నాడు బాబు, నేడు కేసీఆర్‌పై…అవే విమ‌ర్శ‌లు!

త‌మ‌కు ఎదురు తిరిగితే చాలు అవినీతి, దేశ‌ద్రోహం ముద్ర వేయ‌డం బీజేపీకి వెన్న‌తో పెట్టిన విద్య‌. కార‌ణాలేవైనా త‌న పాల‌న చివ‌రి రోజుల్లో మోడీ స‌ర్కార్‌పై చంద్ర‌బాబు తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశారు. దీంతో ఆయ‌న‌పై…

త‌మ‌కు ఎదురు తిరిగితే చాలు అవినీతి, దేశ‌ద్రోహం ముద్ర వేయ‌డం బీజేపీకి వెన్న‌తో పెట్టిన విద్య‌. కార‌ణాలేవైనా త‌న పాల‌న చివ‌రి రోజుల్లో మోడీ స‌ర్కార్‌పై చంద్ర‌బాబు తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశారు. దీంతో ఆయ‌న‌పై తీవ్ర‌స్థాయిలో ఎదురుదాడికి మోడీ స‌ర్కార్ దిగింది. నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ పెద్ద‌ల విమ‌ర్శ‌ల‌ను నాటి బాబు దుస్థితిని గుర్తు తెస్తున్నాయి.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా ఆ పార్టీ పిలుపు మేర‌కు కొవ్వొత్తుల ర్యాలీకి నిర్ణ‌యించారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా మంగ‌ళ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ వ‌చ్చారు. అయితే క‌రోనా వ్యాప్తిని నిరోధించే క్ర‌మంలో నిబంధ‌న‌ల మేర‌కు తెలంగాణ‌లో ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యాల‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డితో క‌లిసి న‌డ్డా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌పై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

‘తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. సీఎం కనుసన్నల్లోనే అవినీతి జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు అంచనా వ్యయం రూ. 36 వేల కోట్లు అయితే రూ.1.20 లక్షల కోట్లకు పెంచారు. దాన్ని కేసీఆర్‌ ఏటీఎంలాగా మార్చుకున్నారు. ఆ నీళ్లు ఆయన ఫాంహౌస్‌కే వెళ్తున్నాయి. పాలమురు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి, మిషన్‌ భగీరథ నుంచి చుక్క నీరు ఇచ్చారా? రాష్ట్రాన్ని తానీషాలా పాలిస్తున్నారు. కొడుకు, కూతురు, అల్లుడు.. కుటుంబ పాలన ఇది. ముఖ్యమంత్రి మెంటల్‌ బ్యాలెన్స్‌ కోల్పోయారు. ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం. హుజూరాబాద్‌ ఫలితం రుచిని రాష్ట్రవ్యాప్తంగా చూపిస్తాం. రాష్ట్రంలో మంత్రులు అనేక ర్యాలీలు నిర్వహించారు. వారికి కరోనా నిబంధనలు అమలుకావా?  మాకే అడ్డు వస్తాయా?’ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌ధాని మోడీ కూడా ఇదే ర‌క‌మైన విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబుది అత్యంత అవినీతి ప్ర‌భుత్వ‌మ‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్ర‌బాబు ఏటీఎంలా మార్చుకున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పైగా నాడు చంద్ర‌బాబు, మోడీ ప‌ర‌స్ప‌రం కేంద్ర‌, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ప‌ర‌స్ప‌రం తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. 

పోల‌వ‌రంలో చంద్ర‌బాబు, అలాగే తాజాగా కాళేశ్వ‌రంలో కేసీఆర్ అవినీతికి పాల్ప‌డ్డార‌ని బీజేపీ అగ్ర‌నేత‌ల ఆరోప‌ణ‌ల్లో చిత్త‌శుద్ధి వుంటే…ఎందుకు విచార‌ణ‌కు ఆదేశించ‌లేద‌నే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం మాత్రం ఉండ‌దు. కేవ‌లం బ్లాక్‌మెయిల్ చేస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు బీజేపీ ఆడుతున్న డ్రామాగా రాజ‌కీయ విశ్లేష‌కులు విమ‌ర్శిస్తున్నారు.