సమీక్ష: సరిలేరు నీకెవ్వరు
రేటింగ్: 2.75/5
బ్యానర్: ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం: మహేష్, విజయశాంతి, ప్రకాష్‌రాజ్, రష్మిక మందాన, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సంగీత, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు
కూర్పు: తమ్మిరాజు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల తేదీ: జనవరి 11, 2020
''చైనాలో బోరు బావిలో పిల్లాడు పడితే గంటలో పైకి తీస్తున్నారు. కానీ మనకి మూడు రోజులయినా ప్రాణాలతో బయటకి తీస్తారనే గ్యారెంటీ లేదు. అప్‌డేట్ అవ్వచ్చుగా'' అంటాడు మేజర్ అజయ్ కృష్ణ (మహేష్) మన కరప్ట్ పొలిటీషియన్స్‌ని ఉద్దేశిస్తూ. ఇలా చాలా విషయాల్లో అప్‌డేట్ అవ్వమంటూ పెద్ద లెక్చరే ఇస్తాడు. మరి కథ, కథనాల విషయంలో సినిమా వాళ్లు ఎందుకు అప్‌డేట్ అవరనేది అర్థం కాదు. మహేష్‌తో పదిహేనేళ్ల క్రితం వున్న కమర్షియల్ డైరెక్టర్లు ఎవరయినా 'మాస్ సినిమా' తీస్తే ఎలా వుండేదో, రెండు వేల ఇరవయ్యవ దశకంలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి తీసినా అలాగే అనిపించింది తప్ప అప్‌డేటెడ్ ఆలోచనలేమీ కనిపించలేదు. మాస్ సినిమాలలోను మహేష్ సరికొత్త సినిమాలు చేసాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు అన్నిట్లోను రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్‌కి తోడు ఫ్రెష్‌నెస్ చూపించాడు. పండుగాడు అలా పధ్నాలుగేళ్ల క్రితం 'మైండ్ బ్లాక్' చేసిన సీక్వెన్స్ లాంటిది ఇందులో ఒక్కటీ లేదు.
హీరో అవడానికి ఆర్మీ మేజరే కానీ… మొదటి సీన్‌లో బాంబ్ డిఫ్యూజ్ చేయడానికి వెళ్లి సరాసరి బాంబ్ డిఫ్యూజ్ చేయకుండా 'కాఫీ తాగుదాం ప్రసాద్ గారూ' అంటూ జోక్ చేస్తాడు. చావు ముంగిట వున్నా కానీ హీరో అంత క్యాజువల్ అనుకోమనేది డైరెక్టర్ ఉద్దేశం కావచ్చు. అయితే దేశ రక్షణ చూస్తోన్న వ్యక్తి అంత ప్రమాదకర పరిస్థితుల్లో ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాడు? ఈ క్వశ్చన్ కనుక మీ మదిలో మెదిలినట్టయితే 'సరిలేరు నీకెవ్వరు' మీకోసం తీసిన సినిమా కాదు. తెలుగు సినిమా హీరో కనుక ఇలాగే వుంటాడు. సూపర్‌స్టార్ ఈసారి ఎంటర్‌టైనింగ్ మోడ్‌లో వున్నాడు కనుక ఇలాగే చేస్తాడు అని కన్విన్స్ అయితే తప్ప ఫ్రీ మైండ్‌తో ముందుకి వెళ్లలేరు. లేదంటే ట్రెయిన్‌లో క్యూట్ కుర్రాడు కనిపించగానే మీద పడిపోయే హీరోయిన్‌తో ఎలా ట్రావెల్ చేయగలరు? అతడిని ట్రాప్ చేయాలంటే రేప్ అయిందని నాటకం ఆడమని ప్లాన్ చేసి పంపే 'నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్' తల్లి క్యారెక్టర్ చేసేది కామెడీ అని ఎలా అనుకోగలరు?
