సమీక్ష: అల వైకుంఠపురములో
రేటింగ్: 3/5
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్
తారాగణం: అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, జయరామ్, మురళి శర్మ, సుషాంత్, నివేతా పేతురాజ్, రాజేంద్రప్రసాద్, సముద్రఖని, సచిన్ ఖేడ్‌కర్, రోహిణి, నవదీప్, హర్షవర్ధన్, సునీల్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి తదితరులు
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్
నిర్మాతలు: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
విడుదల తేదీ: జనవరి 12, 2020
''ఏ వ్యక్తికయినా స్థానాన్ని ఇవ్వగలం కానీ స్థాయిని ఇవ్వలేం''… 'అల వైకురఠపురములో' గురించి ఒక్క వాక్యంలో చెప్పమంటే త్రివిక్రమ్ చెప్పిన మాట ఇది. ఈ పాయింట్‌ని ఎవరైనా ఎలాగయినా చెప్పవచ్చు. త్రివిక్రమ్ తనదైన శైలిలో, తనదైన జోన్‌లో, తనకి ఫుల్ కమాండ్ వున్న జోనర్‌లో చెప్పాడు. పురిటి మంచంపై పిల్లల్ని మార్చేయడమనేది పాత తెలుగు సినిమాల్లో పలుమార్లు చూసిన ఘట్టమే. దానిని నేటితరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, కాంటెంపరరీ సెట్టింగ్‌తో, ఇప్పటి వ్యక్తిత్వాలు, భావజాలానికి సెట్ అయ్యేట్టుగా చూపించే ప్రయత్నమే 'అల వైకుంఠపురములో'. నేటి ట్రెండ్ అనగానే వెకిలి హాస్యాన్ని, చీప్‌గా నవ్వులు తెప్పించే అవకాశాన్ని వాడుకోకపోవడం, అటుగా వెళ్లకపోవడం వల్లే ఈ చిత్రం ఈ టైటిల్ అంత హాయిగా, క్లీన్‌గా వుంది.
ఈ ట్రెండ్‌లో ఏది సేల్ అవుతుందనేది చూడకుండా తనదైన శైలిలో ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించడంలోనే త్రివిక్రమ్ ప్రత్యేకత తెలుస్తుంది. 'అల వైకుంఠపురములో' ఆరంభ సన్నివేశం చూసిన తర్వాత ఈ చిత్రం ఎలా ముగుస్తుందనే దానిపై ప్రేక్షకుడికో అంచనా వుంటుంది. కానీ అలా కాకుండా, ప్రేక్షకుడి అంచనాలకి, సెంటిమెంట్లకి అభిముఖంగా ముగించినా కానీ దానిని తన 'మాటలతో' కన్విన్స్ చేయడంలో త్రివిక్రమ్ కలం పదునెంతో ఇంకోసారి స్పష్టమవుతుంది. కథకుడిగా త్రివిక్రమ్ ఎంచుకున్న కథలో ఒక కాగితం కోణానికి మించిన మందం లేదు. కానీ ఆయన రాసుకున్న కథనంలో మాత్రం కదలకుండా కూర్చోపెట్టేంత శక్తి వుంది. ఆయన సృష్టించిన సన్నివేశాల్లో హృదయాలని మృదువుగా తాకేంత లోతు వుంది. అదే ఈ 'అల వైకుంఠపురాన్ని' ఒక వేడుకగా కుటుంబ సమేతంగా చూసేంత రమ్యంగా మార్చింది.
