విశాఖకు ఘనమైన విద్యా చరిత్ర ఉంది. పొరుగు జిల్లా విజయనగరం విద్యలనగరం. ఒకప్పుడు విశాఖలోనే విజయనగరం జిల్లా కూడా ఉండేది. ఇక 1926లోనే ప్రఖ్యాతి చెందిన ఆంధ్రా యూనివర్శిటీ విశాఖలో నెలకొల్పారు. సీఆర్ రెడ్డి, డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ వంటి ఉప కులపతుల ఏలుబడిలో ఏయూ విరాజిల్లింది.
అంతటి గొప్ప వారసత్వం ఉన్న ఏయూని సైతం పక్కన పెట్టి ఒక ప్రైవేట్ విద్యా సంస్థలను విశాఖలో ప్రోత్సహించిన టీడీపీ పాలకులు ఇపుడు విశాఖలో విద్యా రంగాన్నే వైసీపీ సర్కార్ కూల్చేసిందని పెడ బొబ్బలు పెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఏయూను నామమాత్రం చేసి ప్రైవేట్ యూనివర్శిటీగా గీతం ఎదిగేందుకు నాటి ఏలికలు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అని వైసీపీ నేతలే అంటున్నారు.
ఇక విశాఖలో గీతం డీమ్డ్ యూనివర్శిటీగా ఉండడం మంచిదే. అందుకోసం ప్రభుత్వం నామమాత్రపు ధరకు భూములు కూడా ఇచ్చింది. కానీ 40 ఎకరాలను ఆక్రమించుకోవడాన్ని టీడీపీ పెద్దలు ఎలా సమరిస్తారు అన్నదే వైసీపీ నేతల పాయింట్.
ఇక సదరు విద్యా సంస్థ చారిటీ సంస్థ కాదు కదా లక్షల ఫీజులను విద్యార్ధుల నుంచి వసూల్ చేస్తోంది కదా అంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఆక్రమణలు ఎవరు చేసినా ఖండించాల్సిన నేపధ్యంలో టీడీపీ నాయకులు మాత్రం వెనకేసుకువస్తున్నారని మంత్రి బొత్స సత్యనరాయణ లాంటి వారు అంటున్నారు.
మొత్తానికి విశాఖ ఖ్యాతి, విద్యా ప్రఖ్యాతి మంటగలిసిపోయాయని బావురుమంటున్న పచ్చ పార్టీ బ్యాచ్ ఏయూని అడ్డగోలుగా వాడేసుకుని ఆ భూములను కూడా లాగేసుకుని నామమాత్రం చేసినపుడు ఈ నోళ్ళు ఏమైపోయాయి అని వైసీపీ నేతలు అంటున్నారు.
ఏయూని దయ్యాల కొంప అని టీడీపీ పెద్దలే వ్యాఖ్యానించిన సంగతి చంద్రబాబు వంటి వారు మరచిపోతే ఎలా అని ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు అంటున్నారంటే టీడీపీ అడ్డంగా బుక్ అయినట్లే కదా.