ఎట్టకేలకు 23 రోజుల తర్వాత మూడు రాజధానులపై అధికార వైసీపీ నిద్రలేచింది. ‘ఒక్కరాజధాని వద్దు-మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నినాదం మార్మోగుతోంది. దీంతో ఒక్కసారిగా మూడు రాజధానుల కోసం ఏపీ దద్దరిల్లుతోంది.
జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటు చేసేందుకు ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలో గత నెల 17న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సూచన ప్రాయంగా ఓ ప్రకటన చేశాడు. అప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో కాక రేగింది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌పై రాజధాని రైతులు ఆందోళన చేపట్టడం, వారికి బీజేపీ, వామపక్షాలు, జనసేన మద్దతు ఇవ్వడంతో మీడియా అటెన్షన్ అంతా అక్కడే కేంద్రీకృతమైంది.
ఈ నేపథ్యంలో సీఎం, స్పీకర్ మినహాయిస్తే మిగిలిన 149 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఏమైపోయారంటూ వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు , ద్వితీయ శ్రేణి నాయకులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ప్రశ్నించడం మొదలు పెట్టారు. మూడు రాజధానుల అవసరం కేవలం ఒక్క జగన్ కాంక్ష మాత్రమే కాదని, ఆయన ఓ చారిత్రిక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మిగిలిన ప్రజాప్రతినిధులు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీస్తున్నారు. దీన్ని వైసీపీ అధిష్టానం పసిగట్టి వెంటనే చర్యలు చేపట్టింది. జగన్ రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే అప్రమత్తమై ప్రతి ఎమ్మెల్యే, ఎంపీకి స్వయంగా ఫోన్ చేసి మూడు రాజధానులపై చేపట్టాల్సిన కార్యకలాపాలపై దిశానిర్దేశం చేశాడు.
దీంతో శుక్రవారం ఉదయం నుంచి ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమలోని అనంతపురం వరకు ప్రతి మండలం, నియోజకవర్గ కేంద్రాల్లో ‘ఒక్కరాజధాని వద్దు-మూడు రాజధానులు ముద్దు’ నినాదాలతో టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్ స్టార్ట్ చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచని పరిస్థితి.
విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించాలని కోరుతూ గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, పశ్చిమ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్, బెహరా భాస్కరరావు, శ్రీధర్ అప్పలనాయుడు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గాజువాకలో ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాజువాక నుంచి పోటీ చేసిన పవన్‌కల్యాణ్‌కు విశాఖ రాజధాని కావడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ దాకా భారీ ప్రదర్శన నిర్వహించారు. వీరికి మంత్రి శంకర్ నారాయణ సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఇక్భాల్, వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరా, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాజమండ్రి ఎంపీ భరత్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోటగుమ్మం జంక్షన్ నుంచి డీలక్స్ సెంటర్ వరకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు