తన పెళ్లికి సంబంధించి కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు హీరో సాయితేజ్. ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తను కూడా సంబంధాలు చూడమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపాడు.
“నేనింకా పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేస్తుంటే, సంబంధాలు చూడమని మాత్రం చెప్పాను. అంతకుమించి నా పెళ్లిపై ఏదీ ముందుకు జరగలేదు. ఈలోగా మీడియా అంతా నా పెళ్లి వెనక పడింది. ప్రస్తుతానికైతే నాకు పెళ్లిపై పెద్దగా ఆలోచన లేదు. కానీ ఇంట్లో వాళ్లు మంచి సంబంధం తీసుకొచ్చి, అమ్మాయి బాగుందని చెబితే అప్పుడు ఆలోచిస్తాను. ఇంట్లో వాళ్లు మాత్రం నాకు పెళ్లి చేసేయాలని ఫిక్స్ అయ్యారు.”
ఇలా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు సాయితేజ్. ఈ సందర్భంగా సాయితేజ్ పెళ్లికి సంబంధించి రెండు అంశాలపై స్పష్టత వచ్చేసింది. వాటిలో ఒకటి పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇంట్లో చూసిన సంబంధమే చేసుకుంటానని, తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని సాయితేజ్ క్లారిటీ ఇచ్చినట్టయింది.
ఇక చిరంజీవి తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయంపై కూడా పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు సాయితేజ్. తన కొత్త సినిమా సాంగ్ రిలీజ్ చేస్తూ త్వరలోనే సోలో డేస్ ముగిసిపోతున్నాయంటూ చిరంజీవి రీసెంట్ గా ట్వీట్ చేశారు. అది నిజమేనంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు సాయితేజ్.