పల్లెటూళ్లలో నగదు కష్టాలు మొదలయ్యాయి. రెండు రోజుల నుంచీ ఏటీఎంలు పనిచేయడం లేదు, ఈరోజు ఆదివారం కావడంతో పూర్తిగా నగదు నిల్వలు నిండుకున్నాయి. మండల కేంద్రాల్లో సైతం అన్ని ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డ్ లు కనిపిస్తున్నాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి కేంద్రం తీసుకున్న ఏ ఆర్థిక నిర్ణయమూ కారణం కాదు, కేవలం జగన్ అమ్మఒడి ఎఫెక్ట్ మాత్రమే.
అమ్మఒడి డబ్బులు పడటం, అందులోనూ పండగ సీజన్ కావడంతో పిల్లలు బట్టల కోసం, ఇతరత్రా అవసరాల కోసం అమ్మఒడి డబ్బుల్ని పూర్తిగా తీసేసుకుంటున్నారు తల్లిదండ్రులు. అందుకే ఏటీఎంలలో నగదు మిగలడం లేదు. సరిగ్గా పండగ సీజన్లో డబ్బులు జమ కావడంతో పేద కుటుంబాల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల్లో కెల్లా ప్రజలకు అత్యంత చేరువైందీ, ఎక్కువ మంది లబ్ధిదారులకు సంతోషాన్నిచ్చిందీ ఈ పథకమేనంటున్నారు.
లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం, సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా పేదలందరికీ డబ్బులు జమ కావడంతో ఏపీ ప్రజానీకానికి పండగ కాస్త ఎర్లీగా వచ్చినట్టయింది. వచ్చే ఏడాది నుంచి పాఠశాల మొదలయ్యే సమయానికి యూనిఫామ్, షూస్, సాక్స్ లు, బ్యాగ్ సహా పుస్తకాలు అందిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అంటే ఇకపై.. పేదరికం అనే కారణంతో ఏ పిల్లవాడూ చదువుకు దూరం కాడని తేలిపోయింది.
ఇలాంటి రోజు కోసమే జగన్ ఆలోచించారు, కేవలం ఆర్థిక కారణాలతో ఎవరూ విద్యకు దూరం కాకూడదు, మట్టిలో మాణిక్యాలు, అలా మట్టిలోనే మిగిలి పోకూడదు. జగన్ దూరదృష్టి వల్లే అమ్మఒడి అనే పథకం ఇంత బాగా సక్సెస్ అయింది, అందరికీ ఆసరాగా నిలిచింది.