కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, వ్యాక్సిన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇండియాలో గత ఏడాది డిసెంబర్ 31 నాటికే వందశాతం వయోజనులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది ప్రభుత్వం. ఆ మేరకు వ్యాక్సిన్లు ఉత్పత్తి అయినా, ప్రజల అనాసక్తి ఫలితంగా ఆ టార్గెట్ సాధ్యం కాలేదు. డెబ్బై శాతం వయోజన జనాభాకు అయితే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్టుగా ప్రభుత్వం చెబుతోంది.
దేశంలో కొన్ని కోట్ల మంది ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ రెండో డోసు వ్యాక్సిన్ కు రావడం లేదని అధికారిక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. కరోనా కథ ముగిసినట్టే అనే భావనే చాలా మందిని రెండో డోసు వైపు వెళ్లనివ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రెండో డోసును పెండింగ్ లో ఉంచిన వారు కదులుతారేమో చూడాలి!
అయితే… ఇక్కడ కొన్ని ధర్మసందేహాలున్నాయి. ఇప్పటి వరకూ కరోనాను ఎదుర్కొనగల ఇమ్యూనిటినీ పెంచుతాయని వేయించుకున్న వ్యాక్సిన్ల పనితీరుకూ, కరోనా లేటెస్ట్ వేరియెంట్ ఒమిక్రాన్ ప్రభావానికి పొంతన లేదని, ఇప్పటి వరకూ వ్యాక్సిన్లు ఒకందుకు తయారు చేస్తే, ఒమిక్రాన్ వేరియెంట్ ప్రవర్తన మరోలా ఉందనే విశ్లేషణా వినిపిస్తూ ఉంది.
ఈ లెక్కన అయితే ఇండియాలో జరిగిన వ్యాక్సినేషన్ పై ఒమిక్రాన్ పై చేయి సాధిస్తుందనే మాట ఆదిలనే వినిపించింది. అయితే మరి కొందరు పరిశోధకులేమో.. ఏదేమైనా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వారు కొంత సేఫ్ అని, ఇప్పుడు బూస్టర్ డోసు వేయించుకుంటే.. 88 శాతం వారిపై ప్రభావం ఉండకపోవచ్చని చెబుతున్నారు.
ఏతావాతా.. బూస్టర్ డోసు వేయించుకోమని అంటున్నారు. అయితే.. వరస పెట్టి వ్యాక్సినేషన్ చేయించుకోవడం కాదు. రెండో డోసు వేయించుకుని తొమ్మిది నెలలు పూర్తయి ఉంటే, బూస్టర్ వేయించుకోవడం మంచిదని ఒక మాట, కాదు రెండో డోసు వేయించుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ వేయించుకోవాలని ఇంకో మాట వినిపిస్తూ ఉంది.
అమెరికాలో బూస్టర్ డోస్ వినియోగం విస్తృతం అయ్యింది. ఇజ్రాయెల్ లో నాలుగో డోస్ కూడా వేయిస్తోంది ప్రభుత్వం! ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ముందు ముందు కూడా ప్రపంచం ఇదే బాటలో పయనించాలని, కరోనా ను ఎదుర్కొనగల ఇమ్యూనిటీని కలిగి ఉండటానికి.. రెగ్యులర్ గా వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి కావొచ్చనే మాటా వినిపిస్తూ ఉంది.
ఇప్పటికే చాలా మందికి సహజసిద్ధమైన ఇమ్యూనిటీ సంక్రమించినా, వ్యాక్సిన్ల అవసరం కూడా కొనసాగుతుందని అంటున్నారు. మరో విషయం ఏమిటంటే.. ఇండియాలో కూడా కొందరు డాక్టర్లు మూడో డోసు వేయించుకున్నారట. అనధికారికంగా కొన్ని నెలల నుంచినే వైద్యసిబ్బంది మూడో డోసు వ్యాక్సిన్ ను కూడా తీసుకుంటోందని సమాచారం.