మొన్నటి వరకూ జమిలి ఎన్నికలు అంటూ జపించిన భారతీయ జనతా పార్టీ వాళ్లు ఈ మధ్యకాలంలో ఆ ఊసు ఎత్తడం లేదు! కేంద్ర, రాష్ట్రాలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు అంటూ.. గత పర్యాయం లోక్ సభ ఎన్నికలకు ముందే మోడీ ప్రవచించారు. ఆ ప్రయత్నాలు కూడా చాలా వరకూ సాగాయి. అయితే, ఇప్పుడు బీజేపీ, మోడీ దృష్టి అంతా యూపీలో గెలవడం మీద మాత్రమే ఉంది! జమిలి, గిమిలి ఊసు ఇప్పట్లో లేదని స్పష్టం అవుతోంది.
జమిలి ఎన్నికలు ఏమో కానీ.. మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? అనే చర్చ కూడా ఒకటి జాతీయ స్థాయిలో మొదలవుతూ ఉండటం గమనార్హం. కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెళ్తాడా, జగన్ ఆ పని చేస్తాడా.. అనే చర్చలు ఉండనే ఉన్నాయి. వీరే కాదు.. మోడీకి కూడా ఆ అవకాశం, ఆ ఛాన్సులు ఉండవచ్చనే మాట వినిపిస్తోందిప్పుడు.
భక్తులు ఒప్పుకోకున్నా, ఒప్పుకోకపోయినా… మోడీ గ్రాఫ్ చాలా వరకూ తగ్గుముఖం పట్టింది. మోడీవి ఎంతసేపూ మాటలే.. అనే భావన గట్టిగా ఏర్పడుతోంది. నిత్యవసర సరకులతో సహా ఏ విషయంలోనూ అదుపు లేకపోవడం. ప్రజల నుంచి ఎంతసేపూ పన్నుల వసూళ్లే కేంద్రం పని అన్నట్టుగా తయారయిపోవడం, ప్రతిదాన్నీ మోడీ సర్కారు కమర్షియల్ దృష్టిలోనే చూస్తూ ఉండటం.. ఇవన్నీ మోడీపై వ్యతిరేకతను రాజేస్తూ ఉన్నాయి.
ఎంతసేపూ హిందుత్వ కోణంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది, రాహుల్ గాంధీ హిందువా, కాదా.. అనే అంశాలపై చర్చకు ఇష్టపడుతూ ఉంది. రాహుల్ హిందువు కాదని, అసలైన హిందువులు ఎవరో ప్రజలకు తెలుసు అంటూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా వ్యాఖ్యానించారు. ఇదీ తమకు మరోసారి అధికారం ఇవ్వడానికి బీజేపీ నేతలు లేవదీస్తున్న వాదన! మరి ఇప్పుడు వీటిపై యూపీ ప్రజలు ఎలా స్పందిస్తారనేదానిపై కేంద్రంలోని మోడీ సర్కారు ముందస్తుకు వెళ్లడం, వెళ్లకపోవడం ఆధారపడి ఉంటుందనే విశ్లేషణ వినిపిస్తూ ఉందిప్పుడు.
యూపీలో బీజేపీ క్రితం సారి సాధించిన స్థాయి విజయం సాధిస్తే.. మోడీకి ధీమా ఉన్నట్టే! 300లకు పైగా అసెంబ్లీ సీట్లలో బీజేపీ పాగా వేయగలిగితే.. లోక్ సభ ఎన్నికల్లో కూడా యూపీ మరోసారి బీజేపీని యూపీ మరోసారి ఛాంపియన్ గా నిలబెట్టడం దాదాపు ఖాయం!
అయితే .. ముందస్తు సర్వేలు అంచనా వేస్తున్నట్టుగా… బీజేపీ 230, 240 సీట్ల స్థాయిలో నిలిచినా, అంతకన్నా సీట్లు తగ్గినా.. అన్నింటికి మించి బాగా పుంజుకుందంటున్న ఎస్పీ గనుక.. సంచలనం సాధిస్తే మాత్రం, మోడీ అప్రమత్తం అయ్యే అవకాశాలు ఎక్కువ.
యూపీలో సమాజ్ వాదీ సంచలనం ఏదైనా నమోదు చేస్తే.. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలకు కొత్త శక్తి వస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అప్పుడు మోడీ కూడా వేగంగా స్పందించక తప్పదు. యూపీలో బీజేపీ బోల్తా పడితే జాతీయ స్థాయిలో కమలం పార్టీకి కౌంట్ డౌన్ మొదలైనట్టే!
రాహుల్ ప్రధాని అవుతాడా, మమత ఢిల్లీలో చక్రం తిప్పుతుందా…. ఇవన్నీ ఎలా ఉన్నా, యూపీలో ఫలితాలు తేడా వస్తే మాత్రం, కమలం పార్టీ కాన్ఫిడెన్స్ పై కోలుకోలేనంత దెబ్బ పడుతుంది. అప్పుడు వీలైనంత తొందరగా ఎన్నికలకు వెళ్లడమే మోడీకి మిగిలిన అప్షన్ కావొచ్చు. ప్రతిపక్షాలు కూడదీసుకోకముందే.. సుస్థిర ప్రభుత్వం అనో, మరో వాదనతోనో.. ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ తతంగం అంతా.. యూపీ ఎన్నికల ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది. ఘన విజయం సాధిస్తే.. మోడీ తాపీగా పని చేసుకోగలరు. బోటాబోటీ విజయం సాధించినా, బీజేపీకి ధీటుగా ఎస్పీ నిలిచినా… ప్రతిపక్ష పార్టీలు కూడదీసుకోకముందే మోడీ ముందస్తు అనడమే మార్గం కావొచ్చు!