'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు' టైమ్‌లో ఆశువుగా జోకులేసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన త్రివిక్రమ్ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. ఆయన ఆలోచనల్లోను, హాస్యంలోను కూడా మెచ్యూరిటీ వచ్చేసింది. బలవంతంగా నవ్వించే ప్రయత్నం కానీ, ఈజీగా నవ్వులు తెప్పించే వైపుగా ప్రయాణం కానీ చేయలేదు. సన్నివేశంలో భాగంగా హాస్యం వుంటుంది తప్ప 'గ్యాప్' వచ్చిందనో జోక్ పేల్చడం లేదు. మెచ్యూరిటీతో పాటు త్రివిక్రమ్ ప్రెజెంటేషన్‌లో క్లాస్ హైలైట్ ఇందులో బాగా హైలైట్ అవుతుంది. మిడిల్ క్లాస్ కష్టాల మీద జోక్స్ వేసినా, పెంచిన కొడుకుపై వాత్సల్యం చూపించలేని తండ్రి మనస్తత్వం బయట పెట్టినా కానీ త్రివిక్రమ్ క్లాస్ మెయింటైన్ చేసాడు. మిడిల్ క్లాస్ కుర్రాడు తనకంటే హయ్యర్ క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడినా ఆమె కాళ్ళనే ఆరాధిస్తుంటాడు. ఈ చూపుల్లో విపరీతార్థాలు లేక బూతర్థాలు వెతుక్కోకుండా 'నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు' అని కవితో తన భావాన్ని కూడా దర్శకుడు చెప్పిస్తాడు. ఆమెని ఆరాధిస్తున్నా కానీ తనకు తాను తగననేది ఆ కుర్రాడి ఫీలింగు. ఆమెకి మరొక వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అవుతున్నా చిన్న నిరాశ తప్ప నిరసన కనిపించదు. ఇలా ప్రతి అంశంలోను దర్శకుడిగా త్రివిక్రమ్ తన ఆలోచనల స్థాయిని చాటుకున్నాడు.
మధ్య తరగతి వ్యక్తుల మనస్తత్వాలని సున్నితంగా చూపించినట్టుగానే, ధనికుల ఇంట్లో మనుషులు, మనసుల మధ్య వుండే గోడలు వాళ్లు వుండే ఇళ్ళంత బలంగా వుంటాయని కూడా పలు సందర్భాలలో లోతుకి వెళ్లకుండానే తెలియజేస్తాడు. దర్శకుడిగా త్రివిక్రమ్ తనకున్న 'గురూజీ' లెవల్ చూపించిన సందర్భాలు కోకొల్లలు. కథానాయకుడికి తన అసలు తల్లిదండ్రులెవరని తెలియజేసే సన్నివేశం ఎవరైనా కానీ పేజీల కొద్దీ డైలాగులతో పాటు కనీసం ఒక పది నిమిషాల సమయాన్ని అయినా తీసుకుంటారు. కానీ ఆ సన్నివేశాన్ని అంత సింపుల్‌గా, ఎఫెక్టివ్‌గా చెప్పడం, ఎక్కువ డ్రామాకి పోకుండా ఇంటర్వెల్ ఇవ్వడం త్రివిక్రమ్ స్పెషలు. అలాగే భార్యాభర్తల మధ్య వున్న దూరాన్ని తగ్గించే సన్నివేశంలో రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్ మరో మెట్టు ఎక్కినట్టు అనిపిస్తాడు. పతాక సన్నివేశంలో ఫైట్ కామన్ అనేసుకుంటారు కనుక అక్కడో జానపద పాటని నేపథ్యంలో పెట్టి ఫైట్ చేయించడం క్రియేటివ్‌గా మరో బెస్ట్ ఎలిమెంటు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా కథానాయకుడి 'స్థాయి'ని తెలియజేసే అతని చివరి నిర్ణయం రైటర్‌గానే కాకుండా పర్సన్‌గా త్రివిక్రమ్ మెచ్యూరిటీకి సిసలైన నిదర్శనం.
