అమ్మఒడితో ప్రతి తల్లికి 15వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సీఎం జగన్.. అందులో వెయ్యి రూపాయలు తిరిగి స్కూల్ కమిటీకి ఇవ్వండని వారికి సూచించారు. అయితే ఇది నిర్భందమేదీ కాదు, స్వచ్ఛందంగానే వెయ్యి రూపాయలు స్కూల్ కి ఇవ్వాలని చెప్పారు. ఇక్కడే స్కూల్ నిర్వహణ విషయంలో జగన్ తొలి అడుగు వేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యతను మరింత పెంచేదిగా ఈ నిర్ణయం ఉంది.
ఇప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలలంటే, అది సర్కారు ఆస్తి గానే తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ భావిస్తుంటారు. స్కూళ్లలో మరుగుదొడ్లు ఉన్నా.. వాటి నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో అందరికీ తెలుసు. స్కూల్ కి వరుస సెలవలు వస్తే వాటిని స్థానికులు, పోకిరీలు ఎలా పాడుచేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇకపై అలాంటి నిర్లక్ష్యానికి అవకాశం ఉండకూడదనే జగన్ తల్లిదండ్రుల్ని వాటి నిర్వహణలో భాగస్వామ్యం చేశారు. ప్రతి పిల్లాడి తరపున కుటుంబం ఇచ్చే వెయ్యి రూపాయలు స్కూల్ లో మరుగుదొడ్ల నిర్వహణ, వాటికి అవసరమైన వస్తువుల కొనుగోలు, వాచ్ మెన్ ల జీతాలకు కేటాయించాలని అధికారులకు సూచించారు.
అంటే ఇకపై ఏ స్కూల్ లో బాత్రూమ్ లు పరిశుభ్రంగా లేకపోయినా, స్కూల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా, తల్లిదండ్రులు వెళ్లి ఉపాధ్యాయులని నిలదీయొచ్చన్నమాట. వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తున్నాం కదా, వాటిని ఏం చేస్తున్నారంటూ అడిగే అధికారం తల్లిదండ్రులకు ఉంటుంది. అదే సమయంలో నిధులుంటాయి కాబట్టి స్కూళ్లలో పారిశుధ్య నిర్వహణ చక్కగా ఉండే అవకాశం ఉంది. సో.. ఇది రెండు విధాలా లాభదాయకం అన్నమాట.
ఇప్పటివరకూ ప్రభుత్వాలు కేవలం మరుగుదొడ్లు కట్టించడం, నిధుల విడుదల వరకే ఆలోచిస్తే, జగన్ మరో అడుగు ముందుకేసి వాటి నిర్వహణపై కూడా దృష్టిపెట్టారు. మామూలుగా విద్యార్థులు తలో వెయ్యి రూపాయలు తెచ్చివ్వండి స్కూల్ లో మరుగుదొడ్లు బాగుపరుస్తాం అంటే.. ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఆర్థికంగా భారమూ కావొచ్చు. కానీ సీఎం జగన్ మాత్రం ఆ డబ్బుల్ని ప్రభుత్వం తరపున తల్లిదండ్రులకు ఇప్పించి, తిరిగి వారితోనే స్కూల్ కి ఖర్చుపెట్టిస్తున్నారు.
సో.. తల్లిదండ్రులకు బాధ్యత పెరుగుతుంది, స్కూల్ నిర్వహణని ప్రశ్నించే అధికారమూ వాళ్లకు ఉంటుంది.ఉపాధ్యాయ వర్గాల్లో ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ దూరదృష్టికి ఇది మరో నిదర్శనం అంటున్నారంతా.