ఓ స్టార్ హీరో సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే లీకులు ఆపడం ఎవ్వడి తరం కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, సెట్స్ లో ఏదో ఒక మూల నుంచి మొబైల్ క్లిక్కుమంటుంది. ఫొటోలు ఠపీమని బయటకొస్తుంటాయి. ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల నుంచి ఇలా చాలా ఆన్-లొకేషన్ స్టిల్స్ అనధికారికంగా బయటకొచ్చేశాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ వంతు.
వినోదాయ శితం రీమేక్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం పవన్, సాయిధరమ్ తేజ్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ స్టిల్స్ వరుసపెట్టి లీక్ అవుతున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఔట్ డోర్ షూటింగ్ నుంచి స్టిల్స్ లీక్ అయ్యాయంటే ఓ అర్థంఉంది. ఇండోర్ సెట్ నుంచి కూడా స్టిల్స్ లీక్ అయిపోతున్నాయి. పవన్ కల్యాణ్ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది.
ఈ చిత్రంలో దేవుడిగా కనిపిస్తున్నాడు పవన్. దీని కోసం భారీగా గ్రాఫిక్స్ వాడుతున్నారు. పూర్తిగా మ్యాట్ వేసి, కొద్దిమంది యూనిట్ తో తీస్తున్న ఈ స్టిల్స్ కూడా లీక్ అయిపోతున్నాయి. పవన్ పేరుకు దేవుడే అయినప్పటికీ, ఈ స్టిల్స్ లో స్టయిలిష్ కళ్లజోడు పెట్టుకొని, జీన్స్ వేసుకొని కనిపిస్తున్నాడు.
ఇదే విషయంపై పీపుల్ మీడియా ప్రతినిధుల్ని సంప్రదిస్తే, బాధపడాల్సింది పోయి, సంతోషకరమైన సమాధానం వచ్చింది. తమ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది కదా అనేది వాళ్ల మాట.
నిజానికి పవన్ వినోదాయశితం రీమేక్ కు సంబంధించి ఆ నిర్మాణ సంస్థ ఇప్పట్లో ఎలాంటి ప్రకటన చేయకూడదు, ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే, ఈ సినిమా కంటే ముందు పవన్ చేస్తున్న సినిమా ఒకటి విడుదల కావాల్సి ఉంది. సో.. ఇలా లీకులతోనైనా తమ సినిమాకు ప్రచారం వస్తున్నందుకు ఆ నిర్మాణ సంస్థ ఆనందంగా ఉన్నట్టుంది.