సరిగ్గా గతేడాది ఇదే టైమ్.. ఇదే చర్చ.. ఇవే ఊహాగానాలు. కట్ చేస్తే.. క్రాక్, రెడ్ సినిమాలు తప్ప మరో పెద్ద సినిమా రాలేకపోయింది. క్రాక్ హిట్టయింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. పెద్ద సినిమాలన్నీ క్యూ కట్టాయి, మళ్లీ అన్నీ ఒక్కొక్కటిగా తప్పుకున్నాయి. చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే… గతేడాది క్రాక్ లాంటి సినిమా అయినా వచ్చింది, ఈ ఏడాది అది కూడా లేదు. అన్నీ చిన్న సినిమాలే.
ముందుగా భీమ్లానాయక్ వాయిదా పడింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అయింది. తాజాగా ఇప్పుడు రాధేశ్యామ్ కూడా సంక్రాంతి బాక్సాఫీస్ నుంచి తప్పుకుంది. ఇలా 3 పెద్ద సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ బోసిపోయింది.
ప్రస్తుతానికైతే డిస్కషన్ పాయింట్ లో ఉన్న సినిమా బంగార్రాజు మాత్రమే. ఈ సినిమాను సంక్రాంతికి, మరీ ముఖ్యంగా 13వ తేదీకి విడుదల చేస్తారనే ప్రచారమైతే జోరుగా సాగుతోంది. కానీ అది కూడా అనుమానంగానే ఉంది. గడిచిన 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా ఎక్కువైంది. మరో 5 రోజుల్లో ఈ సంఖ్య మరో 50శాతం పెరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కరోనా థర్డ్ వేవ్ మొదలైనప్పటికీ తెలంగాణ, ఏపీలో లాక్ డౌన్ ఉండదని, భారీ ఆంక్షలు ఉండవని అధికారులు చెబుతున్నారు. థియేటర్లు కొనసాగుతాయనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. అయితే థియేటర్లు తెరిచినంత మాత్రాన ప్రేక్షకులు వస్తారనే గ్యారెంటీ లేదు. పైగా బంగార్రాజు లాంటి సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యం. సో.. ఇలాంటి పరిస్థితుల్లో బంగార్రాజును రిలీజ్ చేయాలని నాగ్ అనుకోడు.
మొత్తమ్మీద పెద్ద సినిమాలన్నీ మార్చి నుంచి మే నెల మధ్య థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అది కూడా అప్పటికి కరోనా పరిస్థితులు సద్దుమణిగితేనే. సో.. ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ బోసిపోయినట్టే. అంతా కరోనా ప్రభావం.