హృద‌య విదార‌కం…

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం పాత పాల్వంచ తూర్పు బ‌జారులో గ్యాస్ లీకేజీ కార‌ణంగా దంప‌తుల‌తో పాటు 12 ఏళ్ల కుమార్తె స‌జీవ ద‌హ‌న‌మయ్యారు. అలాగే మ‌రో కుమార్తె తీవ్ర గాయాల‌పాలై మృత్యువుతో పోరాడుతోంది. ఇది మొద‌ట…

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం పాత పాల్వంచ తూర్పు బ‌జారులో గ్యాస్ లీకేజీ కార‌ణంగా దంప‌తుల‌తో పాటు 12 ఏళ్ల కుమార్తె స‌జీవ ద‌హ‌న‌మయ్యారు. అలాగే మ‌రో కుమార్తె తీవ్ర గాయాల‌పాలై మృత్యువుతో పోరాడుతోంది. ఇది మొద‌ట ప్ర‌మాద‌మ‌ని భావించినప్ప‌టికీ, విచార‌ణ‌లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌నే స‌మాచారం అందిన‌ట్టు పోలీసులు తెలిపారు. హృద‌య విదార‌కమైన ఈ ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం పాత పాల్వంచ తూర్పు బజారులో రామకృష్ణ కుటుంబం నివాసం ఉండేది. ఈయ‌న భార్య‌ శ్రీలక్ష్మి, క‌వ‌ల పిల్ల‌లైన కుమార్తెలు సాహిత్య(12), సాహితి. పాల్వంచలో గ‌తంలో రామ‌కృష్ణ మీసేవా కేంద్రాన్ని నిర్వ‌హించేవారు. రెండు నెలల క్రితం దాన్ని విక్రయించి రాజమహేంద్రవరానికి కుటుంబంతో స‌హా వెళ్లారు. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు వారి కవల పిల్లలు సాహితి, సాహిత్యలతో కలిసి పాల్వంచలోని తమ ఇంటికి చేరుకున్నారు.

ఇవాళ ఉద‌యం ఆ ఇంటి నుంచి గ్యాస్‌ వాసన, పొగలు వస్తుండాన్ని స్థానికులు ఆల‌స్యంగా గుర్తించారు. అనంత‌రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వ‌చ్చి చూసే స‌రికి రామ‌కృష్ణ దంప‌తుల‌తో పాటు సాహిత్య విగ‌త‌జీవులుగా ప‌డి ఉండ‌డాన్ని గుర్తించారు. 80 శాతం గాయాల‌తో సాహితి మృత్యువుతో పోరాడుతూ క‌నిపించింది. గ్యాస్ లీకేజీ కావ‌డంతో ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని మొద‌ట పోలీసులు భావించారు.

అనంత‌రం త‌మ విచార‌ణ‌లో అప్పులు పెర‌గ‌డం వ‌ల్లే కుటుంబంతో స‌హా రామ‌కృష్ణ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డార‌ని స్థానికులు, బంధువుల నుంచి సేక‌రించిన వివ‌రాల మేర‌కు ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు పోలీసులు చెప్పారు. ఆన్‌లైన్ వ్యాపారాల్లో రూ.30 ల‌క్ష‌ల‌కు పైగా న‌ష్టాలు రావ‌డం, ఆ సొమ్ము తీర్చే మార్గం లేక ఆత్మ‌హ‌త్య‌ను ఆశ్ర‌యించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి. 

ఇదిలా వుండ‌గా గాయాల‌పాలైన సాహితి ప్ర‌స్తుతం పాల్వంచ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. రామకృష్ణ కారులోని కొన్ని కీలక పత్రాలు, బిల్లులను క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.