ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత రెండో దఫా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల చివరి నిమిషంలో ఈడీ విచారణకు ఆమె గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన కేసుపై విచారణ ఉండడంతో, తీర్పు వరకూ విచారణకు హాజరు కాకూడదని కవిత భావించినప్పటికీ, ఆమె అనుకున్నది జరగలేదు. ఎట్టకేలకు ఇవాళ ఈడీ విచారణకు ఆమె హాజరయ్యారు.
ప్రస్తుతం ఆమె ఈడీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. నిందితులను ఎదురుగా పెట్టుకుని కవితను ప్రశ్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తనను ఇరికించడానికి ఈడీ అబద్ధాలు చెబుతోందని కవిత ఇప్పటికే ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన తండ్రి కేసీఆర్ సర్కార్‌పై కక్షతోనే ఈడీ విచారణకు దిగిందని ఆమె ఆరోపణ. విచారణ సంస్థపై ప్రతికూల ఆలోచనలతో వెళ్లిన కవిత, సంబంధిత అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఏం చెబుతుంటారనే చర్చకు తెరలేచింది.
మొదటి విడత విచారణలో ఈడీకి కవిత సహకరించలేదని బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ విచారణకు వెళ్లే ముందు కార్యాలయం వరకూ భర్త అనిల్ ఆమె వెన్నంటి ఉన్నారు.
విచారణకు వెళ్లే ముందు కవిత భావోద్వేగానికి లోనయ్యారు. భర్తను ఆలింగనం చేసుకున్నారు. కవితకు అనిల్ ధైర్యం చెప్పి విచారణకు పంపడం ఆసక్తికర పరిణామం. కవిత అరెస్ట్‌పై ఎప్పట్లాగే అనేక రకాల ప్రచారం జరుగుతోంది. ఏమవుతుందో చూడాలి.