గెలుపు అనేది కేవలం పాజిటివ్ అంశాల్ని మాత్రమే మాట్లాడేలా చేస్తుంది. ఓటమి చాలా నెగెటివ్ అంశాలపై మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ రెండుచోట్ల గెలుపొందడం, మరొక చోట గట్టి పోటీ ఇస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో సానుకూల అంశాల్ని అందిపుచ్చుకుని ఎదగడం సహజమే.
రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలుండవంటారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. జగన్ రాజకీయ పంథా ప్రకృతి విరుద్ధంగా సాగుతోందనే వాళ్లు లేకపోలేదు. జగన్ సంప్రదాయ రాజకీయానికి భిన్నంగా తనదైన ఆధునిక పోకడలతో అద్భుతాలు సృష్టిస్తున్నారనే అభిప్రాయాలకు కొదవలేదు. కానీ తాను కూచున్న కొమ్మనే నరుక్కుంటున్నారనేది వాస్తవం. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ తన కేంద్రంగానే రాజకీయం సాగాలని, తాను తప్ప, మరో నాయకుడిని ప్రజానీకం తలచుకోకూడదనే జగన్ ఆలోచన, నియంతృత్వ ధోరణిగా కనిపిస్తూ ప్రమాదకరంగా మారింది.
రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ అంటే కార్యకర్త మొదలుకుని గ్రామ, మండల , నియోజకవర్గ, అలాగే రాష్ట్రస్థాయిలో అధినేత వరకూ అన్ని స్థాయిల్లో ప్రతి ఒక్కరి ప్రాధాన్యం వుంటుంది. అదేంటోగానీ, మీ నమ్మకం జగనన్న తప్ప, మరే నాయకుడు కాదని తనకు తానుగా ముఖ్యమంత్రి బలంగా చెప్పాలని అనుకుంటున్నారు. అంటే, తానే సర్వస్వం అనే భావన జగన్‌లో బలంగా వుందా? అదే నిజమైతే ఈ వ్యవహార శైలి రాచరిక పోకడలను ప్రతిబింబిస్తున్నట్టే. నవరత్నాల సంక్షేమ పథకాల అమలు పేరుతో ప్రజలకు, తనకు మధ్య నేరుగా సంబంధాలు పెట్టుకునే క్రమంలో, మధ్యలో మరో నాయకుడి ఉనికే లేకపోవడం ప్రమాదకరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ధోరణి సరైనది కాదనే చెప్పాలి. ఆ హెచ్చరిక, హితవు చెప్పేదే తాజా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఫలితాలని చెప్పక తప్పదు.
వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో అన్ని వర్గాలు, కులాలు, నిరక్షరాస్యులు, అక్షరాస్యులు, మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు… ఇలా అన్ని రకాల వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ తమ గుర్తింపును, గౌరవాన్ని కోరుకుంటారు. విస్మరణను తట్టుకోలేరు. తమను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులపై అసంతృప్తితో అదును చూసుకుని దెబ్బకొడ్తారు. ఓటమి నుంచి ఎన్ని గుణపాఠాలైనా నేర్చుకోవచ్చు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోటములు శాశ్వతం కాదు. ఓటమికి కుంగిపోయేవాళ్లు, గెలుపునకు పొంగిపోయే వాళ్లు రాజకీయాల్లో స్థిరంగా రాణించలేరు. ఆ రెండింటిని సమపాళ్లలో తీసుకున్న వాళ్లే విజ్ఞులు. అలాంటి వారు అందరి మన్ననలు పొందుతుంటారు. ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే ….అసలు వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్యన ఉన్న ఒక ముఖ్యమైన తేడాకి సంబంధించిన చర్చకు తెరలేచింది. పూర్తిగా తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని పాలన సాగించినట్టైతే, ఇవాళ జగన్ ఇంత మందిని శత్రువులుగా చేసుకునేవారు కాదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఫలితాలు, ఓటింగ్ సరళిని గమనిస్తే… జగన్‌పై వ్యతిరేకత వుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఏం జరుగు తున్నదో, ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. వైసీపీ మొట్టమొదట చేయాల్సిన పని ఆత్మపరిశీలన. వైసీపీ అధినేతగా, అలాగే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనితీరు ప్రజలకు ఒక నిశ్చాతాభిప్రాయాన్ని ఏర్పరిచింది.
“సీఎం జగన్ కోసం అందరూ పని చేయాలి. కాని తన కోసం పని చేసిన వాళ్లను కనీసం పలకరించరు. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోడానికే అధికారాన్ని వాడుకుంటున్నారు” అనే అభిప్రాయం కొంతమందిలో నాటుకుపోయింది. వాళ్లే దానిని మరింతగా ప్రచారం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అభిప్రాయం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ సానుభూతిపరుల్లో ఏర్పడడం, ఆ పార్టీకి ప్రమాదకరమని హెచ్చరించక తప్పదు. ప్రతి విషయంలోనూ దివంగత వైఎస్సార్‌తో జగన్‌ను పోల్చుకోవడం వల్ల వస్తున్న సమస్య ఇది. తండ్రిలాగే జగన్ ఉండాలని లేదు. కానీ తండ్రి పాలన, నడవడిక, ప్రజలతో వ్యవహరించే విధానాల్లోని మంచిని తీసుకుంటే, అది జగన్‌కు రాజకీయంగా ఉపయోగ పడుతుందనేది శ్రేయోభిలాషుల అభిప్రాయం.
