ఓ గాడ్ ఫాద‌రూ, మ‌రో నాయ‌కుడు.. ఇంకో సిటీ ఆఫ్ గాడ్!

ఒక క‌థ‌ను చెప్ప‌డం ఎలా మొద‌లుపెట్టాల‌నేది, క‌థ చెప్పినంత క‌ష్టం. క‌థ‌లోని ఒక్కో పాత్ర‌ను మ‌న‌కు ప‌రిచ‌యం చేయ‌డం అనేది సంక్లిష్టమైన అంశం. క‌థా, కాక‌ర‌కాయ లేకుండా తీసే సినిమాలకు ఈ సూత్రం వ‌ర్తించ‌క‌పోవ‌చ్చు…

ఒక క‌థ‌ను చెప్ప‌డం ఎలా మొద‌లుపెట్టాల‌నేది, క‌థ చెప్పినంత క‌ష్టం. క‌థ‌లోని ఒక్కో పాత్ర‌ను మ‌న‌కు ప‌రిచ‌యం చేయ‌డం అనేది సంక్లిష్టమైన అంశం. క‌థా, కాక‌ర‌కాయ లేకుండా తీసే సినిమాలకు ఈ సూత్రం వ‌ర్తించ‌క‌పోవ‌చ్చు కానీ, క‌థ చెప్పే పద్ధ‌తిలో మాత్రం ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లోనే ప్ర‌త్యేక‌మైన సినిమా 'సిటీ ఆఫ్ గాడ్'. ఒక రౌండ్ ట్రాలీ ఎఫెక్ట్ తో ప్రేక్ష‌కుడిని త‌న వెంట తీసుకెళ్లిపోయే ఈ సినిమా ద‌ర్శ‌కుడు… అనేక సార్లు ప్రేక్ష‌కుడికి షాకింగ్ ట్విస్టులు ఇస్తాడు! ఆ స‌ర్ ప్రైజ్ లు ఒక్కోసారి వ్వావ్ అనిపిస్తే, మ‌రి కొన్ని సార్లు వారెవ్వా! అనిపిస్తాయి. ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌ను రాయ‌డమంటూ జ‌రిగితే అందులో ప్ర‌త్యేక‌మైన పేజీల‌ను పొందే అర్హ‌త ఉన్న సినిమా 'సిటీ ఆఫ్ గాడ్'.  

ఈ సినిమాలో క‌థ‌ను చెప్ప‌డం మొద‌లుపెట్ట‌డ‌మే అత్యంత వైవిధ్య‌భ‌రిత‌మైన ఎత్తుగ‌డ‌తో మొద‌లుపెట్టి, అక్క‌డ నుంచి మ‌లుపులు తిప్పే ద‌ర్శ‌కుడి బ్రిలియ‌న్స్ కు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. 'న‌భూతో..' అనే రీతిలో ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసిన సినిమా 'సిటీ ఆఫ్ గాడ్'. క‌థా వ‌స్తువులంటే ఎక్క‌డో ఉండ‌వు, మనం వార్త‌ల్లో చూస్తున్న‌, వింటున్న అంశాలతోనే అద్భుత‌మైన సినిమాల‌ను తీయొచ్చ‌నే విష‌యానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ 'సిటీ ఆఫ్ గాడ్'. న్యూస్ పేప‌ర్ల‌లో అనునిత్యం ప్ర‌చురితం అయ్యే క్రైమ్ స్టోరీల‌ ఆధారంగా సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమానే ఇది.

ఏ స‌బ‌ర్బ‌న్ ఏరియాను ట‌చ్ చేసినా ఇలాంటి క‌థ‌లు కోకొల్ల‌లుంటాయి! క్రైమ్ ను గ్లోరిఫై చేస్తూ ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక క్లాసిక్స్ లాంటి సినిమాలొచ్చాయి. ఓ గాడ్ ఫాధ‌రూ, మ‌రో నాయ‌కుడు ఈ త‌ర‌హా వ్య‌క్తులే! సినీ ప్రియులను అమితంగా అల‌రించిన ఆ సినిమాల త‌ర‌హాలోదే 'సిటీ ఆఫ్ గాడ్'. గాడ్ ఫాద‌రూ, నాయ‌కుడు వంటి సినిమాల్లో ఎక్క‌డో ఒక చోట అయిన హీరో క‌నిపిస్తాడు,

క్రైమ్ కు హీరోయిజాన్ని ఆపాదించ‌బ‌డిన సినిమాల‌వి.‌ సిటీ ఆఫ్ గాడ్ కు మాత్రం హీరోయిజం ఆటంకాలు లేవు.  క్రైమ్ ను క్రైమ్ గా చూపించే సినిమా 'సిటీ ఆఫ్ గాడ్'. ఎవ్వ‌రినీ వెన‌కేసుకు వ‌చ్చే ఉద్దేశాలు క‌థ‌కుడికి లేవు. జ‌రిగింది.. జ‌రిగిన‌ట్టుగా.. చూపిస్తూ, ప్రేక్ష‌కుడిని మాత్రం రోల‌ర్ కోస్ట‌ర్ ఎక్కించి బోలెడ‌న్ని స‌ర్ ప్రైజ్ ల‌ను చూపిస్తాడు ఈ మూవీ మేక‌ర్.

ప్ర‌పంచంలో అత్యంత భిన్న‌మైన దేశాల్లో బ్రెజిల్ ఒక‌టి. పరాయి దేశ పాల‌కులు తెచ్చి పెట్టిన నాగ‌ర‌క‌త‌లు, వాటి మ‌ధ్య‌న ఉనికి చాటుకునే స్థానిక నాగ‌రక‌త‌ మ‌మేకం అయిపోయి మ‌నుగ‌డ సాగించే దేశ‌మ‌ది. ప్ర‌త్యేకించి యూరోపియ‌న్ల‌ను, అమెరిక‌న్ల‌నూ బ్రెజిల్ పార్టీ క‌ల్చ‌ర్ ఆక‌ర్షిస్తుంది. బ్రెజిల్ అంటే సాక‌ర్, బ్రెజిల్ అంటే ఉల్లాసం, బ్రెజిల్ అంటే ఉత్సాహం!

యూరోపియ‌న్ పాల‌కుల వ‌ల్ల బ్రెజిల్ భాష మారిపోయింది, బ్రెజిల్ అంద‌చందాల‌కు ముగ్ధులై బోలెడంత మంది తెల్ల జాతి వాళ్లు శ‌తాబ్దాల కింద‌ట బ్రెజిల్ లో సెటిలైపోయారు. తెల్ల‌వాళ్ల పాల‌న స‌మ‌యంలోనే ఆఫ్రిక‌న్ల‌ను బానిస‌లుగా తీసుకొచ్చారు. స్థానికులు, తెల్ల‌వాళ్లు, ఆఫ్రిక‌న్లు.. క‌ల‌గాపుల‌గం క‌ల్చ‌ర్. దాదాపు రెండు వంద‌లేళ్ల‌ కింద‌టే స్వ‌తంత్ర‌దేశంగా మారి అభివృద్ధి దిశ‌గా ప‌య‌నం ఆరంభించింది బ్రెజిల్. ప్ర‌స్తుతం బ్రెజిల్ ఒక అప్ప‌ర్ మిడిల్ స్థాయి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను క‌లిగిన దేశమ‌ని వ‌ర‌ల్డ్ బ్యాంక్ చెబుతోంది.

త‌న ఆర్థిక వ్య‌వ‌స్థ గురించి ఎక్కువ అంచ‌నాలు వేసుకుని బ్రెజిల్ లేని ఇక్క‌ట్ల‌లో ప‌డింద‌ని నిపుణులు చెబుతుంటారు. అలాంటి బ్రెజిల్ లో అభివృద్ధికి, వెనుక‌బాటు త‌నానికి మ‌ధ్య ఒక సంధీ ద‌శ‌లో ఒక మురికివాడ‌లోని ఒక చిన్న గ్యాంగ్ స్ట‌ర్ క‌థ 'సిటీ ఆఫ్ గాడ్'. 1960ల‌లో బ్రెజిల్ లోని ఒక ముఖ్య న‌గ‌రం రియో మురికివాడ‌ల్లో జ‌రిగిన య‌థార్థ క‌థ ఆధారంగా రూపొందిన సినిమా ఇది.  సంధీ కాలం ఏ ఊరికి అయినా ఉంటుంది, అందుకు వాటి స‌బ‌ర్బ‌న్ ఏరియాలే సాక్ష్యం. ఆ స‌బ‌ర్బ‌న్ ఏరియాలో లోక‌ల్ డాన్ లు పుట్టుకొస్తూ ఉంటారు. వారి రైజ్ అండ్ ఫాల్.. ఒక క్రైమ్ క‌థ అవుతుంది. అలాంటి క‌థే ఇది.

