వంగవీటిని దువ్వితే కాపులు ఏకమైపోతారా?

అసంఘటిత కార్మికులు.. అసంఘటిత కాపులు అని ఊరికే అనలేదు. ఏపీలో కాపులంతా ఏకం అవ్వడం అసంభవం. ఎందుకంటే, ఆయా ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న రాజకీయాలు, నేతల ప్రవర్తన బట్టి కాపుల ప్రాధామ్యాలు మారిపోతుంటాయి.…

అసంఘటిత కార్మికులు.. అసంఘటిత కాపులు అని ఊరికే అనలేదు. ఏపీలో కాపులంతా ఏకం అవ్వడం అసంభవం. ఎందుకంటే, ఆయా ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న రాజకీయాలు, నేతల ప్రవర్తన బట్టి కాపుల ప్రాధామ్యాలు మారిపోతుంటాయి. ఇలాంటి టైమ్ లో తెరపైకి వచ్చారు వంగవీటి రాధా. ఆయన్ను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. నిజానికి రాధా రాష్ట్ర నాయకుడు కాదు. కేవలం ఓ ప్రాంతానికి చెందిన నాయకుడు. కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్న తన కుల ఓట్లను ఆయన ప్రభావితం చేయగలరు. మిగతా ప్రాంతాల కాపుల్ని కూడా ఏకం చేసేంత స్టామినా ఆయనకు లేదు.

ఉత్తరాంధ్రను తీసుకుంటే అక్కడ గంటా శ్రీనివాసరావు కాపుల ఐక్యత కోసం తెరవెనక తెగ కష్టపడుతున్నారు. తూర్పులో ముద్రగడ కూడా ఇలాగే కాపు ఐక్యత కోసం పోరాటం చేస్తున్నారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో నేత ఉన్నారు. ఇక పవన్ విషయానికొస్తే ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా కాపులకు నాయకుడు కాదు. కాబట్టి వంగవీటిని దువ్వితే కాపులు ఏకమైపోతారని ఆలోచిస్తున్నారు చంద్రబాబు.

అందులోనూ రాజధాని ప్రాంతంలో పట్టు నిలుపుకోవాలంటే, అక్కడ బలమైన సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు తమవారై ఉండాలనేది బాబు ఆలోచన. అందుకే వంగవీటి పార్టీకి దూరంగా ఉన్నా, అసలు పార్టీలో లేననే సంకేతాలు పంపినా, వైసీపీ నాయకులతో కలసి తిరుగుతున్నా.. చంద్రబాబు మాత్రం సిగ్గు, ఆత్మాభిమానం లాంటివన్నీ వదిలేసి మరీ రాధా ఇంటికి వెళ్లారు. తనదైన రాజకీయాలు మొదలుపెట్టారు.

వాస్తవానికి చంద్రబాబు భేటీ తర్వాత రాధా వ్యవహారం పూర్తిగా చప్పబడిపోయింది. రాధా వైసీపీలోకి చేరతారేమో అని ఆశపడ్డ అభిమానులంతా చంద్రబాబు ఎంట్రీతో సైలెంట్ అయ్యారు. అటు వైసీపీ నుంచి రాధాకు సపోర్ట్ చేసే బ్యాచ్ కూడా వెనకడుగు వేసినట్టే. కానీ చంద్రబాబుకి మాత్రం రాధా అక్కర్లేదు, ఆయన పేరుతో వచ్చే రాజకీయ లాభమే బాబుకి కావాల్సింది. రాధా భుజంపై తుపాకిపెట్టి జగన్ పై తూటా పేల్చడమే బాబు పరమావధి.

గతంలో ఎన్నడూ రాధాని కలవని బాబు.. హడావిడిగా ఇప్పుడు కలిశారంటేనే ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాలేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో టీడీపీ కేవలం రాజకీయ వివాదాలు మాత్రమే చూస్తోంది.

కాపులు ఏకమౌతారా..? నాయకులు ఏకమౌతారా..?

కాపులు ఏకం కావాలంటే ముందుగా కాపు నాయకులు కలవాలి. కానీ ఏపీలో అది అసాధ్యం. విడివిడిగా అందరూ తలోచోట ఉన్నారు, ఎవరి వల్లా ఏమీ కాదు. బాబు బుట్టలో ఒకరు, రిజర్వేషన్ల కోసం ఇంకొకరు, బీజేపీ చేతిలో ఒకరు. ఇలా చిక్కిపోయారు. ఈ దశలో చంద్రబాబు రాధా ఒక్కరినే దగ్గరకు తీసి ఏం చేయలేరు. 

ఒకవేళ చేయాలనుకున్నా.. ముద్రగడ లాంటి బలమైన నాయకుడు చంద్రబాబుని ఛీ కొట్టినంత కాలం ఆయన వర్గం టీడీపీని నమ్మే ప్రసక్తే లేదు. సో.. బాబుకి రాధా కానీ, రాధా వ్యవహారం కానీ ఏమాత్రం కలసిరాదు.