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ మొదలయింది లగాయతు… ట్రెయిన్ కామెడీ అంటూ మీడియాలో ఊదరగొట్టేసిన సోకాల్డ్ కామెడీ ఘట్టం 'వెంకీ'లోని ట్రెయిన్ ఎపిసోడ్‌ని తలపించడం సంగతి అటుంచి కనీసం దానికి సమీపంలోకి కూడా రాలేదు. 'ఆగడు'లో కనిపించే హీరోయిన్ తాలూకు స్వీట్ దుకాణం ట్రెయిన్‌లో పెట్టినట్టు ఇదే ఈ చిత్రానికి రైల్లో రొమాన్స్ ట్రాకు. ఒక్కసారి రైలు దిగిన తర్వాత మళ్లీ ఓ గంట తర్వాతో ఏమో హీరోయిన్ కనిపించే వరకు ఆమె వుందనే సంగతి కానీ, ఇంతవరకు కనిపించలేదనే లోటు కానీ తెలియదు. ఈ చిత్రానికి కథంటూ వుంటే అది అజయ్‌కృష్ణ, ఒక లేడీ ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) చుట్టూ తిరుగుతుంది. ఆర్మీకి కొడుకులని పంపించి ముగ్గురు ఆడపిల్లలతో వుంటోన్న ఆమెకి పలు కష్టాలు ఎదురవుతాయి. ఆమె కొడుకు ఉగ్రవాద దాడిలో గాయపడడంతో సాయం చేయడానికి వచ్చిన అజయ్ అక్కడి మినిస్టర్ నాగేంద్రతో (ప్రకాష్‌రాజ్) తలపడతాడు. వంద మంది చుట్టూ మూగినా కనీసం 'టచ్' కూడా చేయలేని హీరోతో ఈ వృద్ధ విలన్ ఎలా సరితూగుతాడు. 'సరిలేరు నీకెవ్వరు' అంటూ మొదటి ముఖాముఖి సీన్‌లోనే సరండర్ అయిపోయిన విలన్ ఆ తర్వాత గంటకి పైగా సినిమా ఎలా నడుపుతాడు?
హీరోయిజమ్ చూపించడమంటే సరాసరి ప్రతినాయకుడిని జోకర్‌ని చేసేయడం కాదని, అతడిని సమవుజ్జీగా నిలబెట్టి హీరోని ఇంకా పెద్ద హీరోగా చూపించాలని రాజమౌళి పలుమార్లు చూపించాడు. విలన్ 'జోకర్' అయినా, హీరో 'సూపర్ హీరో' అయినా కానీ విలన్ ఎంత పవర్‌ఫుల్‌గా వుంటే అంత కిక్ అంటూ క్రిస్టఫర్ నోలాన్ లిటరల్‌గా చూపించినా కానీ ఇప్పటికీ మన తెలుగు సినిమాల్లో అదే తీరు. ఫస్ట్ కాన్‌ఫ్రంటేషన్ సీన్లోనే విలన్ గుడ్ ఫర్ నథింగ్ అని తేల్చేసాక ఇక ఆ చిత్రాన్ని ముగింపు వరకు ఎలా హోల్డ్ చేస్తారు? ఇలా వున్నా సినిమాలు పాస్ అయిపోతున్నపుడు ఇంత డీప్‌గా వెళ్లాల్సిన అవసరం దేనికని అడగవచ్చు. అందుకే అలాంటి డీటెయిల్స్, లాజిక్స్, క్యారెక్టర్ ట్రెయిట్స్ జోలికి పోకుండా ఈ చిత్రంలో మెరిట్స్ అండ్ డీమెరిట్స్ గురించి మాట్లాడుకుంటే… ఇంటర్వెల్ సీన్‌లో కొండారెడ్డి బురుజు వద్ద హీరో రేంజ్ ఏమిటనేది చూపిస్తాడు. అతనెంత పవర్‌ఫుల్ అనేది ఒక చక్కగా డిజైన్ చేసిన మాస్ సీన్, బాగా రాసుకున్న పంచ్ డైలాగ్స్‌తో ముగిసిన తర్వాత అదే జోరు ఇంటర్వెల్ తర్వాత కూడా కొనసాగుతుంది. హీరో-విలన్-విజయశాంతి