హిట్ ఇచ్చిన హీరోయిన్ ను వదులుకోదు టాలీవుడ్. వరుస అవకాశాలతో ముంచెత్తుతుంది. కాల్షీట్లు ఖాళీ లేవు మహాప్రభో అన్నంత వరకు ఛాన్సులు ఇస్తూనే ఉంటుంది. అవసరమైతే రెమ్యూనరేషన్ కూడా పెంచి పోషిస్తుంది. కానీ కొందరి విషయంలో ఇలా జరగదు. సక్సెస్ వచ్చినా ఎందుకో వాళ్లకు వెంటనే ఛాన్సులు రావు. మరో అవకాశం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ లిస్ట్ లో మొదటి పేరు మీనాక్షి చౌదరిదే.
హిట్-2 అనే సక్సెస్ ఫుల్ సినిమాలో నటించినప్పటికీ ఆమెకు అవకాశాలు రాలేదు. టైటిల్ లో హిట్ ఉన్నప్పటికీ, ఆమె కెరీర్ కు ఆ 'హిట్' కలిసిరాలేదు. గతేడాది సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఈ ఏడాది ఇంకా ఖాతా తెరవలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.
ఎట్టకేలకు మీనాక్షికి మరో అవకాశం వచ్చింది. విశ్వక్ సేన్ ఈమెను గుర్తించాడు. తన కొత్త సినిమాలో అవకాశం ఇచ్చాడు. రవితేజ ముళ్లపూడి అనే దర్శకుడ్ని పరిచయం చేస్తూ, కొత్త సినిమా లాంఛ్ చేశాడు విశ్వక్. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షిని తీసుకున్నారు.
సక్సెస్ రావడం ఒకెత్తయితే, దాన్ని మార్కెట్ చేసుకోవడం మరో ఎత్తు. సరైన పీఆర్ టీమ్ ను పెట్టుకొని టాలీవుడ్ సర్కిల్స్ లో నలగడం మరో ఎత్తు. ఈ విషయంలో మీనాక్షి వెనకబడింది. అందాల పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉన్నప్పటికీ, టాలీవుడ్ కు కావాల్సిన “కలుపుగోలుతనం” లేకపోవడమే ఆమెకు అవకాశాలు తగ్గిస్తోందనేది ఇన్ సైడ్ టాక్.