ఆర్జీవీకి తెలియాల్సిన అసలు విషయం

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతకాలం నుంచో జరుగుతున్న సినిమా టికెట్ల రగడ తాజాగా ఆర్జీవీ ఇస్తున్న ఇంటర్వ్యూల వల్ల, వీడియోల వల్ల ఆసక్తికరంగా మారింది.  Advertisement ఆయన ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ, తన…

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతకాలం నుంచో జరుగుతున్న సినిమా టికెట్ల రగడ తాజాగా ఆర్జీవీ ఇస్తున్న ఇంటర్వ్యూల వల్ల, వీడియోల వల్ల ఆసక్తికరంగా మారింది. 

ఆయన ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ, తన లాజిక్కుతో చిక్కుల్లో పెట్టే పనిలో ఉన్నారు. ఇదంతా చూసి ఆయన్ని ఎన్నాళ్లనుంచో ద్వేషించే వాళ్లు కూడా వత్తాసు పలుకుతూ గళం, కలం కదుపుతున్నారు. 

“ఇది నా రిక్వెస్ట్ కాదు..డిమాండ్. సినీరంగం మొత్తం దీని మీద ప్రతిఘటించాలి. లేకపోతే మీ ఖర్మ” అని ఆర్జీవీ ట్వీట్ వేయగానే దానికి చాలామంది ఎమోషనల్ అయిపోయి రకరకాల రెస్పాన్సులు ఇస్తున్నారు. 

ఇక్కడ ప్రాధమికంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. 

అసలు ప్రభుత్వానికి సినిమా టికెట్స్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటనేది ఆర్జీవీ మొదటి ప్రశ్న కదా!

దానికి ఆయన ఏదో బ్లేజర్, ఇడ్లీ అంటూ ఉదాహరణలు చెప్పారు. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే విషయం అర్థమయ్యేదే పాపం. 

అదేంటంటే ఏ బట్టల వ్యాపారానికి, ఏ టిఫిన్ సెంటర్ కి ధరలు నియంత్రిస్తూ లేని ప్రభుత్వ జీవో ఒక్క సినిమా టికెట్ల మీదే ఎందుకుంది అనేది. ఇది ఒక్క ఆ.ప్ర లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ సినిమా టికెట్ ధరల్ని నిర్ణయిస్తూ జీవోలున్నాయి. ఒకవేళ లేకపోతే కోర్టులు కూడా జీవో విడుదల చేయమని ప్రభుత్వాల్ని శాసిస్తున్నాయి. 2016 లో హై కోర్టు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెప్పింది ఈ జీవో విడుదల చెయ్యమనే. ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. 

ఇక్కడ “ప్రభుత్వ జోక్యం ఎందుకు” అనే ప్రశ్నని ప్రభుత్వాన్ని కాదు కోర్టుని అడగాలి. 

వెలగాల్సిన మరొక విషయం ఏంటంటే చట్ట ప్రకారం థియేటర్లో సినిమా అనేది ప్రభుత్వ అదుపాజ్ఞల్లో జరగాలి తప్ప “నా ఇష్టం” అంటే కుదరదు. 

అందుకే మంత్రి పేర్ని నాని కూడా క్లియర్ గా చెప్పారు- ” మీ సినిమాను శాటిలైట్ ఛానెల్ కో, ఓటీటీకో అమ్ముకున్నప్పుడు అందులో ప్రభుత్వం ప్రమేయం ఉండదు. కానీ అదే సినిమాను థియేటర్ లో ప్రసారం చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి. చట్టం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది”. 

అదీ విషయం. రూల్స్, చట్టం ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వాటిని అప్లై చేస్తోంది. ఆ అప్లై చేస్తున్న విధానం నచ్చట్లేదు కాబట్టి “మీకేం సంబంధం?” అనడం చిన్నపిల్లాడి ప్రశ్నలా ఉంది. 

ఆర్జీవీ ప్రశనల్లో లాజిక్ ఉండొచ్చు కానీ సబ్జెక్ట్ లేదు. 

ఉదాహరణకి రాజ్యాంగంలో ఉన్న “రిజర్వేషన్స్” గురించి తెలుసుకోకుండా ఉద్యోగావకాశాలు కేవలం మెరిట్ ప్రాతిపదికన ఇవ్వాలి కానీ కులప్రాతిపదిక ఏమిటి అని అడిగిన వ్యక్తిని, “లాజిక్కులు పక్కన పెట్టి రిజర్వేషన్ చట్టం తెలుసుకో బాబూ” అని ఎలా చెప్పాల్సొస్తుందో ఇప్పుడు ఆర్జీవీకి కూడా అలాగే చెప్పాలి. 

ఒకవేళ ప్రభుత్వానికి సినిమా టికెట్స్ విషయంలో సంబంధం లేకపోతే కోర్టు ఆ అధికారాన్ని ప్రభుత్వానికి ఎందుకిస్తోందో ఆర్జీవీ లాంటి వాళ్లు ఆలోచించాలి. 