1950,60ల‌లో బ్రెజిల్ పాల‌కులు మ‌హా న‌గ‌రాలను నిర్మించే ప‌నిలో ప‌డ్డారు. వాటి నిర్మాణం కోసం రాళ్లెత్తే కూలీల‌ను ఊర‌వ‌త‌ల పెట్టారు. అవి మురికి వాడ‌లుగా ఏర్ప‌డ్డాయి. ఆర్థిక అస‌మాన‌త‌లు తీవ్ర‌మైన ప‌రిణామాల‌కు దారి తీశాయి. బోలెడ‌న్ని జాతుల ప్ర‌జ‌లు. ఒక‌రిపై ఒక‌రికి గౌర‌వం లేదు, సోద‌ర భావ‌మూ లేదు. తెల్ల‌వాడి వైభ‌వాన్ని చూస్తే న‌ల్ల‌వాళ్ల‌కు అసూయ‌. న‌ల్ల‌వాళ్ల‌ను నిగ్గ‌ర్స్ గా పిలుస్తూ త‌మ జాత్యాహంకారాన్ని చూపే తెల్ల‌వాళ్లు. ఎలాగైనా తెల్ల‌జాతి అతివను అనుభ‌విస్తే అంత‌క‌న్నా అదృష్టం లేద‌నే న‌ల్లజాతి టీనేజ‌ర్లు. ఈ ప‌రిస్థితుల్లో నేరాలు, హింస తీవ్రం అయ్యాయి. 

అలాంటి ప‌రిస్థితుల్లో.. రియోకు అనుకుని ఒక స‌బ్ అర్బ‌న్ ఏరియాలోని ఒక మురికివాడ‌లో.. సాగే ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ క‌థే 'సిటీ ఆఫ్ గాడ్'. ఆ మురికివాడ‌కు ప్ర‌భుత్వం పెట్టిన పేరే సిటీ ఆఫ్ గాడ్. ఆ దేవుడి న‌గ‌రంలో  మురికివాడ‌ల్లోని పిల్ల‌లకు కూడా తుపాకులు ల‌భించే ప‌రిస్థితుల్లో.. బాల్యంలోనే తుపాకీ ప‌ట్టి, దాన్ని అత్యంత రాక్షసంగా ప్ర‌యోగించి, చివ‌ర‌కు కొత్త‌గా తుపాకీ ప‌ట్టిన చిన్న పిల్ల‌ల చేతే హ‌త‌మ‌య్యే ఒక గ్యాంగ్ స్ట‌ర్ క‌థ ఇది.‌  

ఆకురాయితో సంబ‌రంగా క‌త్తిని నూరుతుంటారు కొంత‌మంది టీనేజ‌ర్లు. వాళ్ల ఉత్సాహాన్ని చూసి జ‌రిగేదేమిటో అర్థం చేసుకుని వారి చేతి నుంచి త‌ప్పించుకుని పారిపోతుంది ఒక కోడి. ఆ కోడిని ప‌ట్టుకునే స‌ర‌దాతో, అది త‌మకు దొరికి ఫ్రై కావ‌డం ఖాయ‌మ‌నే ఉత్సాహంతో.. దాన్ని వెంబ‌డించే కుర్రాళ్ల‌తో పాటు కెమెరా ప‌రుగులు తీస్తుంది. చేతిలో ఉన్న తుపాకుల‌ను కోడిని ల‌క్ష్యంగా చేసుకుని ఉప‌యోగించే ఆ టీనేజ‌ర్లు త‌మ గురి త‌ప్ప‌డంలోనూ మ‌జాను ఆస్వాధిస్తారు. పారిపోయే కోడిలో క‌నిపించే ప్రాణ‌భ‌య‌మే వారికి మాజానిస్తోంది.

