ఐతే ఏంట‌ట అంటున్న కేసీఆర్‌!

ఆయ‌న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న జాతీయ పార్టీకి అధ్య‌క్షుడు. బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీలు ఎంత విన‌య విధేయ‌త‌ల‌తో న‌డుచుకుంటాయో అంద‌రూ చూస్తున్న‌దే. అయితే తెలంగాణ ముఖ్య‌మంత్రి…

ఆయ‌న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న జాతీయ పార్టీకి అధ్య‌క్షుడు. బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీలు ఎంత విన‌య విధేయ‌త‌ల‌తో న‌డుచుకుంటాయో అంద‌రూ చూస్తున్న‌దే. అయితే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం… అయితే ఏంట‌ట! అనే లెక్క‌లేని ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డేందుకే కేసీఆర్ రెడీ అయ్యారు.

ఇవాళ హైద‌రాబాద్‌లో జేపీ న‌డ్డా పాల్గొనాల్సిన ర్యాలీకి కేసీఆర్ స‌ర్కార్ అనుమ‌తి ఇవ్వ‌లేదు. కోవిడ్ నిబంధ‌ల‌ను చూపుతూ రూల్స్ అంద‌రికీ ఒక‌టే అని తెలంగాణ పోలీస్ అధికారులు తేల్చి చెప్ప‌డం విశేషం. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను నిర‌సిస్తూ ఆ పార్టీ శ్రేణులు 14 రోజుల పాటు నిరస‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించాయి. 

ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం సికింద్రాబాద్‌లో బీజేపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ చేప‌ట్టేందుకు నిర్ణ‌యించాయి. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా సాయంత్రం రానున్నారు. అయితే న‌డ్డా ర్యాలీకి అనుమ‌తి లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. 

కోవిడ్ నిబంధ‌న‌ల్లో భాగంగా ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు తెలంగాణ‌లో అనుమ‌తి లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌లో బీజేపీ కొవ్వొత్తుల ర్యాలీకి అనుమ‌తి నిరాక‌రించిన‌ట్టు పోలీసులు పేర్కొన్నారు. కానీ ర్యాలీ నిర్వ‌హించి తీరుతామ‌ని బీజేపీ నాయ‌కులు చెబుతున్నారు. 

న‌డ్డాను విమానాశ్ర‌యంలోనే అడ్డుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్టు స‌మాచారం. ప‌శ్చిమ‌బెంగాల్ త‌ర‌హా రాజ‌కీయాల‌కు కేసీఆర్ తెర‌లేపార‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.