కోడి పందేలకు మించిన టీవీ చ‌ర్చ‌ల గొడ‌వ‌లు

సంక్రాంతి వ‌చ్చిందంటే చాలు కోడి పందేల ఆట గురించి మాట్లాడుకుంటాం. సై అంటే సై అని కోడిపుంజులు కూత కూస్తే, వాటి య‌జ‌మానులు కూడా మీసాలు తిప్పుతారు. కోడిక‌త్తులపై నిషేధం ఉన్నా భేఖాత‌రు చేస్తూ…

సంక్రాంతి వ‌చ్చిందంటే చాలు కోడి పందేల ఆట గురించి మాట్లాడుకుంటాం. సై అంటే సై అని కోడిపుంజులు కూత కూస్తే, వాటి య‌జ‌మానులు కూడా మీసాలు తిప్పుతారు. కోడిక‌త్తులపై నిషేధం ఉన్నా భేఖాత‌రు చేస్తూ సుతారంగా కోడి పుంజుల కాళ్ల‌కు చుట్టి బ‌రిలోకి దిగుతారు.

ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో కోడిపందేల‌కు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు ప్ర‌సిద్ధి. తెలుగు సంస్కృతి, సంప్ర‌దాయాల్లో భాగంగా కేవ‌లం కోడి పందేల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి కోసం న్యాయ‌స్థానాల గ‌డ‌ప తొక్కిన సంద‌ర్భాలున్నాయి. కోడి పందేల కోసం రాష్ట్ర న‌లుమూలల నుంచి సంక్రాంతికి ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు వెళ్లి ల‌క్ష‌లాది రూపాయ‌లు పందెం కాయ‌డం మ‌న‌కు తెలిసిందే.

ఇవ్వ‌న్నీ అలా ఉంచితే….ప్ర‌తిరోజూ కోడి పందేలు జ‌ర‌గ‌డం చూశారా?  చూస్తూ ఉంటాం గానీ, అవి కోడి పందేలని తెలియ‌వు. ఎందుకంటే అక్క‌డ కోళ్లు ఉండ‌వు. మ‌నుషులే కోడి పందెంలో కోడి పుంజుల కంటే దారుణంగా పోట్లాడుతుంటారు. కోడి పుంజుల కాళ్ల‌కు క‌త్తులుంటాయి. కానీ వీరి మాట‌లు కోడి క‌త్తుల కంటే ప‌దునుగా ఉంటాయి.కోళ్ల‌కు ర‌క్త‌గాయాలైతే…మ‌నుషుల‌కు మాన‌సిక గాయాల‌వుతాయి. ఈ ఉపోద్ఘాత‌మంతా  న్యూస్ చాన‌ళ్ల‌లో చ‌ర్చ‌ల పేరుతో సాగించే ర‌చ్చ గురించే.

ఇటీవ‌ల టీడీపీ ఓ కొత్త విష‌యాన్ని క‌నుగొంది. కోడి పుంజుల‌పై కోడి పెట్ట‌ల్ని పందేనాకి విడిస్తే బాగుంటుంద‌ని. అందుకే చాన‌ళ్ల‌ల్లో చ‌ర్చ‌ల‌కు ముఖ్యంగా మ‌హిళ‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మ‌హిళ‌లు ఏం మాట్లాడినా అటువైపు వాళ్లు మాట్లాడ‌డానికి త‌ట‌ప‌టాయిస్తార‌ని. టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు మంచువ‌ర్తి అనురాధ కోడి పందెం ఆడ‌టంలో ఆరితేరారు.

ఈ టీడీపీ నాయ‌కురాలు దెబ్బ‌కు రాజ‌కీయ విశ్లేష‌కుడు తెల‌క‌ప‌ల్లి ర‌విలాంటి వారికి సైతం స‌హ‌నం చ‌చ్చిపోయింది. ఒక ద‌శ‌లో ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక ఈమె ఉందంటే ఆ చ‌ర్చ ర‌చ్చ‌ర‌చ్చే. ఈమె కొట్లాడ‌ని చ‌ర్చ అనేదే లేదంటే అతిశ‌యోక్తి లేదు. అలాగే అనిత అని మ‌రో టీడీపీ నాయ‌కురాలిని కూడా ఇటీవ‌ల త‌ర‌చూ ర‌చ్చ‌ల‌కు పంపుతున్నారు. ఈమె కొంచెం బెట‌ర్‌. ప‌ట్టాభి అనే టీడీపీ నాయ‌కుడు ర‌చ్చ‌ల్లో బాగా ఎగురుతున్న ఆట‌గాడిగా చెప్పుకోవ‌చ్చు.

 కోడి పందెం బాగా ఆడించ‌డంలో టీవీ9 ర‌జ‌నీకాంత్‌కు పేరుంది. గ‌త ఏడాది టీవీ9లో కోడిపందెంలో  ఎమ్మెల్సీ బాబురాజేంద్ర‌ప్ర సాద్‌కు వారి పార్టీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ చేతిలో తీవ్ర గాయాల‌య్యాయి. కొన్ని రోజుల పాటు రాజేంద్ర అస‌లు చ‌ర్చ‌ల‌కు రాలేదంటే మాన‌సిక గాయాలు ఎంత తీవ్ర‌స్థాయిలో అయ్యాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తే ర‌విచంద్రారెడ్డి మంచి ఆటే ఆడుతున్నాడు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ప్ర‌త్య‌ర్థి కంటే కాస్త దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తే మంచి వైసీపీ పందెం కోడిగా పేరు పొందాడు.

