అమరావతి నుంచి విశాఖ వెళ్లనున్న ఉద్యోగుల పాలిట ఆ నగరం ‘ఇల… వైకుంఠపురం’ అనే ఫీలింగ్ కలిగేలా జగన్ సర్కార్ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. మూడు రాజధానులపై జగన్ సర్కార్ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా…ఒక్కొక్క చిక్కుముడి వీడుతూ వస్తోంది. ముందుగా సచివాలయ ఉద్యోగుల్లో ఎలాంటి అసంతృప్తికి తావు లేకుండా వారికి బంఫర్ ఆఫర్స్ ఇవ్వనున్నట్టు సమాచారం.
ఉద్యోగులు, రాజధాని రైతులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందనే అంశాలపై శుక్రవారం విజయవాడలో రెండోసారి సమావేశమైన హైపవర్ కమిటీ చర్చించినట్టు సమాచారం. ఉద్యోగులకు సంబంధించి సమావేశంలో చర్చించిన కొన్ని అంశాలు వెల్లడయ్యాయి.
ప్రధానంగా విశాఖకు వెళ్లే సచివాలయ ఉద్యోగులకు రాజధాని నగరాభివృద్ధి పరిధిలో రూ.25 లక్షలకే ఇంటి స్థలం కేటాయించడం, దంపతులిద్దరూ ఉద్యోగులైతే ఖాళీలతో సంబంధం లేకుండా విశాఖకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే హెచ్ఆర్ఏ 30 శాతం, 10శాతం సీసీఏ, ఇంటి సామగ్రి తరలించేందుకు ఉద్యోగుల హోదాను బట్టి రూ.లక్ష నుంచి రూ.50 వేలు అందజేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం.
అలాగే మరికొన్ని ఆఫర్స్ కూడా ఉద్యోగులకు ప్లాన్ జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఉచిత నివాస వసతి, కుటుంబంతో సహా వస్తే నెలకు రూ.4 వేల రాయితీ అద్దె చెల్లింపు, వారానికి ఐదు రోజుల పనిదినాల కొనసాగింపు, స్థానికత అంశంపై 2024 వరకు గడువు పెంపు, అమరావతిలో ఇచ్చినట్టే బస్సు, రైలు ప్రయాణ రాయితీని కొనసాగించాలని ప్రతిపాదిం చినట్టు తెలుస్తోంది.
బాబు కంటే మిన్నగా…
బాబు కంటే మిన్నగా ఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఉద్యోగుల పిల్లలకు డొనేషన్లు లేకుండా సీట్లు, ఇంకా అవసరమైతే సూపర్ న్యూమరీ సీట్లు పెంచడం, వేతన సవరణను తక్షణం ప్రకటించడం, ఒక్కో ఉద్యోగికి 200 గజాల స్థలం కేటాయించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు హై పవర్ కమిటీ రెండో మీటింగ్‌లో చర్చించినట్టు సమాచారం.