టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పబ్లిసిటీ స్టంట్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన రాజకీయ పునాదులు పబ్లిసిటీపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కొండంతలుగా చూపించుకోవడం ఆయన నైజం. బహుశా చంద్రబాబు పబ్లిసిటీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఒంటబట్టించుకున్నట్టే కనిపిస్తోంది. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులను అందించడంపై వైసీపీ ప్రభుత్వం ఛీప్ ట్రిక్స్‌కు పాల్పడిందనే విమర్శలొస్తున్నాయి. రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 అందజేస్తామని వైసీపీ గత సార్వత్రిక ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. తాము కూడా ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని జాతీయ స్థాయిలో బీజేపీ హామీ ఇచ్చింది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీ తానిచ్చిన హామీ మేరకు మూడు విడతల్లో రూ.6వేలు చొప్పున రైతు భరోసా కింద అందజేస్తోంది.
దీన్ని తనకు అనుకూలంగా జగన్ ప్రభుత్వం మార్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలకు తన వాటాగా మరో రూ.7,500 కలుపుకుని వైఎస్సార్ రైతు భరోసా కింద రైతన్నలకు అందజేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నెల 1న కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు రైతన్నల ఖాతాలకు జమ చేసింది. కానీ ఈ సొమ్మును తానేదో వేస్తున్నట్టు జగన్ ప్రభుత్వం బిల్డప్ ఇవ్వడం, దానికి సీఎం జగన్ బటన్ నొక్కడం లాంటి సినిమాటిక్ సీన్స్ తెరపైకి రావడం గమనార్హం. ఆల్రెడీ తమ ఖాతాలో పీఎం కిసాన్ యోజన కింద రూ.2 వేలు పడిన నేపథ్యంలో, మళ్లీ జగన్ నిధులు జమ చేస్తారనే ప్రకటన రైతన్నలను గందరగోళపరిచింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం అట్టహాసంగా బటన్ నొక్కారే తప్ప, రైతన్నల ఖాతాల్లో మాత్రం డబ్బు జమ కాలేదు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ సొమ్ము కావడం, రెండు రోజుల ముందే వేయడంతో…ఇదంతా ఏపీ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునేందుకు ఆడిన డ్రామాగా జనానికి తెలిసిపోయింది. ఇదేదో ఒకటో తేదీకి ముందే చేసి వుంటే …కనీసం అతికినట్టైనా వుండేది. దీనికి పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టమే తప్ప ఒరిగేదేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి జగన్ ప్రచారానికి దూరంగా వుంటారు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.