కొంత కాలం క్రితం బీజేపీలో చేరిన లంకా దిన‌క‌ర్ కూడా మంచి పందెం కోడే. ఎంతో పెద్ద మ‌నిషిగా పేరు పొందిన ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావును “నువ్వు అస‌లు మ‌నిషివేనా”  అని ప్రశ్నించ‌డం ఈయ‌న‌కే చెల్లింది. అంతే కాదు ఈ నెల 10న ఎన్‌టీవీ చ‌ర్చ‌లో “నేను లేచి పోతాను. మీరే యాంక‌రింగ్ చేయండి” అని దిన‌క‌ర్‌ను అస‌హ‌నంతో ఆహ్వానించారంటే ఏ స్థాయిలో “బ‌రి” తెగించారో అర్థం చేసుకోవ‌చ్చు.

రాజ‌కీయ ప‌క్షాల‌తో కోడి పందేలు ఆడించే వారి గురించి చెప్పుకున్నాం. కానీ యాంక‌ర్లే కోడి పందేలు ఆడ‌డం కూడా మ‌నం తెలుసుకోవాలి. ఈ కోవ‌లో మొద‌టి వ‌రుస‌లో  సాంబ‌శివ‌రావు, మూర్తి, వెంక‌ట‌కృష్ణ త‌దిత‌రులున్నారు. చ‌ర్చ‌ల్లో రాజ‌కీయ నేత‌ల కంటే వీరి వీరంగాన్ని చూడ‌లేం. త‌మ యాజ‌మాన్యానికి న‌చ్చ‌ని పార్టీల‌పై యాంక‌ర్ల‌గా వీరి తిట్ల పురాణాన్ని ప్రేక్ష‌కులు విన‌లేక చ‌స్తున్నారు.

 స్వ‌యం స్తుతి, ప‌ర‌నింద త‌ప్ప మ‌రేమీ ఉండ‌వు.  యాంక‌ర్ల‌గా సాంబ‌శివ‌రావు, మూర్తి ప్రాంతాల‌ను, త‌మ‌కు న‌చ్చ‌ని పార్టీల‌ను తూల‌నాడుతూ గంట‌ల త‌ర‌బ‌డి ఉప‌న్యాసాలు ఇస్తుంటారు. పులిని చూసి న‌క్క వాత పెట్టుకున్న‌ట్టు టీవీ9 ర‌జ‌నీకాంత్‌లా తాము పాపుల‌ర్ కావాల‌నుకుని నోటికి వచ్చింద‌ల్లా మాట్లాడుతుండ‌డం క‌నిపిస్తోంది. ప్రైమ్‌9 చాన‌ల్‌లో సాయి కొంచెం బెట‌రే.   టీవీ5, ఏబీఎన్ చాన‌ళ్ల‌లో వైసీపీని, జ‌గ‌న్‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా చ‌ర్చ‌లుంటాయి. సాక్షిలో అస‌లేం చేస్తుంటారో ఎవ‌రికీ ఏమీ అర్థం కాదు.

 ఈ చాన‌ళ్ల‌లో చ‌ర్చ‌ల‌న్నింటిని చూస్తుంటే అర్థ‌మ‌య్యేదేంటి అంటే…తిరుమ‌ల శ్రీ‌వారికి ఎస్వీబీసీ అనే భ‌క్తి చాన‌ల్ ఉన్న‌ట్టు, తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు చంద్ర‌బాబుకు ఎక్కువ సంఖ్య‌లో భ‌క్తి చాన‌ళ్లు ఉన్నాయి. వీరికి “కుల‌”దైవ‌మే ముఖ్యం. ఆ త‌ర్వాత జ‌గ‌న్ స్థానం. టీడీపీకీ ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ5, ఏపీ 24 ఇంటూ7, మ‌హాటీవీ, జ‌గ‌న్‌కు సాక్షి అనే భ‌క్తి చాన‌ళ్లు ఉన్నాయి. టీవీ9, ఎన్‌టీవీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంచెం ఎక్కువ‌గా భ‌జ‌నం చేస్తుంటాయి.

చ‌ర్చ‌ల్లో రాజ‌కీయ నేత‌లు, యాంక‌ర్లు వాడే భాష‌, తిట్ల పురాణాన్ని విన‌లేక ప్రేక్ష‌కులు చ‌చ్చిపోతున్నారు. టీవీ ఆన్ చేయాలంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితులున్నాయి. సినిమా ప్రారంభానికి ముందు పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని హెచ్చ‌రించిన‌ట్టుగానే…న్యూస్ చాన‌ళ్ల చ‌ర్చ‌ల‌ను చూడ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని వేస్తే బాగుంటుంది.