ఉదాహరణకు జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. గ్రామస్థాయికి పాలనను తీసుకెళ్లేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోంది. అయితే వాలంటీర్ వ్యవస్థతో తమకు రాజకీయంగా విలువే లేకుండా పోయిందనేది గ్రామస్థాయి నాయకుల ఆవేదన. ఇది చాలదన్నట్టు ఇటీవల గృహ సారథులను కొత్తగా తీసుకొచ్చారు. దీంతో నాయకుల్లో ఒక రకమైన నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. వైసీపీని అధికారంలోకి తెచ్చుకున్నా ప్రయోజనం లేదని ఆవేదన వారిలో బలంగా వుంది. దీంతో పార్టీని గాలికొదిలేశారు.
ఏదైనా వుంటే జగన్ నేరుగా వాలంటీర్లు, గృహసారథులతో చేయించుకుంటార్లే అనే నిరసన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు చిన్నచిన్న కాంట్రాక్ట్ పనులు చేసినా, నెలలు, సంవత్సరాల తరబడి బిల్లులు కాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. అలాగే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. తీరా సర్పంచ్‌లకు వచ్చే నిధులను కూడా ఇతరత్రా వాటికి మళ్లించడంతో వాళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ అసంతృప్తి, ఆగ్రహ ఫలితం ఏ స్థాయిలో నష్టం కలిగిస్తుందో… తాజా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపే చెబుతోంది.
గతంలో వైఎస్సార్ తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎంతో విలువ ఇచ్చేవారు. ప్రతిరోజూ తెల్లవారుజామున రాష్ట్రంలోని ప్రజానీకం తనను కలిసి గోడు చెప్పుకునే అవకాశాన్ని ఆయన కల్పించేవారు. ఇప్పుడు జగన్ పాలనలో మచ్చుకైనా అలాంటి పరిస్థితి లేదు. కనీసం ఎమ్మెల్యే స్థాయి నాయకులకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ లేదనే ప్రచారం విస్తృతంగా సాగింది.
జగన్‌కు వ్యతిరేకులు ఎవరో స్పష్టమైంది. విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పట్టుపట్టి మరీ జగన్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని తాజా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో మెజార్టీ జగన్‌కు వ్యతిరేకంగా వున్నారని అర్థం చేసుకోవాలి. అయితే జగన్ తనకు అనుకూల ఓటు బ్యాంక్‌గా భావిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎంత వరకు అండగా నిలుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు జగన్ ఆశ, నమ్మకం కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రమే.
గతంలో వైఎస్సార్ ఎంతో గొప్పగా సంక్షేమ పాలన సాగించారు. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ పాలన ప్రజారంజకంగా సాగడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫీజురీయింబర్స్‌మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించేవాళ్లు. అలాగే అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయి. వైఎస్సార్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణాలు, ఇలా ఒక్కటేమిటి, అడిగిన వారికి, అడగని వారికి అభివృద్ధి పనులు చేసి చూపారు.
దీంతో పల్లెలు, పట్టణాల్లో భూముల రేట్లు పెరిగాయి. చేతినిండా డబ్బు తిరగాడేది. మళ్లీ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడానికి ఇదే కారణం. ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఒకటో తేదీనే జీతాలను వారి ఖాతాల్లో వేసేవాళ్లు. ఉద్యోగులతో వైఎస్సార్‌ది ఆత్మీయ అనుబంధం. వైఎస్సార్ సర్కార్‌ను తమ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా ఉద్యోగులు సొంతం చేసుకున్నారు.
అందుకే చంద్రబాబును ఉద్యోగులు శత్రువుగా భావించారు. బాబు పాలన అంటే ఉద్యోగులు భయపడే పరిస్థితి వుండేది.
వైఎస్సార్ కొడుకుగా జగన్‌ను కూడా ఉద్యోగులు ఆ విధంగానే ఊహించారు. జగన్ అధికారంలోకి రావడానికి ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. అలాంటి ఉద్యోగులను శాశ్వత శత్రువులుగా జగన్ చేసుకున్నారు. టీడీపీ, జనసేనల మాదిరిగానే ఉద్యోగులను కూడా జగన్ ప్రత్యర్థి వర్గంగా చేసుకున్నారు. కేవలం అహంకార ధోరణితో ఐదు లక్షల కుటుంబాలున్న ఉద్యోగులతో కయ్యానికి దిగారు. అసలు జగన్ సర్కార్ అంటేనే నిత్యం గొడవలు పెట్టుకునేదిగా ముద్రపడింది. ఇదేనా తన తండ్రి వైఎస్సార్ నుంచి జగన్ వారసత్వంగా నేర్చుకున్నది? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.