ఇదే మ్యాటర్లో మంత్రి పేర్ని నాని ఇలా అన్నారు- “చట్టంలో అలా లేనప్పుడు.. మొదటిసారే కోర్టులో కేసు వేసినప్పుడే వీగిపోవాలి కదా? అలా ఎందుకు జరగలేదు. చట్టంలో టికెట్ల అంశం లేనప్పుడు జాయింట్ కలెక్టర్ ను వెళ్లి కలవాలని జడ్జి ఎందుకు తీర్పునిస్తారు? కమిటీ వేయమని ఎందుకు చెబుతారు? కేసును నేరుగా కొట్టేయొచ్చు కదా? టికెట్ రేట్ల వ్యవహారంపై ప్రభుత్వంతో సంబంధం లేదన్నప్పుడు కోర్టులు నేరుగా తీర్పు ఇవ్వొచ్చు కదా?”

ఆర్జీవీకి కానీ, ఆయనకి వత్తాసు పలుకుతున్నవారికి గానీ ఈ కామన్ సెన్స్ అంశం ఎందుకు వెలగలేదో అర్థం కాదు. 

“ప్రభుతం మాకు సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి- మా నెత్తి మీద కూర్చుంటోంది” అన్నారు ఆర్జీవీ. 

సపోర్ట్ ఎందుకివ్వట్లేదు? సినిమావాళ్లు ప్రభుత్వాన్ని నివాసానికి స్థలాలిమ్మని అడుగుతారు, స్టూడియోలు నిర్మించుకోవడానికి స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకుంటారు. గత ప్రభుత్వాలు అవన్నీ ఇవ్వలేదా? 

ప్రస్తుత ఆ.ప్ర ప్రభుత్వం ఇప్పటివరకు అటువంటి వరాలేవీ సినీరంగానికి ఇవ్వలేదన్నది వాస్తవం. కానీ ఇక్కడ ప్రస్తావన, “ప్రభుత్వానికి ఏం సంబంధం” అన్న విషయంలో మాత్రమే. 

ఏ ప్రభుత్వం అయినా ఏ బట్టలకొట్టు వాళ్లకో, టిఫిన్ సెంటర్ వాళ్లకో ఎందుకు స్థలాలు గట్రా ఇవ్వట్లేదు? 

ప్రజలకి వినోదాన్ని అందించే రంగం కాబట్టి సినీరంగానికి ఆమాత్రం గౌరవం, ప్రాముఖ్యత ఇన్నాళ్లూ ఇస్తున్నాయి ప్రభుత్వాలు. అవి ఎంతవరకు అవసరమనే నిర్ణయం కూడా ప్రభుత్వాలు తీసుకోవచ్చు. 

స్థలాలిచ్చినప్పుడు “మీకేం సంబంధమండీ” అని గతంలో ప్రభుత్వాల్ని సినీరంగం ఎందుకడలేదు? ఎందుకంటే ప్రభుత్వమంటే వరాలే ఇవ్వాలి. చట్టపరిధిలో తమకున్న అధికారాన్ని బట్టి టికెట్ ధరలు మాత్రం నియంత్రించకూడదు. అంతే కదా!

“ఏ సామాన్యుడు అడిగాడు టికెట్ రేట్లు తగ్గించమని..”? అని మరొక వాదన కూడా చేస్తున్నవారున్నారు. 

సామాన్యుడనే వాడు ప్రతిదీ నోరు తెరిచి అడగడు, చెప్పడు. తన ప్రవర్తనతో తనకేది రుచిస్తోందో చెప్తాడు. 

టికెట్ రేట్లు తగ్గిన తర్వాత ఆ.ప్ర సినిమా హాల్స్ లో “ఫుట్ ఫాల్స్” పెరిగాయని అన్ని హాల్స్ నుంచి రిపోర్టులందాయి. 

అంటే సామాన్యుడు మునిపటి కంటే ఎక్కువగా థియేటర్లో సినిమా చూడడానికి ఇష్టపడుతున్నట్టే కదా. దీనిని బట్టి ఆ.ప్ర థియేటర్స్ లో టికెట్ రేట్లు తగ్గడమనేది సామాన్యుడికి ఆనందాన్ని కలిగిస్తున్న విషయమే అనుకోవాలి. 

ఇక అంత తక్కువ ధరలతో సినిమా హాల్స్ ని ఎలా నడుపుకోవాలి అన్న అంశం మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి సిద్ధపడిందనేది సమాచారం. ఆర్జీవీ కోరుకుంటున్నట్టు సామరస్య పరిష్కారాలు ఒక్క ఈ విషయంలో మాత్రమే అవుతాయి. 

ఈ విషయంలో ఆర్జీవీ టైపులో ప్రభుత్వాల్ని నిలదీస్తూ కూర్చుంటే ఏ పనీ జరగదు. తాత్కాలికంగా జరిగినా శాశ్వత పరిష్కారం ఉండదు. 

ఈ వ్యాసం ద్వారా ఆయనకి తెలియ చెప్పేది ఏంటంటే- దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీరంగాల నిర్మాతల్ని, ఎగ్జిబిటర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ నీ సుప్రీం కోర్టులో పిటీషన్ వేసి ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ టికెట్ ధరలు నిర్ణయిస్తూ జీవోలు విడుదల చేసే అధికారాన్ని ఇకపై ఇవ్వొద్దని కోరడమే. 

ఉచ్ఛన్యాయాలయం దయతలిస్తే ఫలితం ఉంటుంది. 

ఈ విషయాలేవీ తెలుసుకోకుండా వోడ్కా తాగుతూ ప్రభుత్వంలో ఎవ్వడికీ ఏమీ తెలియదన్న విషయం తనకి బాగా తెలుసని చెప్పడం  తెలివితేటలు అనిపించుకోవు. 

శ్రీనివాసమూర్తి