ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రస్తుతం యూపీ చుట్టూ తిరుగుతున్నారు. యూపీ లో పర్యటనలు చేపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి వార్తలను చూస్తే.. వాటి డేట్ లైన్లన్నీ యూపీలోని పట్టణాలు, నగరాల పేర్లే కనిపిస్తున్నాయి. వారణాసి, కాన్పూర్, మీరట్.. అంతకు ముందు ఏదో హైవే ప్రారంభోత్సవం. శంకుస్థాపనలు, ప్రారంభాలు.. ఎక్కడయ్యా అంటే, ఉత్తరప్రదేశ్ లో అన్నట్టుగా ఉంటున్నాయి వార్తలన్నీ.
మోడీ, ఆయన వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయా సభల్లో.. యోగిని ప్రశంసిస్తూ మోడీ ప్రసంగాలు. యథారీతిన అరవై యేళ్లు కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందంటూ.. మోడీ విరుచుకుపడటం. నిన్న అయితే.. మీరట్ లో మోడీ మాట్లాడుతూ.. దేశాన్నీ క్రీడారంగం విషయంలో కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం చేసిందని కూడా విమర్శించారు! ఏ రంగం కథ ఎత్తినా.. అరవై యేళ్ల పాలన గురించే బీజేపీ వాళ్లు మాట్లాడతారు. తమ ఆరేడేళ్ల పాలనను మాత్రం వారు అస్సలు లెక్కేయరు పాపం. వాజ్ పేయి పాలనను అయితే గుర్తించను కూడా గుర్తించరు. ఇదే పరంపర కొనసాగుతూ ఉంది.
ఇక ఎక్కడ ఎన్నికలు జరుగతాయంటే.. ఆ రాష్ట్రం లో ప్రధాని మోడీ పర్యటనలు కొత్త కాదు. ఎన్నికలున్న ప్రాంతాల్లోనే ప్రధానమంత్రి పర్యటనల పరంపర కొనసాగుతూ ఉంది. ఇది వరకూ బిహార్, వెస్ట్ బెంగాల్ ల విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఇప్పుడు మోడీ యూపీలోనే కనిపిస్తూ ఉన్నారు.
యూపీతో పాటు త్వరలోనే పంజాబ్ లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే పంజాబ్ పై బీజేపీకి ఎలాంటి ఆశలూ లేవు. అక్కడ దక్కేదేమీ లేదు కూడా. ఇన్నాళ్లూ తాము పాగా వేసి ఉన్న చండీగఢ్ నగర పాలక సంస్థను కూడా బీజేపీ పోగొట్టుకుంది. పంజాబ్ లో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు కానీ, యూపీ చుట్టూ మాత్రం మోడీ ప్రదక్షిణలు సాగుతూ ఉన్నాయి. మరి ఫలితమెలా ఉంటుందో!