నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత నెలలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ స్క్రీన్ ప్లేలో మళ్లీ మార్పులు చేయడంతో కుదరలేదు. అలా ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ కు వాయిదా పడింది. ఈ గ్యాప్ లో షూటింగ్ పూర్తిచేస్తూనే ప్రచారంపై దృష్టిపెట్టింది యూనిట్.
ఇందులో భాగంగా నాగచైతన్య పుట్టినరోజుకు అతడి వీడియోను విడుదల చేసిన యూనిట్, ఇప్పుడు సంక్రాంతికి మరో స్పెషల్ ప్లాన్ చేసింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి సాయిపల్లవి లుక్ ను విడుదల చేయాలని అనుకుంటోంది యూనిట్. కేవలం ఫస్ట్ లుక్ స్టిల్ రిలీజ్ చేద్దామా లేక వీడియో విడుదల చేద్దామా అనే అంశంపై చర్చిస్తోంది. సంక్రాంతికి ఇందులో ఏదో ఒకటి రావడం మాత్రం పక్కా.
తెలంగాణ పల్లెల నుంచి వచ్చి హైదరాబాద్ లో మంచి కెరీర్ కోసం చూసే ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కమ్ముల. సినిమాలో హీరోహీరోయిన్లు ఇద్దరూ తెలంగాణ యాసలోనే మాట్లాడతారు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ నాగచైతన్య తెలంగాణ యాస ట్రై చేస్తున్నాడు.
హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో పక్కపక్కన ఉండే రెండు ఇళ్లపై పెంట్ హౌజ్ టైపులో రెండు సెట్స్ వేశారు. ఆ రెండు ఇళ్ల మధ్య ఎక్కువ సన్నివేశాలు వస్తాయి. హీరోహీరోయిన్లు ఉండేది ఆ రెండు ఇళ్లపైనే.