ముందుకా వెనక్కా.. ఉద్యోగ సంఘాల డైలమా..?

సీఎం జగన్ మాట ఇస్తే తప్పరు, అందరూ అంగీకరించే విషయమే ఇది. ముఖ్యంగా నవరత్నాల హామీల అమలుతో జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో మాత్రం ఆయన చేస్తున్న ఆలస్యం…

సీఎం జగన్ మాట ఇస్తే తప్పరు, అందరూ అంగీకరించే విషయమే ఇది. ముఖ్యంగా నవరత్నాల హామీల అమలుతో జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో మాత్రం ఆయన చేస్తున్న ఆలస్యం ఆయా వర్గాల్లో అసహనానికి కారణం అవుతోంది. పోనీ పోరాటం చేద్దామా అంటే.. జనాల్లో పలచన అవుతామేమోననే భయం వెంటాడుతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న ఈ సమయంలో ఉద్యోగులు కోరినంత మేర వేతనం పెంచడం ప్రభుత్వం చేయలేని సాహసం.

కానీ ఇప్పటికే అన్యాయం జరిగింది. ఇకనైనా కనికరించండి అంటూ ఉద్యోగులు జీతాల పెంపు కోసం వేచి చూస్తున్నారు. జీతాలు పెంచితే.. రాష్ట్ర బడ్జెట్ ని బ్యాలెన్స్ చేయడం కుదరదు కాబట్టి సీఎం జగన్ ఇంకా ఆలోచన ధోరణిలోనే ఉన్నారు.

ఇస్తారా..? ఇవ్వరా..?

జీతాలు పెంచుతారా పెంచరా అని గట్టిగా అడిగితే.. ఇప్పుడు కొంతమేర పెంచుతాం, తర్వాత మిగతావి ఆలోచిస్తాం అనే సమాధానం ప్రభుత్వం నుంచి వినపడుతోంది. ఇప్పటికిప్పుడు ఉద్యోగులు ఉద్యమాలు చేసినా, ఇంకేది చేసినా జీతాలు పెంచే పరిస్థితి లేదు. 

నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలిపితే ఏమవుతుందో, ఎన్నాళ్లు అలా నిరసనలు తెలుపుతూ ఉండాలో తేలని పరిస్థితి. అందుకే ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆలోచనలో పడ్డారు. ఈనెల 9 విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన విడుదల చేస్తామంటున్నారు.

సీపీఎస్ పై క్లారిటీ ఇవ్వాల్సిందే..!

అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు జగన్. కానీ రెండేళ్లవుతున్నా దానిపై ప్రకటన లేదు. ఇదే విషయంపై ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారంటూ సజ్జల వంటి వారు చెబుతున్నా ఉద్యోగులు నమ్మడంలేదు. అయితే ఇప్పుడు సీపీఎస్ రద్దు కంటే ప్రధాన సమస్యగా పీఆర్సీ తెరపైకి వచ్చింది. 

కనీసం పీఆర్సీని ఉద్యోగులు ఆశించిన స్థాయిలో ప్రకటించినా సీపీఎస్ ని వారు కొన్నాళ్లు పట్టించుకోరు. మరి జగన్ మనసులో ఏముందో.. ఆయనకే తెలియాలి. జగన్ తరపున రాయబారానికి వచ్చేవారు కూడా గట్టిగా ఏ హామీ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు కాస్త నలిగిపోతున్నా.. రాష్ట్ర పరిస్థితి చూసి వెనకడుగు వేయాల్సి వస్తోంది. 

మొత్తమ్మీద ఏపీ ఉద్యోగులకు మాత్రం ఇది సహనానికి పరీక్షేనని చెప్పాలి. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్న సీఎంకి మద్దతుగా ఉండి.. తర్వాత ఫలాలను అనుభవించాలనుకుంటారో.. లేక తాత్కాలిక పెంపుదల కోసం రణరంగాన్ని సృష్టిస్తారో.. వేచి చూడాలి.