మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న మాటలు ప్రత్యేకహోదా కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ప్రత్యేకహోదా కోసం పోరాటం కొనసాగిస్తాం అంటూ చంద్రబాబునాయుడు అయిదేళ్లపాటు చెబుతూనే వచ్చారు…. ఇక ప్రస్తుత అయిదేళ్లూ ‘రాజధానికోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం’ అనే మాటలతోనే పొద్దుపుచ్చుతారనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. మాటలు చెప్పడం తప్ప.. క్రియాశీలకంగా చంద్రబాబునాయుడు చేసేదేమీ ఉండనే ఉండదని.. ఆ విషయంలో ప్రత్యేకహోదా విషయంలోనే చాలా స్పష్టంగా నిరూపణ అయిందని… ప్రజలు భావిస్తున్నారు.
చంద్రబాబునాయుడు విషయంలో ఆయన మాటలకు అర్థాలే వేరులే అని అనుకోవాల్సిందే. ఆయన గనుక.. ‘నేను పోరాడుతూనే ఉంటాను’ అని ప్రకటించారంటే.. ఇక ఎప్పటికీ అది తీరే సమస్య కాదేమోనని భావించాలి. ఆయన మాత్రం.. అప్పుడప్పుడూ.. ప్రజల్లో కనిపించాలనుకున్నప్పుడు.. ఒక ట్వీటు చేస్తూ, ప్రకటన ఇస్తూ, ప్రెస్ మీట్ పెడుతూ, రోడ్డు మీద ధర్నా చేస్తూ ఏదో ఒక రీతిలో పోరాటం చేస్తూ…నే ఉంటారు. ప్రజా సమస్యల కోసం పోరాటం అనేది సొంతడబ్బా కొట్టుకునే ప్రచారపర్వంలో ఒక ఆర్భాటంగా ఇవాళ మారిపోయింది.
అధికార వికేంద్రీకరణను ఉద్దేశించి మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటుచేయడానికి జగన్ ప్రభుత్వం ఆల్మోస్ట్ నిర్ణయం తీసేసుకుంది. అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్లుగా చంద్రబాబునాయుడు తరలింపు వ్యతిరేకపోరాటాలు చేస్తున్నారు. జనాన్ని సమీకరిస్తూ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్షాలు అన్నిటినీ కూడా ఆయన కూడగడుతున్నారు. రాజధాని తరలిపోకుండా పోరాటం చేస్తూనే ఉంటానని అంటూన్నారు.
ఇదే తరహా మాటలు ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు గతంలోనూ అన్నారు. హోదాకోసం పోరాడుతూనే ఉంటానన్నారు. కేంద్రంతో లాలూచీపడి ప్యాకేజీకి ఒప్పుకుని.. ప్రత్యేకహోదా అనే విషయంలో ప్రజల స్ఫూర్తిని సమూలంగా చంపేసింది చంద్రబాబునాయుడే. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం.. మళ్లీ ఆ పాట పాడసాగారు. అమరావతి విషయంలో కూడా అంతే. అయిదేళ్లు పాలన సాగించి.. నిర్దిష్టంగా రాజధాని నిర్మాణాలేవీ చేపట్టకుండా, ఇది పూర్తి కావాలంటే.. నేను తప్ప మీకు గత్యంతరం లేదు అనే భయంలోకి ప్రజలను నెట్టాలని ఆయన అనుకున్నారు. అందువల్ల తనను మళ్లీ గెలిపిస్తారని కోరుకున్నారు. ఆ కుట్రల ఫలితం ఇప్పుడు రాజధాని మారిపోతోంది. దానికోసం పోరాడుతూనే ఉంటా.. అని ఆయన మునుపటి మాదిరిగానే. కల్లబొల్లి కబుర్లతో మళ్లీ ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.