కోడిని వెంబ‌డిస్తున్న వాళ్ల‌కు అనూహ్యంగా పోలీసులు ఎదుర‌వుతారు. ఆ మురికివాడ‌పై వార్తాక‌థ‌నాల నేప‌థ్యంలో లోక‌ల్ గ్యాంగుల‌ను అరెస్టు చేసిన‌ట్టుగా చూప‌డం, వాటాలు తీసుకుని పోలీసులు వారిని వ‌దిలేయ‌డం రొటీనే. దీంతో పోలీసులంటే భ‌యం లేదు. అటు పోలీసులూ, ఇటు లోక‌ల్ గ్యాంగ్ మ‌ధ్య‌లో ఓ కుర్రాడు చిక్కుకుంటాడు. కోడి త‌ప్పించుకుంది కానీ, ఈ కుర్రాడు ఇరు వ‌ర్గాల మ‌ధ్య‌న ఇరుక్కున్నాడు. అత‌డే సిటీ ఆఫ్ గాడ్ గురించి చెప్ప‌డం మొద‌లు పెడ‌తాడు.

క్లిప్ప‌ర్, షాగీ, గూసే.. మగ్గురు నునుగు మీసాల యువ‌కులు. క‌థ‌ను నెరేట్ చేసేది గూసే త‌మ్ముడు రాకెట్. మొద‌టి ముగ్గురు యువ‌కుల‌కూ గ్యాంగ్ స్ట‌ర్లు కావాల‌నేది డ్రీమ్.  త‌ను బ‌తికి ఉంటే.. ఎలాగైనా ఒక  ఫొటో జ‌ర్న‌లిస్టు అవుతాన‌నేది రాకెట్ న‌మ్మ‌కం. ఎవ‌రి ఆశ‌యాల‌కైనా ల‌క్ మీదో, క‌ష్టం మీదో న‌మ్మ‌కం ఉంటుంది. రాకెట్ కు మాత్రం త‌న చుట్టూ ఉంటే ప‌రిస్థితుల్లో త‌ను బ‌తికితే అనుకున్న‌ది సాధిస్తాన‌నే న‌మ్మ‌కం!

క‌థ మొత్తం మూడు చాప్ట‌ర్లుగా సాగుతుంది. 1960, 70స్ , 80 స్ లుగా క‌థ‌ను విభ‌జించారు. 60ల‌లో ఏడెనిమిదేళ్ల వ‌య‌సు క‌లిగిన ఒక పిల్లాడు మొద‌లు పెట్టే క్రైమ్ క‌థ 80ల‌లో ముగుస్తుంది. అంత చేసినా అత‌డు ఒక చిన్న స‌బ‌ర్బ‌న్ ఏరియాలో ఒక చిన్న డ్ర‌గ్ సప్ల‌య‌ర్ అవుతాడు. కానీ దాని కోసం అత‌డు ఎన్నో హ‌త్య‌లు చేస్తాడు, రాక్షసుడిలా ప్ర‌వ‌ర్తిస్తాడు, క్రైమ్ ను త‌న గ్లామ‌ర్ గా భావిస్తాడు.

గ్యాంగ్ స్ట‌ర్ క‌థ‌తో పాటు.. ఆ సమాజాన్ని ద‌ర్శ‌కుడు చూపించే ప‌ద్ధ‌తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. రియ‌ల్ సిటీ ఆఫ్ గాడ్ లో డ్ర‌గ్స్ స‌ప్లై గ్యాంగ్స్ లో క‌నీసం 20 వేల మంది టీనేజ‌ర్లు పని చేసే వార‌ట‌. పూర్తిగా వాస్త‌వ ప‌రిస్థితులు, వాస్తవ పాత్ర‌ల‌ను ఆధారంగా ముందుగా సిటీ ఆఫ్ గాడ్ పేరుతో ఒక న‌వ‌ల వ‌చ్చింది. ఆ న‌వ‌ల ఆధారంగా ఈ అద్భుత‌మైన సినిమా వ‌చ్చింది.

సినిమా ముగింపులో వాస్త‌వ వ్య‌క్తుల ఫొటోల‌ను, వీడియోల‌ను చూపిస్తారు. క‌థ‌ను నెరేట్ చేసే జ‌ర్న‌లిస్టు పాత్ర‌తో స‌హా ప్ర‌తి ఒక్క రోల్ కూడా నిజ‌మైన‌దే అని క్లైమాక్స్ లో చూపించే ఆధారాలు ప్రేక్ష‌కుడిని సంభ్ర‌మాశ్చ‌ర్యానికి గురి చేస్తాయి.  

