ఎన్నికల వేడి మొదలైపోయింది. ఏపీ సర్కార్ కి ఇంకా సగం టైమ్ ఉండగానే ప్రతిపక్షాలు సార్వత్రిక ఎన్నికల మీద తెగ కలవరిస్తున్నాయి. అంతే కాదు,ఈసారి పవర్ లోకి వచ్చేది మేమే అంటూ బీజేపీ, జనసేన నుంచి టీడీపీ దాకా అంతా బోల్డ్ గా ప్రకటిస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తున్న అధికార వైసీపీలో కూడా ఎన్నికల రాజకీయాలు స్టార్ట్ అవకుండా ఉంటాయా.
కొత్త ఏడాది 2022 వస్తూనే ఎన్నికల హడావుడిని మరింత పెంచేసింది. ముందస్తు ఎన్నికలు అని చంద్రబాబు ఎన్నో కలలను తమ్ముళ్ల ముందు పెట్టేశారు కూడా. మరి ఎన్నికలు 2024లోనే షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, మరో సారి జగనే ఏపీకి సీఎం అని వైసీపీ నేతలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
ఈ విషయంలో అందరి కంటే ఒక అడుగు ముందున్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అయితే డ్యామ్ ష్యూర్ గా చెబుతున్నా జగనే 2024 ఎన్నికల తరువాత కూడా సీఎం. నా మాట నిజం కాకపోతే ఏకంగా రాజకీయ సన్యాసమే స్వీకరిస్తాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
జగన్ అధికారంలొకి వస్తారు, ఆయన్ని ఏరి కోరి మరీ మరోసారి ముఖ్యమంత్రిని చేసేది అయిదు కోట్ల ప్రజలే అని ఆయన అంటున్నారు. అలాగే సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన జగన్ని ఆ ఉద్యోగులే కాపాడుకుంటారని కూడా చెప్పుకొచ్చారు. ఇక జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, వీరంతా జగన్ని సీఎం చేసే వరకూ విశ్రమించరని ధర్మాన అంటున్నారు.
మొత్తానికి ఏపీలో విపక్షానికి మళ్లీ నిరాశ తప్పదని ఆయన కడు ధర్మంగా జోస్యం చెప్పేశారు. జగన్ ఓటు బ్యాంక్ ఎవరు అంటే టోటల్ గా అయిదు కోట్ల జనాలే అన్నది ఉప ముఖ్యమంత్రి గారి భావన. మరి కులాల వారీగా ప్రాంతాల వారీగా వర్గాల వారీగా రాజకీయాలకు సిద్ధపడుతున్న విపక్షాలకు ధర్మాన లాజిక్కు మింగుడుపడుతుందా అన్నదే చూడాలి.