తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత మళ్లీమళ్లీ ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోంది. ఈ నెల 20న విచారణకు రావాలని ఇటీవల ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక రోజు ముందుగానే ఇద్దరు సోదరులు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందనే అనుమానాన్ని కవిత ఇటీవల న్యాయస్థానంలో వేసిన పిటిషన్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తనను ఇరికించేందుకు ఈడీ కుట్రలకు పాల్పడుతున్నట్టు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 11న ఒక దఫా కవిత ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. అనంతరం తిరిగి 16న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరయ్యే నిమిత్తం ఆమె మందీమార్బలంతో ఢిల్లీ వెళ్లారు. తీరా విచారణ సమయం సమీపించినా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో కవిత వ్యూహం మార్చారనే ప్రచారం జరిగింది.
విచారణకు రాలేనని, అందుకు గల కారణాలను తన న్యాయవాది ద్వారా ఈడీకి కవిత పంపారు. దీంతో నాలుగు రోజుల గడువుతో మళ్లీ విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. మరోవైపు కవిత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే కవితకు సంబంధించి ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వకుండా తమ వాదనలు కూడా వినాలని ఈడీ కేవియట్ వేసింది. దీన్నిబట్టి కవిత విషయంలో ఈడీ ఎంత పకడ్బందీ వ్యూహాన్ని రచించిందో అర్థం చేసుకోవచ్చు.
ఈడీ కోరినట్టుగానే సోమవారం విచారణకు హాజరయ్యే నిమిత్తం కవిత ఢిల్లీ వెళ్లడం గమనార్హం. ఈడీ విచారణ నాటకీయ పక్కీలో సాగుతోంది. విచారణను తప్పించుకోవాలని కవిత వేసే ఎత్తులకు, ఈడీ పైఎత్తులేస్తోంది. ఈ నేపథ్యంలో కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో 24న విచారణ జరగనుంది. ఈ లోపు కవితను అరెస్ట్ చేయకుండా ఈడీ విడిచిపెడుతుందా? అనేది చర్చనీయాంశమైంది. అందుకే కవిత విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది.