రాజ్యాలు, రాజుల గురించి కథలు కథలుగా చెప్పుకోవడమే తప్ప చూసింది లేదు. ప్రజల్లో ప్రశ్నించే స్వభావం, పాలకుల పెత్తనాన్ని, అణచివేతను లెక్కచేయని స్వభావం , చైతన్యం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో చివరికి రాజరిక వ్యవస్థకు చరమ గీతం పాడారు.
ఎవరైనా ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తే ఇదేమైనా రాజరిక వ్యవస్థనా? అని ప్రశ్నించడం చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు. ఎంతటి కొమ్మలు తిరిగిన నియంతైనా ఐదేళ్లకో సారి ప్రజాకోర్టులో ప్రజలిచ్చే తీర్పునకు బద్దుడై ఉండాల్సిందే.
అయితే రాజ్యాలు, రాజులు లేని లోటును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తీరుస్తున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు. గత కొంత కాలంగా ఆయన వ్యవహార శైలి చూస్తుంటే రాజరిక వ్యవస్థను గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ఆయన తనకు తాను రారాజుగా ప్రకటించుకుని, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ నాయకులు ఐదేళ్లకోసారి ఎన్నికలకు వెళ్లాలనే భయమైనా ఉంటుంది. కానీ రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవసరం లేదని గట్టిగా నమ్ముతున్నారు. ఆయన చర్యలన్నీ అట్లే ఉంటున్నాయి.
హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన హోటల్‌లో తన సామాజిక వర్గానికి చెందిన సుజనాచౌదరి, కామినేని శ్రీనివాసరావుతో నిమ్మగడ్డ సమావేశమైనప్పుడే ….ఆయన విశ్వసనీయత పూర్తిగా పోయింది. అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన పదజాలంతో కేంద్రహోంశాఖకు లేఖ రాసి, దాన్ని లీక్ చేసి ఎల్లో మీడియాలో రచ్చరచ్చ చేసినప్పుడే నిమ్మగడ్డ వ్యక్తిత్వం ఏంటో బట్టబయలైంది. నిమ్మగడ్డ ప్రతి అడుగు ఎవరి ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రజలు గుర్తించారు.
రాజ్యాంగం అంటే ప్రజల కోసం ఆవిర్భవించిన అద్భుత వ్యవస్థ అని నిమ్మగడ్డ విస్మరించినట్టున్నారు. రాజ్యాంగం అంటే తన ఇష్టానుసారం ప్రవర్తించేందుకు హక్కులు కల్పించిన వ్యవస్థగా ఆయన భావిస్తున్నారు.
వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకంటూ వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాలు తీసుకునేందుకు ఆయన నేడు తన కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. అయితే తనకు కావాల్సిన సందర్భాల్లో మాత్రమే అభిప్రాయాలను తీసుకోవడం వల్లే ఇప్పుడు ఆయన విమర్శల పాలవుతున్నారు.
ఇదే మార్చి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలనుకున్నప్పుడు కనీసం ప్రభుత్వంతోనైనా చర్చించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయమై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా నిర్ణయం తీసుకోకపోవడంపై మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే.
దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పట్టించుకోకుండా రాష్ట్రంలో కనీసం మనుగడలో లేని పార్టీల నుంచి ఆయన అభిప్రాయాలను తీసుకోవాలనుకోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో 50 శాతానికి పైగా ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నిమ్మగడ్డ సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకోవడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు వైసీపీ ప్రకటించింది.
ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. రాజకీయ పార్టీలన్నింటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మొక్కుబడిగా ప్రభుత్వంతో చర్చించాలని నిమ్మగడ్డ నిర్ణయించుకో వడం ఆయన నైజాన్ని తెలియజేస్తోందని ప్రభుత్వ వర్గాలు విమర్శిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ వైఖరి కోరుతూ సీఎస్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాసిన నేపథ్యంలో ….ఈ రోజు సాయంత్రం నిమ్మగడ్డతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని భేటీ కానున్నారు. రాజకీయ పార్టీల కంటే ముందు ప్రభుత్వ అభిప్రాయం తీసుకుని ఉంటే ఎన్నికలపై ఏం చేయాలో నిమ్మగడ్డకు ఒక స్పష్టత వచ్చేది.
కానీ నిమ్మగడ్డ మనసులో వేరే అభిప్రాయాలున్నాయి. ఆయన నిమిత్త మాత్రుడు. ఆయన్ను నడిపించే శక్తులు, యుక్తులు వేరే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలంటే అందరికీ తెలిసిందే. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పంతం ఏంటో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పేరుకు ప్రజాస్వామ్య వ్యవస్థే తప్ప …ఏపీలో నిమ్మగడ్డ స్వామ్యం రాజ్యమేలుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయమై మరోసారి ఉత్కంఠ రేకెత్తిస్తోంది.