

మూడు రాజధానుల రచ్చ మొదలవగానే అక్కడ సాగుతున్న ఉద్యమం గురించి, రైతుల గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. అవాకులు చెవాకులు పేలుతున్నాడు. ఇక వాసిరెడ్డి పద్మ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌. ఇంతకుముందు అధికార ప్రతినిధిగా ఆమె చేసిన సేవలను గుర్తించిన జగన్‌ ఆమెకు మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవి కట్టబెట్టారు. ఈ పదవిలో ఉన్న పద్మ మహిళల రక్షణ కోసం, వారి హక్కుల కోసం కృషి చేయాలి. కాని ఆమె అలాంటి పనిచేయకుండా ఉద్యమం చేస్తున్న మహిళలను దుర్భాషలాడుతున్నారు. గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పద్మ ఈ పదవికి  ఏం న్యాయం చేస్తున్నట్లు? 

ఇక ఘనత వహించిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యవహారశైలి చూస్తుంటే ఆయన స్పీకర్‌ పదవికి అనర్హుడని కచ్చితంగా చెప్పొచ్చు. మూడు రాజధానులు వ్యవహారం తెర మీదికి వచ్చినప్పటినుంచి తమ్మినేని రెచ్చిపోతున్నాడు. ప్రతిపక్షాలను బూతులు తిడుతున్నాడు. ప్రజలను అవహేళన చేస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్షాన్ని, దాని అధినేతను కించపరుస్తున్నాడు. న్యూట్రల్‌గా, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఉండాల్సిన తమ్మినేని ఆ పదవికి ఉన్న మర్యాదను పూర్తిగా మంటగలిపాడు. గౌరవాన్ని నిలువులోతు పాతిపెట్టాడు. అసెంబ్లీలో ఉంటేనే స్పీకర్‌. ఆ తరువాత అరాచకవాదే. ఇలాంటి నేతలను పదవుల్లో నియమించిన జగన్‌ వీరి గురించి కాసేపు ఆలోచిస్తే మంచిది.