ఒక క్రైమ్ క‌థ‌ను వ‌ర్ణ‌న‌లో.. మ‌ధ్య‌లో మిస్ అయ్యే ఒక పిల్లాడే అస‌లు పాత్ర‌ధారి అని ఇచ్చే ట్విస్ట్ తో ప్రేక్ష‌కుడిని షాకిస్తాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌లో మొద‌ట చూపే న‌లుగురు పిల్ల‌లు ఆ త‌ర్వాత ఎవ‌రేమ‌య్యారో చెబుతూ, ఒక్కోరి విష‌యంలో ఒక్కో ట్విస్ట్ ను ఇస్తూ.. సినిమా ఆసాంతం ఇలాంటి ట్విస్టుల‌ను మందుపాత‌రాల్లా పేర్చుకుంటూ పోయి, మ‌ధ్య‌మ‌ధ్య‌ల్లో వాటిని పేల్చుకుంటూ పోయే నెరేష‌న్ మ‌రే సినిమాలోనూ క‌నిపించ‌దు.

హాలీవుడ్ దిగ్ధ‌ర్శ‌కులు, ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ గురించి అద్భుత‌మైన సినిమాలు తీసిన‌ కొప్పోలా, స్కోర్సెసేలు ఈ విష‌యంలో బ్రెజిలియ‌న్ ద‌ర్శ‌కుడు ఫెర్నార్డో మెయిర్లెస్ ముందు కాసేపు చిన్న‌బోతారు! అయితే ఈ ద‌ర్శ‌కుడు మ్యాజిక్ ఈ సినిమా వ‌ర‌కూ ప‌రిమితం అయ్యింది. కొప్పోలా , స్కోర్సెసేలు త‌మ ప్ర‌తి సినిమానూ క్లాసిక్స్ గా మలిస్తే.. ఈ బ్రెజిలియ‌న్ ద‌ర్శ‌కుడు మాత్రం 2002లో ఈ సినిమాతో ప్ర‌పంచానికి కొత్త‌గా ప‌రిచ‌యం అయ్యాడు.

అంత‌కు ముందు పోర్చుగీస్ భాష‌లో ప‌లు సినిమాలు రూపొందించిన ఇత‌డు, సిటీ ఆఫ్ గాడ్ తో సంచ‌లనం రేపాడు. ఆ త‌ర్వాత ఇత‌డి ప్ర‌తి సినిమా మీద ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నించినా, గ‌త ఏడాది టూ పోప్స్ తో మాత్ర‌మే ఆక‌ట్టుకోగ‌లిగాడు.

సిటీ ఆఫ్ గాడ్ తో బ్రెజిల్ చిత్ర ప‌రిశ్ర‌మ మీదే ప్ర‌పంచం చూపు ప‌డింది. ఈ స్థాయి సినిమాను అందించ‌డంతో ఆక‌ట్టుకున్న ఆ ప‌రిశ్ర‌మ‌.. ఆ త‌ర్వాత మాత్రం ఆ స్థాయిని కొన‌సాగించ‌లేక‌పోయినట్టుంది.

ఈ క‌థ చెప్పే ప‌ద్ధ‌తిలో రాసిన వ్య‌క్తి పెన్ కు ధీటుగా క‌ష్ట‌ప‌డింది చిత్రీక‌రించిన కెమెరా. ఇదే క‌థ‌ను ఒక లినియ‌ర్ గా చెప్పి ఉంటే.. శ‌త‌కోటి సినిమాల్లో ఇదీ ఒక‌టి అయ్యేదేమో! స్క్రీన్ ప్లే అంటే నిర్వ‌చ‌నం కోసం ఏ డిక్ష‌న‌రీనో చూడ‌కుండా, సిటీ ఆఫ్ గాడ్ ను వీక్షిస్తే స‌రి!

వాస్త‌వ క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో భాగంగా తీవ్ర‌మైన హింసాత్మ‌క సీన్ల‌తో, ప‌చ్చిగా సాగే శృంగార స‌న్నివేశాల‌తో నిండి ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బోలెడ‌న్ని అవార్డుల‌ను పొందింది ఈ సినిమా. ఆస్కార్స్ విష‌యంలో నాలుగు కేట‌గిరిల్లో నామినేట్ అయ్యి, ఒక్క అవార్డును కూడా పొంద‌లేక‌పోయింది. అందుకు ప‌క్ష‌పాత ధోర‌ణి కాక మ‌రే కార‌ణం లేక‌పోవ‌చ్చు.

-జీవ‌న్ రెడ్డి.బి