స్టార్ డమ్.. ఎన్టీఆర్ కు ఉన్నది, తారకరత్నకు లేనిది ఇదే. ఇదేదో కేవలం వెండితెరకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. వాళ్ల వ్యక్తిగత జీవితాలతో ముడిపడిన అంశం ఇది. స్టార్ డమ్ ఉంది కాబట్టే అంతోఇంతో నందమూరి కుటుంబానికి దగ్గర కాగలిగాడు ఎన్టీఆర్. లోలోపల కొంతమంది కుటుంబ సభ్యులు తిట్టుకున్నప్పటికీ పైపైకి మాత్రం ఎన్టీఆర్ పై కూసింత అభిమానం చూపిస్తుంటారు. ఆ స్టార్ డమ్ లేదు కాబట్టే, అందరూ ఉండి కూడా ఒంటరివాడయ్యాడు తారకరత్న.
ఎన్టీఆర్ ను అంగీకరించాల్సి వచ్చింది…
దివంగత హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్. జానకిరామ్, కల్యాణ్ రామ్, సుహాసిని.. హరికృష్ణ మొదటి భార్య పిల్లలు. ఎన్టీఆర్ ఒక్కడు హరికృష్ణ రెండో భార్య తనయుడు. ఈ ఒక్క అంశమే తారక్ ను నందమూరి కుటుంబం నుంచి వేరుచేసింది. ఏళ్ల పాటు ఈ హీరోను నందమూరి కుటుంబ సభ్యులకు దూరం చేసింది.
ఎప్పుడైతే ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడో, లెక్కలేంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడో అప్పుడిక నందమూరి కుటుంబం కూడా ఏం చేయలేని స్థితికి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల మధ్య తమ కుటుంబంలో ఒకడిగా ఎన్టీఆర్ ను కలుపుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ ను అలా నందమూరి కుటుంబ సభ్యుడిగా మార్చడం వెనక అప్పట్లో చంద్రబాబు 'రాజకీయ కోణం' కూడా దాగుందంటారు చాలామంది.
కారణాలు ఏమైనా, ప్రస్తుతానికి ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యుడు. స్వయంగా బాలకృష్ణ, పలు ఫంక్షన్లలో ఎన్టీఆర్ భుజంపై చేయి వేసి ఫొటోలు దిగడం లాంటివి చూశాం. ఇక కల్యాణ్ రామ్ అయితే, ఎన్టీఆర్ ను తన సొంత సోదరుడిగా భావిస్తాడు.
ఎన్టీఆర్ పూర్తిగా 'నందమూరి' అయినట్టేనా..
అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ పూర్తిగా నందమూరి కుటుంబసభ్యుడు అయినట్టేనా? కాదనే అంటారు చాలామంది తెలిసినవాళ్లు. ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ పై ఆ కుటుంబ సభ్యులు వివక్ష చూపిస్తూనే ఉంటారు. మొన్నటికిమొన్న తారకరత్న చనిపోయినప్పుడు, ఆయన కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరైతే, బాలకృష్ణ కనీసం పలకరించలేదు. ఆమధ్య కల్యాణ్ రామ్ సోదరి (సుహాసిని) ఇంట ఓ కార్యక్రమం జరిగితే అహ్వానం లేదు. అంతెందుకు, బాలకృష్ణ, చంద్రబాబు కలిసి ఏ ఫంక్షన్ లో కనిపించినా, అక్కడ ఎన్టీఆర్ ఉండడు.
తారకరత్న పరిస్థితి పూర్తిగా భిన్నం..
ఇక తారకరత్న పరిస్థితి ఎన్టీఆర్ కు పూర్తిగా భిన్నం. అతడు పూర్తిగా నందమూరి కుటుంబ సభ్యుడే. కాకపోతే అది పెళ్లికి ముందు. ఎప్పుడైతే అలేఖ్యను పెళ్లి చేసుకున్నాడో, అప్పుడిక ఆయన నందమూరి సభ్యుడు కాలేకపోయాడు. కుటుంబం మొత్తం ఆయన్ను పక్కనపెట్టింది. దానికితోడు స్టార్ డమ్ లేకపోవడం తారకరత్నకు మరింత ఇబ్బందికరంగా మారింది.
తారకరత్న కన్నుమూసిన తర్వాతే అతడు ఎదుర్కొన్న కుటుంబ వివక్ష చాలామందికి తెలిసొచ్చింది. ఇక రీసెంట్ గా భార్య అలేఖ్య పెట్టిన పోస్టుతో మరిన్ని విషయాలు పరోక్షంగా వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకున్న కొత్తలో తారకరత్నకు అండగా ఉన్న, కొంతమంది నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఆ తర్వాత ముఖం చాటేసిన విషయం అలేఖ్య పోస్టుతో బహిర్గతమైంది.
అదే తారకరత్నకు స్టార్ డమ్ ఉంటే నందమూరి కుటుంబం వెలివేసి ఉండేదా? వరుసగా హిట్స్ వచ్చి, ఎన్టీఆర్ టైపులో అశేష అభిమానగణం ఉంటే నందమూరి కాంపౌండ్ అతడ్ని పొట్టలో పెట్టుకొని చూసుకునేది కదా. కేవలం స్టార్ డమ్ లేకనే తారకరత్న ఒంటరి అయ్యాడు.
స్టార్ డమ్ ఉంది కాబట్టే అందరివాడు కాకపోయినా నందమూరి కుటుంబంలో కనీసం కొందరివాడు అయ్యాడు ఎన్టీఆర్. ఆ స్టార్ డమ్ లేకనే అందరూ ఉండి కూడా, ఎవరికీ కానివాడయ్యాడు తారకరత్న