ఏడాది గ్యాప్ రావడంతో అల్లు అర్జున్ రీఎనర్జయిజ్ అయినట్టుగా కనిపించాడు. ఒక పాత్రని పూర్తిగా స్టడీ చేసి, డీప్‌గా దాంట్లో ఇన్వాల్వ్ అవలేకపోతే ఇంత ఎఫెక్టివ్ పర్‌ఫార్మెన్స్ కష్టం. సన్నివేశ బలం లేని సందర్భాలలో కూడా ప్రేక్షకుడు డిస్‌కనక్ట్ అవకుండా తనతో ట్రావెల్ అయ్యేలా చూసుకోవడం అల్లు అర్జున్ నటుడిగా ఎంత ఎదిగాడనే దానికి అద్దం పడుతుందీ చిత్రం. యాక్షన్ సీన్స్‌లో కూడా హీరోలా కాకుండా ఆ సగటు కుర్రాడి తీరు అలాగే కనిపించడంలో అల్లు అర్జున్ హావభావాలతో పాటు అలా వాటిని ప్లాన్ చేసిన దర్శకుడికి కూడా క్రెడిట్ దక్కుతుంది. అల్లు అర్జున్ తర్వాత ఈ కథలో కీలకమైన పాత్ర మురళీ శర్మది. విలన్‌లా కనిపించకుండా తన కొడుక్కి మంచి భోగం ఇవ్వాలనే ఆలోచనలున్న సగటు తండ్రిగా కనిపించడంలో అతని ప్రతిభ తెలుస్తుంది. మురళీ శర్మ చాలా బాగా చేసినా కానీ రావు రమేష్ అయితే ఈ పాత్రకి ఇంకాస్త మాసప్పీల్ వచ్చి వుండేదనిపించింది. పూజ హెగ్డే ఓన్ డబ్బింగ్‌తో తన వంతు చేయాల్సింది చేసింది. టబు, నివేతా పేతురాజ్ లాంటి టాలెంట్‌కి తగ్గ పాత్రలు ఇవ్వలేదనిపించింది. సచిన్ ఖేడేకర్ పాత్ర చాలా ఎఫెక్టివ్‌గా వుంది. జయరామ్ పాత్ర, ఆయన నటన భావోద్వేగాల పరంగా హైలైట్‌గా నిలిచింది. సినిమా నిండా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వున్నా కానీ వారి స్థాయికి న్యాయం చేయలేదనేది ఓ వెలితి.
ఈ చిత్రానికి తన పాటలతోనే హైప్ తీసుకు వచ్చిన తమన్ ఈ చిత్రానికి మరో హీరోలా నిలిచాడు. అన్ని పాటలూ బాగున్నా కానీ రాములో రాములా కొంచెం ఎక్కువ బాగుంది. నేపథ్య సంగీతం ఎమోషనల్ సన్నివేశాలలో చాలా చాలా బాగుంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. బాలీవుడ్ ఫ్యామిలీ డ్రామాల తరహాలో చాలా రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ పెట్టిన ఖర్చుకి న్యాయం చేసింది.
త్రివిక్రమ్ క్లాసీ ప్రెజెంటేషన్ వల్ల అక్కడక్కడా కథనంలోకి మందకొడితనం చొరబడింది. అయితే ఈ నిదానం ప్రథమార్ధానికే పరిమితమయింది. ఇంటర్వెల్ నుంచి వేగం పుంజుకున్న ఈ చిత్రానికి ద్వితియార్ధంలో రైట్ ప్యాకేజింగ్ కుదిరింది. అన్ని కమర్షియల్ అంశాలని జోడిస్తూ, బోర్డ్ రూమ్ సీన్‌లో బోనస్‌గా పాటల సన్నివేశంతో మంచి జోష్ వస్తుంది. కుటుంబంతో కలిసి హాయిగా ఏ చీకూ చింతా లేకుండా చూడగలిగే హాయి అయిన హాస్యంతో, చిన్నగా అలా కదిలించి పోయే హృద్యమయిన భావోద్వేగాలతో, అలరించే సంగీతంతో, ఆకట్టుకునే అర్జున్ అభినయంతో, తెరనిండుగా కనిపించే తారాగణంతో 'అల వైకుంఠపురములో' చక్కని సంక్రాంతి కను'విందు'లా వుంది.
బాటమ్ లైన్: అల… త్రివిక్రమపురిలో!
గణేష్ రావూరి