హైదరాబాద్ కూకట్ పల్లిలోని శివపార్వతి థియేటర్ అగ్నికి ఆహుతి అయ్యింది. తెల్లవారుఝామున సంభవించిన అగ్నిప్రమాదంలో థియేటర్ లోపలి వైపు పూర్తిగా ధగ్ధం అయ్యింది. సీట్లు, తెరతో సహా.. అగ్నిప్రమాదంలో థియేటర్ లోపలి వైపంతా కాలిబూడిదయ్యింది. ఈ ప్రమాదంలో రెండు కోట్ల రూపాయల నష్టమని థియేటర్ యాజమాన్యం ద్వారా తెలుస్తోంది.
షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం. నిన్న రాత్రి సెకెండ్ షో పూర్తైన అనంతరం, తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో థియేటర్ లో మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. వాచ్ మెన్ గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మూడు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో .. అత్యంత అదృష్టం ఏమిటంటే.. ప్రేక్షకులు థియేటర్లో లేని సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం. ఒకవేళ క్లోజ్డ్ థియేటర్లో, ఎంతో కొంతమంది ప్రేక్షకులు ఉండిన సమయంలో షార్ట్ సర్క్యూట్ ద్వారానే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుని ఉంటే.. జరిగే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టం. థియేటర్ లో షో ముగిసిన తర్వాత ఇలా జరిగింది కాబట్టి.. నష్టం కేవలం ఆర్థికమైనదే.
ఇదే సమయంలో.. ఏపీలో పరిణామాలు చర్చకు రాకుండా మానవు. థియేటర్లలో సేఫ్టీ మెజర్ మెంట్ల గురించి ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తే.. చాలా మందికి కోపం వస్తోంది. అది కక్ష సాధింపు అనిపిస్తోంది. ప్రభుత్వం తన బాధ్యత తను చేస్తున్నా.. సినిమాలు చూసే వాళ్లే చాలా బాధపడిపోతూ ఉన్నారు పాపం!
ఏదైనా ప్రమాదం జరిగితే..? అనే ఆందోళనే లేకుండా, థియేటర్లను వాటి మానన వాటిని వదలాలి తప్ప, థియేటర్లలో తనిఖీలు నిర్వహించడం అంటే సామాజిక సేవకులను అవమాన పరిచినట్టే అనేంత స్థాయిలో వాదోపవాదాలు సాగుతున్నాయి. అసలుకు దేశంలో థియేటర్ల యాజమాన్యాలంత అలసత్వంతో ఉండే వ్యాపారాలు మరోటి ఉండవు కూడా. ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం చేసే తనిఖీలను సామాన్యులు కూడా తప్పు పట్టేస్తున్నారు! ఇదంతా కక్ష సాధింపట!
మరి .. అన్నింటినీ కరెక్టుగా ఉంచుకుంటేనే కదా, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవకాశం ఉండేది. లేకపోతే ఇలాంటి షార్ట్ సర్క్యూట్లే కాదు.. ఎలాంటి ప్రమాదాలు అయినా జరుగుతాయి. ప్రమాదం జరిగిన తర్వాత తనిఖీలు ఎవరైనా చేస్తారు. ముందే చేస్తే మాత్రం కక్ష సాధింపు!