శత్రువులతో సైతం వైఎస్సార్ స్నేహంగా మెలిగేవారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని సైతం కలుపుకునిపోయేలా ఆయన నడుచుకునేవారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజానీకానికి ప్రయోజనం కలిగించేలా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేవారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెప్పుకునే పోలవరం మొదలుకుని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక సాగు, తాగునీటి ప్రాజెక్టుల రూపకర్త వైఎస్సారే అంటే కాదనే వాళ్లు ఉన్నారా? వైఎస్సార్ ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించేవారు. వైఎస్సార్ పాలనలో మానవీయత ఉండింది. జగన్ పాలనలో కక్ష, ప్రతీకారం రాజ్యమేలుతున్న భావన ప్రతి ఒక్కరిలో ఉంది. ఇదే తండ్రీ, తనయుల పాలన మధ్య తేడా.
2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన గొప్ప పని ఏంటంటే… తనతో పాటు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, ఆర్థికంగా చితికిపోయిన ప్రతి ఒక్కరి పేరుతో జాబితా తయారు చేసుకుని, వారందరికీ శక్తిమేరకు సాయం చేసినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతారు. నాయకులకే కాదు, రాజకీయంగా తన ఉన్నతికి దోహదం చేసిన ప్రజానీకం రుణం తీర్చుకోడానికి వైఎస్సార్ జనరంజక పాలన సాగించారు. ఇలాంటివి కదా తండ్రి నుంచి జగన్ వారసత్వంగా తీసుకోవాల్సిన అంశాలు. వైఎస్సార్ మహా నాయకుడు అయ్యారంటే… చనిపోయారు కాబట్టి కాలేదు. ప్రజలకు చేసిన మంచే ఆయన్ను సజీవంగా నిలిపింది. అదే జగన్ రాజకీయ ఉన్నతికి కారణమైంది.
2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఆత్మాహుతి దళంలా పని చేసిన యువత ఇప్పుడేమైందో వైసీపీ తెలుసుకోలేని దుస్థితి. పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీని టీడీపీ ఓడించిందని ఎవరైనా అనుకుంటే, అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. ఈ ఎన్నికల్లో ట్విస్ట్ ఏంటంటే… సీఎం జగన్‌ను వైసీపీ అభ్యర్థిగా చూడడం. సహజంగా ఎన్నికల్లో అభ్యర్థుల గుణగుణాలపై గెలుపోటములు ఆధారపడి వుంటాయి. కానీ ఇక్కడ మాత్రం జగన్‌ను ఓడించాలనే అక్కసుతో పంతం పట్టి మరీ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు.
జగన్‌ను అభిమానించే వాళ్లే, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. తాజా ఫలితాలు జగన్‌కు మేల్కొల్పేవి. తప్పులు దిద్దుకునేందుకు ఇంకా ఏడాది గడువు వుంది. 175కు 175 సీట్లలో గెలుస్తామని, అలాగే వై నాట్ 175 లాంటి ఓవరాక్షన్ డైలాగ్స్ చెప్పడం మాని, వాస్తవాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని గ్రాడ్యుయేట్స్ ఓటుతో చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని , అంతా తన వైపు ఉంటారనే భ్రమల్లో ఊరేగితే మాత్రం మునిగిపోవడం ఖాయం. ముఖ్యంగా జనం జీవితాలను ప్రభావితం చేయని రాజధాని లాంటి అంశాలతో రాజకీయ ప్రయోజనాలు వుండవని జగన్ గ్రహించాలి. ఎందుకంటే గతంలో రాజధాని ఇచ్చిన చంద్రబాబుకు ఓటమి రుచి చూపించారు. అలాగే పట్టిసీమ ప్రాజెక్టు కట్టినా బాబును ఓడించారు. సామాన్య ప్రజానీకం ఆశలు, ఆలోచనలు భిన్నంగా వుంటాయి. సామాన్యుల నాడి జగన్‌కు తెలియదని ఎవరైనా అంటే అది అబద్ధమే.
సమస్యల్లా ఏంటంటే… జగన్ ఎంత సేపూ ప్రత్యర్థులపై ప్రతీకారాన్ని తీర్చుకునేందుకే అధికారంలోకి వచ్చినట్టు నడుచుకుంటున్నారనే అభిప్రాయం బలపడడం. దీంతో ఆయన చేసిన మంచికంటే, చెడే ఎక్కువ ప్రాచుర్యం పొందుతోంది. అదే ఆయన్ని దెబ్బతీస్తోంది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకుంటే మరోసారి అధికారంపై ఆశలు పెట్టుకోవచ్చు. లేదంటే చంద్రబాబుకు ఏ గతి పట్టిందో కళ్లెదుటే నిలువెత్తు ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. చాయిస్ ఏదో జగనే తేల్చుకోవాలి.