“జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలి. ప్రజలారా చీకటి రోజులొస్తున్నాయి గమనించండి. జగన్ పాలనను నిశితంగా గమనించండి ప్రజలారా..” చంద్రబాబు పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ కి అతడి అను'కుల' మీడియా పెట్టిన హెడ్డింగులు ఇవి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఇది కాదు. 'ఆవేదన' అంటూ చంద్రబాబు చెప్పిన మాటల వెనక నిగూఢార్థాన్ని ప్రజలు గ్రహించాలి. దాని కోసమే ఈ వ్యాసం.
ఆదాయం లేకుండా అప్పులు తెచ్చారని, దానికి సంక్షేమం అనే పేరు పెట్టారని చంద్రబాబు ఆక్షేపించారు. ఆయన ఆవేదన బాగానే ఉంది. మరి దీని వెనక నిగూఢ అర్థమేంటో చూద్దాం. 2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపిస్తే.. ప్రస్తుతం అందుతున్న సంక్షేమ ఫలాలన్నీ కట్ అవుతాయి. అలా అని అప్పులు చేయడం ఆపరు. అప్పులు చేస్తారు, కానీ 'సంక్షేమం' కట్ చేస్తారు. అదన్న మాట చంద్రబాబు మాటల్లో అసలు రహస్యం. ఆయన ఆవేదన వెనక అంతరార్థం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందికి ఇచ్చారో లెక్కలు చెప్పాలట. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలనేది చంద్రబాబు డిమాండ్. పైపైన వినడానికి ఇది చాలా బాగుంది. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు విషయం అర్థమౌతుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే, ఇప్పటివరకు జరిగిన సంక్షేమం అంతా బోగస్ అని చెబుతారు చంద్రబాబు.
కేవలం చెప్పడం కాదు, వాటిపై దొంగలెక్కలు సృష్టించి శ్వేతపత్రం విడుదల చేస్తారు. శ్వేతపత్రాల విషయంలో బాబు బాగా ఆరితేరిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరుబయట టెంటు వేసి బాబు ఆడిన 'శ్వేతపత్రం డ్రామాలు' మరిచిపోదామన్నా సాధ్యంకాదు. రేపు బాబు మరోసారి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలపై కూడా ఇలానే బోగస్ అంకెలు సృష్టించి, శ్వేతపత్రాల్ని భ్రష్టుపట్టిస్తారు.
ఇక ఈరోజు బాబు చేసిన మరో ఆరోపణ ఏంటో చూద్దాం. కరోనా వల్ల ప్రపంచం నష్టపోతే, జగన్ పాలనలో రాష్ట్రం నష్టపోయిందన్నారు. 5 కోట్ల మంది ప్రజల్ని జగన్ మోసం చేశారని ఆరోపించారు. మోసం గురించి బాబు మాట్లాడితే కామెడీగా ఉంటుంది. సరే, ఆ సంగతి పక్కనపెడదాం. మరోసారి టీడీపీకి, చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే, మోసం అనే పదాన్ని మించి మరో పదం కనిబెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు చేసిన మోసాలు ఇప్పటికీ కళ్లముందు మెదులుతున్నాయి. పోలవరం మోసం, ఇంటికో ఉద్యోగం మోసం, అమరావతి మోసం.. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు చేసిన మోసాలు అనేకం. ఇలాంటి వ్యక్తి జగన్ మోసం చేశారని అనడం విడ్డూరానికే విడ్డూరం.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అమరావతి భూముల వ్యవహారం. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన పాపానికి రైతులకు అవమానాలు ఎదురయ్యాయంట. అమరావతి, పోలవరం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందట. అమరావతిని భ్రమరావతిగా మార్చింది బాబు. అమరావతిపై 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. అంటే వేల కోట్లు పెట్టి ఆయన అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే కట్టారన్నమాట.
ఇక పోలవరం విషయానికొద్దాం. దాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పూర్తిచేయడానికి ముందుకొస్తే, దాన్ని తన స్వార్థం కోసం మార్చేసి, బిల్లులు కట్టే పద్ధతిలోకి తీసుకొచ్చి, ప్రాజెక్టును తన జేబులో ఏటీఎం కార్డుగా మార్చుకున్నారు చంద్రబాబు. ఇలాంటి వ్యక్తి ఈరోజు పోలవరంపై మొసలి కన్నీరు కారుస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు చంద్రబాబు ఒలకబోసిన 'ఆవేదన' అంతా ఇంతా కాదు. రాష్ట్రం ఏమైపోతుందో అనే ఆవేదన ఆయన మాటల్లో ఉంది. కానీ తరచి చూస్తే.. రాబోయే ఎన్నికల్లో తను, తన పార్టీకి ఏ గతి పడుతుందో అనే ఆవేదన ఇవాళ్టి మీడియా సమావేశంలో కనిపించింది. ఇవాళ్టి బాబు 'ఆవేదన'ను ప్రజలంతా గ్రహించడం ఎంతో అవసరం. బాబు మాటల వెనక అసలు అర్థాన్ని గ్రహించినప్పుడే, జగన్ గొప్పదనం ఏంటో అర్థమౌతుంది.