వరకు పరిమితం అయినంతవరకు సినిమా పాసబుల్ అనిపిస్తుంది. కానీ అవసరం కొద్దీ తెరపైకి వచ్చే కామెడీ, 'అర్థమవుతుందా?' నుంచి 'ఐ యామ్ ఇంప్రెస్డ్' అనే ఊతపదానికి అప్‌డేట్ అయిన హీరోయిన్‌తో పాటు కామెడీ లాంటిదేదో చేస్తూ సుబ్బరాజు మళ్లీ కాసేపు కాలక్షేపం చేస్తారు. ముందుగా చెప్పుకున్న అప్‌డేట్ అవ్వచ్చుగా డైలాగులతో మూషికోపన్యాసం అయిన పిమ్మట మైండ్ బ్లాక్ సాంగ్‌తో మళ్లీ మాస్ మసాలాలు ఘుమాయిస్తారు. ఆల్రెడీ దెబ్బ తినేసిన విలన్‌ని ఇక ఎన్నిసార్లు కొడతామన్నట్టు అతనిలో పరివర్తన కోసం ఆర్మీ ట్రెయినింగ్‌కి తీసుకుపోతారు. 'హౌ ఈజ్ దట్ పాజిబుల్' అంటే అదే మరి 'నెవ్వర్ బిఫోరు ఎవ్వర్ ఆఫ్టరు'.
సగటు మాస్ సినిమా అయిన ఈ 'సరిలేరు నీకెవ్వరు'కి సర్వం తానయి నడిపించాడు మహేష్ బాబు. అతని నటనకి, స్టయిల్‌కి, ఎనర్జీకి 'టేక్ ఏ బౌ'! విజయశాంతి చాలా కాలం తర్వాత తెరపై కనిపించడం మినహా ఆమె పాత్రకి వున్న ప్రత్యేకత అయితే ఏమీ కనిపించలేదు. రష్మిక అయితే 'వెంకీ' ట్రెయిన్ సీన్‌లో జెండర్ రివర్స్‌లా అందులో హీరోయిన్ కోసం పరితపించిపోయే రవితేజ తరహాలో హీరో మీదకి ఎగబడిపోతూ కనిపిస్తూ వుంటుంది. సంగీత కామెడీ ఎవరిని ఉద్దేశించి తీసారో వారికి కనక్ట్ అయితే అవ్వాలి మరి. రిగ్రెసివ్, మిసోజినీ అంటూ 'కబీర్‌సింగ్'ని కడిగేసిన ఉత్తరాది ఫెమినిస్టులు ఇందులోని రావు రమేష్ డైలాగులు వింటే ఏమయిపోతారో? ప్రకాష్‌రాజ్ తనతోడుగా బడి పంతులని పెట్టుకుని పండించాలని చూసిన వినోదం కంటే 'కూజా చెంబయింది' అంటూ జయప్రకాష్‌రెడ్డి చేసే కామెడీ నవ్విస్తుంది.
సెట్ డిజైన్స్, సినిమాటోగ్రఫీ కనువిందు చేయగా, దేవిశ్రీప్రసాద్ పాటల్లో మైండ్ బ్లాక్ తెరపై బాగుంది. మహేష్‌బాబు లుంగీ కట్టుకుని చేసిన మాస్ డాన్సులు ఫాన్స్‌కి కనువిందు చేస్తాయి. ఖర్చు పరంగా రాజీ పడలేదు కానీ రచన పరంగానే 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ పెట్టుకుని 'సరిపోతుంది.. ఇది చాలు' అన్నట్టు రాసుకున్నదాంతో కానిచ్చేసారు. విషయం లేకపోయినా విసిగించింది తక్కువ కనుక సంక్రాంతి పండక్కి సినీ వినోదం కోసం ఆవురావురుమనే జనాలకి ఈ ఆర్మీ మేజర్ పండుగ సీజన్‌లో కాలక్షేపానికి పనికొస్తాడు. బాక్సాఫీస్ వరకు ఈ సగటు 'సరిలేరు'ని మహేషే మరోసారి తన సూపర్‌స్టార్ భుజాలపై గట్టెక్కించక తప్పదు.
బాటమ్ లైన్: సరిపోలేదు మోతాదు!
గణేష్ రావూరి