గర్ల్ ఫ్రెండ్ ని మెప్పించడానికి, ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడానికి, పెద్ద పెద్ద బైకులపై ఆమెను తిప్పడానికి, పార్టీలకు, ఫంక్షన్లకు ఖర్చు చేయడానికి చాలామంది చైన్ స్నాచర్లుగా మారిన ఉదాహరణలున్నాయి. తాజాగా కొంతమంది టీనేజర్లు ఢిల్లీలో సెల్ ఫోన్లు దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారంతా ఒకటే ఏజ్ గ్రూప్. అసలెందుకీ దొంగతనాలు చేస్తున్నారని అడిగేసరికి జస్ట్, ఊరికే, సరదా అనేశారు. ఆ తర్వాత అసలు సంగతి బయటపెట్టారు. తన ఫ్రెండ్ బర్త్ డే గ్రాండ్ గా చేద్దామనుకున్నామని, డబ్బులు సరిపోలేదని, అందుకే ఇలా సెల్ ఫోన్ల దొంగతనాలు మొదలుపెట్టామని చెప్పుకొచ్చారు. ఒక్క కాస్ట్ లీ ఫోన్ దొరికితే.. బర్త్ డే గ్రాండ్ గా జరిగిపోతుందని అంటున్నారు ఈ పిల్ల దొంగలు.
ఐదుగురు దొంగల్లో ఒకడు ప్రొఫెషనల్ కిక్ వాలీబాల్ ప్లేయర్, జాతీయ టీమ్ కి సెలక్ట్ అయ్యాడు కూడా. ఒకడు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ బాయ్. ఇంకో ముగ్గురు ఇప్పటికే బాల నేరస్థులు. జువైనల్ హోమ్ లో ఉంటూ చదువుకుంటున్న ఆ ముగ్గురు మళ్లీ ఇలా ఫ్రెండ్ కోసం దొంగతనాలు మొదలపెట్టారు. వీరంతా కలసి స్నేహితుడి బర్త్ డే కోసం డబ్బులు పోగు చేసేందుకు సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు.
సెల్ ఫోన్ దొంగతనం చేశారంటూ ఓ వ్యక్తి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిఘా పెట్టారు. దొంగతనం కోసం వారు ఉపయోగించిన బైక్ నెంబర్ ని కూడా బాధితుడు పోలీసులకు అందించాడు. దీంతో ఆ ఐదుగురి ముఠాని పట్టుకోవడం సులభమైంది.
కేవలం ఇవి టెంపరరీ దొంగతనాలని, బర్త్ డే పార్టీకి డబ్బులు పోగైతే, ఇక దొంగతనాలు చేయబోమని అంటున్నారు వారంతా. కేక్ కటింగ్ తోపాటు, మందు, విందు.. అన్నిటి కోసం డబ్బులు సరిపోలేదని, అందుకే ఇలా దొంగతనాలు చేస్తున్నామని పోలీసుల ముందు బోరున విలపించారు పిల్ల దొంగలు.