‘అమ్మఒడి’లోని చిన్నారులకు మేనమామ వరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చదువు అనేది ఇక ఎంతమాత్రమూ తల్లిదండ్రులకు భారం కాదు. పేద వర్గాలకు చెందిన ఏ ఒక్కరూ కూడా.. పిల్లల చదువు గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లల…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చదువు అనేది ఇక ఎంతమాత్రమూ తల్లిదండ్రులకు భారం కాదు. పేద వర్గాలకు చెందిన ఏ ఒక్కరూ కూడా.. పిల్లల చదువు గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లల చదువులు సాగుతున్న కాలంలో ఇతర ఒత్తిడులు కూడా లేకుండా ఉండేంతగా వారందరి కుటుంబాల్లోనూ తానొక సభ్యుడిని అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చేదోడువాదోడుగా నిలవబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.. విప్లవాత్మకంగా ప్రకటించిన అమ్మఒడి పథకాన్ని గురువారం నాడు చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు.

జగన్మోహన రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ప్రజాసంక్షేమ పథకాల విషయంలో ఎన్నో కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరించి తీరాల్సిందే అనిపించే తరహా కొత్త పథకాలు కార్యరూపంలోకి వస్తున్నాయి. అలాంటివాటిలో అమ్మఒడి కూడా ఒకటి. బడికి వెళ్లి చదువుకునే ప్రతి పిల్లవాడి తల్లికీ.. పదివేల రూపాయలు ఏడాదికి ఇస్తానని పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన జగన్మోహన రెడ్డి.. సీఎం అయిన తర్వాత ఆ మొత్తాన్ని 15 వేలకు పెంచారు. అలా రాష్ట్రంలో గుర్తించిన 43 లక్షల మంది తల్లులకు ఒకేసారి 6456 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి జమచేసే పథకాన్ని జగన్ ప్రారంభించారు. ఇది రాష్ట్రమంతా హర్షించే విషయం.

అమ్మఒడి పథకం అనేది ఇక్కడితో అయిపోలేదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బిడ్డ చదువుకోదలచుకున్నా.. వారి చదువులకు సంబంధించిన పూచీ మొత్తం జగన్ ప్రభుత్వమే తీసుకుంటోంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాల చదువుల సమయంలో ఇలా తల్లులకు డబ్బులు చెల్లిస్తున్న సర్కారు.. ఆ తర్వాత విద్యావ్యవస్థకు మొత్తం పూచీగా నిలుస్తోంది. కళాశాల విద్యార్థులకు ఏ చదువులు చదువుతున్నా వారికి పూర్తిస్థాయిలో ఫీజు రీఇంబర్స్ మెంటు వస్తుంది. ఏడాదికి వారికి వసతి భోజన ఖర్చుల కోసం 20 వేల రూపాయల వంతున చెల్లిస్తారు. ఇలాంటి పథకాలన్నీ కూడా ఆచరణలోకి వస్తున్నాయి. ఈ లెక్కన… గరిష్టంగా ఎంత చదవదలచుకున్నా.. ఎవ్వరికీ ఎలాంటి ఆటంకాలూ లేని రాని పరిస్థితుల్ని జగన్ సృష్టించినట్లయింది.

రాష్ట్రంలో అక్కచెల్లెళ్లకు అన్నయ్యలా ఉంటా, పిల్లలకు మేనమామలా ఉంటా అని చెప్పుకున్న జగన్, అంతే శ్రద్ధగా వారందరి చదువులపై శ్రద్ధ పెడుతున్నారని అనిపిస్తోంది.

15వేల  రూపాయలు తీసుకుంటున్న తల్లులందరూ, తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలకు ఏడాదికి వెయ్యి వంతున ఎదురు చెల్లించాలని.. ఆ స్కూళ్లలో వసతులను మెరుగుపరచడానికి ఆ నిధులను ఖర్చు చేయాలని జగన్ సూచించడం కూడా గొప్ప నిర్ణయంగా కనిపిస్తోంది. దానివల్ల స్కూళ్లమీద పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా ఒక హక్కు ఏర్పడుతుంది. ఈ విషయంలో జగన్ ప్రజల నుంచి శెభాష్ అనిపించుకుంటున్నారు.