రాయలసీమలో మరో ఉద్యమ హెచ్చరిక…!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానులు అంటూ ప్రకటించిన తరువాత అమరావతి ప్రాంతం, దాని చుట్టుపక్కల జిల్లాలు ఉద్యమంతో అట్టుడికిపోతుండగా, రాయలసీమ జిల్లాల నుంచి రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. డిమాండ్లే కాదు, హెచ్చరికలు, బెదిరింపులూ…

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానులు అంటూ ప్రకటించిన తరువాత అమరావతి ప్రాంతం, దాని చుట్టుపక్కల జిల్లాలు ఉద్యమంతో అట్టుడికిపోతుండగా, రాయలసీమ జిల్లాల నుంచి రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. డిమాండ్లే కాదు, హెచ్చరికలు, బెదిరింపులూ ఉన్నాయి. రాజధానిని ఉంచితే అమరావతిలో ఉంచండి లేదా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వండని కొందరు నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా వద్దనుకుంటే కర్నూలును రాజధాని చేయాలంటున్నారు. కర్నూలు కూడా కాదంటే రాయలసీమ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

విశాఖపట్టణాన్ని అధికారికంగా రాజధానిగా ప్రకటించిన తరువాత ప్రత్యేక రాయలసీమ ఉద్యమం లేవదీస్తామంటున్నారు. కొందరు దీన్నే గ్రేటర్‌ రాయలసీమ ఉద్యమం అంటున్నారు. కొందరేమో కర్నూలును రాజధాని చేయడానికి వీల్లేకపోతే రాజధాని నగరానికి ఉండే హంగులు, సౌకర్యాలు కల్పించాలంటున్నారు. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేయాలంటున్నాడు. ఈ మినీ సచివాలయం కాన్సెప్టు ఏమిటో ఆయన ఇప్పటివరకు వివరించలేదు. హైకోర్టు మాత్రమే ఇస్తే కర్నూలుకు రాజధాని కళ రాదని అంటున్నాడు. 

తాజాగా టీడీపీ మాజీ ఎంపీ, అనంతపురం జిల్లా నాయకుడు జేసీ దివాకర్‌ రెడ్డి అందరూ ఆశ్చర్యపోయేలా ఓ కొత్త ప్రతిపాదన తెరమీదికి తీసుకువచ్చాడు. ఇప్పటివరకు సీమ నాయకులంతా కర్నూలును రాజధానిగా (అమరావతి ఉండని పక్షంలో) చేయాలని అడుగుతున్నారు కదా. అయితే ఈయన అభిప్రాయం ప్రకారం రాజధాని రాయలసీమలోనే ఉండాలి. కాని కర్నూలు కాకుండా కడపను రాజధాని చేయాలన్నాడు. కడప అమరావతి మాదిరిగా రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు సమాన దూరంలో ఉందని చెప్పాడు. రాయలసీమ నేతలందరూ విశాఖ తమకు చాలా దూరమవుతుందంటున్నారు కదా. 

అక్కడికి ప్రయాణమే రెండు రోజులు పడుతుందని చెబుతున్నారు. దీంతో కడపను రాజధాని చేయడం బెస్టన్నాడు జేసీ దివాకర్‌ రెడ్డి. ప్రకాశం జిల్లావాసులు రాజధాని తమ జిల్లాకు ఇవ్వాలంటున్నారు. ఆ జిల్లాలోని దొనకొండలో ఏర్పాటు చేయాలన్నారు. కొందరు తిరుపతిని రాజధాని చేయాలంటున్నారు. అమరావతిని రాజధానిగా ఉంచకపోతే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తుండగా, మరో రకమైన డిమాండూ వస్తోంది. ఈమధ్య కర్నూలు జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లాను కర్నాటకలో కలపాలన్నాడు. అలా వీలుకాని పక్షంలో తమ నియోజకవర్గమైన మంత్రాలయంను కర్నాటకలో విలీనం చేస్తే తమకు ప్రయోజనకరంగా ఉంటుందన్నాడు. 

1956 వరకు అంటే ఆంధ్రా-తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడేవరకు మంత్రాలయం కర్నాటకలోనే ఉండేదని, కాబట్టి మళ్లీ విలీనం చేయాలని డిమాండ్‌ చేశాడు. చిత్తూరు జిల్లా కూడా రాయలసీమలో భాగమే కదా. తాజాగా అక్కడి నుంచి ఉద్యమ హెచ్చరిక వచ్చింది. వీళ్లది రాజధానికి ఉద్యమం కాదు. ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమరనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడు రాజధాని చెన్నయ్‌కి, కర్నాటక రాజధాని బెంగళూరుకు చిత్తూరు చాలా దగ్గరని కాబట్టి ఆ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒకదాంట్లో తమ జిల్లాను విలీనం చేయాలని డిమాండ్‌ చేశాడు. 

ఈ రెండు రాజధానులు చిత్తూరు నుంచి కేవలం గంట ప్రయాణ దూరంలో ఉన్నాయని చెప్పాడు. రాజధాని రచ్చ ఇలాగే కొనసాగితే తమిళనాడు లేదా కర్నాటకలో విలీనం చేయాలని తాము ఉద్యమిస్తామన్నాడు. తాము ఏపీ నుంచి విడిపోతే దూరప్రయాణం చేసే బాధ తప్పుతుందన్నాడు. విశాఖపట్టణాన్ని అధికారింగా రాజధానిగా ప్రకటించాక రాయలసీమలో ఏదో ఒక రూపంలో ఉద్యమం జరుగుతుందా?