ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం భోజనం మెనూ మారింది. ఈసారి మరింత రుచికరంగా మధ్యాహ్నం భోజన పథకానికి మార్పుచేర్పులు చేసింది జగన్ సర్కార్. ఈ మేరకు అదనంగా 353 కోట్ల రూపాయలు కేటాయించింది.
విప్లవాత్మక అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టిన 24 గంటల్లోనే మధ్యాహ్నం భోజన పథకానికి కూడా సరికొత్త సొబగులు అద్దింది ఏపీ సర్కార్. అలా పాఠశాల విద్యపై తనకున్న మక్కువను మరోసారి చూపించారు ముఖ్యమంత్రి జగన్. మారిన మెనూ ఈనెల 21 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి వస్తుంది.
కొత్త మెనూ ప్రకారం ఇకపై 5 రోజుల పాటు మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డును అందించబోతున్నారు. సమగ్ర ఆరోగ్యంగా గుడ్డు ఎంతో ఉపయుక్తమంటూ యూనిసెఫ్ ప్రకటించిన నేపథ్యంలో.. విద్యార్థులకు గుడ్డును మరిన్ని రోజులు అదనంగా అందించే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా శనివారం మినహా, మిగతా అన్ని రోజుల్లో గుడ్డును వివిధ రూపాల్లో పిల్లలకు అందించబోతున్నారు.
ఎక్కువ రోజులు ఉడికించిన గుడ్డును ఇవ్వడంతో పాటు, మిగతా రోజుల్లో గుడ్డు కూరను అందించబోతున్నారు. దీంతో పాటు సాంబారు, పప్పు అందించే రోజుల సంఖ్యను కూడా పెంచారు. ఇకపై ప్రతి రోజూ సాంబారు లేదా పప్పులో ఏదో ఒకటి పిల్లలకు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్న మెనూను రుచికరంగా మార్చడంతో పాటు పిల్లలకు మధ్యాహ్న భోజనం పక్కగా అందేలా చర్యలు కూడా తీసుకుంది జగన్ సర్కార్. ప్రతి గ్రామంలో తల్లిదండ్రులతో కమిటీ ఏర్పాటుచేయడంతో పాటు.. విద్యాశాఖాధికారులతో ప్రత్యేకంగా బృందాలు కూడా తయారుచేసి ఆకస్మిక తనిఖీలు చేయించాలని నిర్ణయించింది